స్టార్‌లింక్‌కు అనుమతివ్వొద్దు.. కేంద్రానికి స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ డిమాండ్‌!

దేశంలో వాణిజ్యపరమైన శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలకు స్టార్‌లింక్‌ను అనుమతించవద్దని ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థ అయిన స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
Star Link Satellite Internet
Swadeshi Jagran Manch opposes Starlink launch in India
Published on: 

న్యూఢిల్లీ:ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్‌ భారత్‌లో సేవలు ప్రారంభించడంపై ఆర్‌ఎస్‌ఎస్‌ అనుబంధ సంస్థ అయిన స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. దేశంలో వాణిజ్యపరమైన శాటిలైట్‌ బ్రాడ్‌బ్యాండ్‌ సేవలకు స్టార్‌లింక్‌ను అనుమతించవద్దని మంగళవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. ఉపగ్రహాల ఆధారంగా ఇంటర్నెట్‌ అందించే ఈ సాంకేతికతతో సేవలపై నియంత్రణలు విధించడం, భద్రతాపరమైన నిఘా నిర్వహించడం సవాలుగా మారవచ్చని హెచ్చరించింది.

ప్రస్తుతం భారత్‌ పలు శాంతిభద్రతల సవాళ్లను ఎదుర్కొంటున్న నేపథ్యంలో స్టార్‌లింక్‌ సాంకేతికత దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందని స్వదేశీ జాగరణ్‌ మంచ్‌ జాతీయ కో–కన్వీనర్‌ అశ్వనీ మహాజన్‌ హెచ్చరించారు. సోషల్‌ మీడియాలో వదంతులు, దేశ వ్యతిరేక ప్రచారాలు వ్యాప్తి చెందేందుకు ఈ సాంకేతికత వేదికగా మారవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. వేర్పాటువాదం, ఉగ్రవాదం, అల్లర్లు, నిరసనల వంటి సందర్భాల్లో శాంతిభద్రతలను కాపాడేందుకు ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేయాల్సిన అవసరం ఉంటుందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లో స్టార్‌లింక్‌కు అనుమతులు ఇవ్వవద్దని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.