

కొల్‌కతా : పశ్చిమ బెంగాల్‌లో జాతీయత, సంస్కృతి అంశాలపై రాజకీయ దుమారం రేగింది. టీఎంసీ, కమ్యూనిస్టు పార్టీలపై ముఖ్యమంత్రి సువేందు అధికారి తీవ్ర విమర్శలు చేశారు. వారిని ‘తుక్‌డే తుక్‌డే గ్యాంగ్’, ‘దిమాగీ నక్సల్స్’గా అభివర్ణించారు. బొద్దింకలకు కాకుండా ప్రధాని మోదీకి మద్దతు ఇవ్వాలని పిలుపునిచ్చారు. సోమవారం బెంగాల్‌లో ఓ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. గత టీఎంసీ ప్రభుత్వం జాతీయతను సరిగ్గా అర్థం చేసుకోలేదని ఆరోపించారు. బుజ్జగింపు రాజకీయాలతో రాష్ట్రాన్ని ‘గ్రేటర్ బంగ్లాదేశ్’గా మార్చేందుకు ప్రయత్నించిందని విమర్శించారు. ఇందులో భాగంగానే ప్రత్యేక రాష్ట్ర గీతం, జెండాను రూపొందించడంతోపాటు, బంగ్లాదేశ్‌లో వినియోగించే ‘జై బంగ్లా’ నినాదాన్ని స్వీకరించిందని ఆరోపించారు.
బెంగాల్ వారసత్వాన్ని దెబ్బతీస్తున్నారు
విద్యార్థుల్లో జాతీయ భావాలను పెంపొందించేందుకు విద్యాసంస్థల్లో ఏటా ఉపన్యాసాలు, క్విజ్‌లు, చర్చా పోటీలు నిర్వహించాలని ఆదివారం రామ్‌నగర్‌లో సువేందు అధికారి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా టీఎంసీ, కమ్యూనిస్టు పార్టీలపై విమర్శలు గుప్పించారు. ఆ పార్టీలు బెంగాల్ వారసత్వాన్ని, సంస్కృతిని దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు.
గత టీఎంసీ ప్రభుత్వం విద్యాసంస్థల్లో నేషనల్ క్యాడెట్ కార్ప్స్ (ఎన్‌సీసీ)లో చేరికలను అడ్డుకునేందుకు ప్రయత్నించిందని, దానికి బదులుగా ‘జై హింద్ వాహిణి’ని ప్రవేశపెట్టిందని ఆయన పేర్కొన్నారు. ఎన్‌సీసీలో శిక్షణ పొందడం వల్ల విద్యార్థులకు సాయుధ దళాల్లో అగ్నివీరులుగా ఎంపికయ్యే అవకాశాలు ఉంటాయని వ్యాఖ్యానించారు.