

కాబూల్: అంతర్జాతీయ వేదికపై దేశం తరఫున ప్రతిభ చాటి స్వదేశానికి చేరుకున్న ముగ్గురు ఆఫ్ఘనిస్తాన్ చెస్ క్రీడాకారులను తాలిబన్ పాలకులు అరెస్ట్ చేశారు. సమర్కండ్లో జరిగిన ప్రతిష్ఠాత్మక చెస్ ఒలింపియాడ్‌లో పాల్గొని తిరిగొచ్చిన ఖైబర్ ఫరాజీ, హబీబుల్లా అమిని, మహిళా జట్టు కెప్టెన్ హబీబుల్లా గుల్దూస్ట్లను సరిహద్దు వద్దే అదుపులోకి తీసుకున్నారు. వారి పాస్‌పోర్టులను స్వాధీనం చేసుకున్న అధికారులు, కాబూల్‌లోని వారి నివాసాల్లోనే గృహనిర్బంధంలో ఉంచారు. చెస్ ఆటను జూదంతో సమానంగా భావించే తాలిబన్లు, తమ దేశంలో ఆ ఆటపై విధించిన నిషేధాన్ని ఉల్లంఘించారన్న నెపంతో వీరిపై చర్యలకు దిగారు.
హిజాబ్ లేని మహిళల భాగస్వామ్యంపై ఆగ్రహం
అంతర్జాతీయ వేదికపై మువ్వన్నెల జెండాతో పోటీ పడటమే కాకుండా, ఆఫ్ఘన్ మహిళా క్రీడాకారులు హిజాబ్ లేకుండా పోటీల్లో పాల్గొనడంపై పాలకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే సరిహద్దు భద్రతా దళాలకు నేరుగా ఆదేశాలు ఇచ్చి వీరిని నిర్బంధించారు. జట్టులోని మరో క్రీడాకారుడు వేరే మార్గంలో దేశంలోకి ప్రవేశించగా, మిగిలిన మహిళా క్రీడాకారులంతా ఇప్పటికే విదేశాల్లో స్థిరపడటంతో ప్రస్తుతానికి క్షేమంగా ఉన్నారు. ప్రముఖ స్పానిష్ పత్రిక ఈ నిర్బంధ ఉదంతాన్ని అంతర్జాతీయ సమాజం దృష్టికి తీసుకువచ్చింది.
తీవ్ర శిక్షలపై పెరుగుతున్న ఆందోళన
షరియా చట్టం ప్రకారం జూదానికి పాల్పడిన వారికి చేతులు నరకడం లాంటి అతి క్రూరమైన శిక్షలు అమలు చేసే ప్రమాదం ఉండటంతో అంతర్జాతీయంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నిర్బంధంలో ఉన్న తమ క్రీడాకారులకు పూర్తి మద్దతు ఇస్తామని అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే) స్పష్టం చేసింది. యూరోపియన్ పార్లమెంట్‌లోనూ ఈ వ్యవహారాన్ని లేవనెత్తేందుకు రంగం సిద్ధమవుతోంది.