

న్యూఢిల్లీ: ఎండీఆర్ చార్జీల(MDR Charges)పై కేంద్రం తాత్కాలికంగా వెనక్కి తగ్గింది. మర్చంట్ డిస్కౌంట్ రేట్ చార్జీల అమలును దీపావళి వరకు వాయిదా వేయాలని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) నిర్ణయం తీసుకున్నది. మంగళవారం యూపీఐ అండ్ సర్వీసెస్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. తొలుత అక్టోబర్ 15 నుంచి ఈ చార్జీలను అమలు చేయాలని నిర్ణయించారు. కాగా వ్యాపారవర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తితో నిర్ణయాన్ని వాయిదా వేశారు. దీపావళి తర్వాత కొత్త అమలు తేదీని తర్వాత ప్రకటించనున్నట్టు ఎన్‌పీసీఐ తెలిపింది. పండుగ సీజన్‌లో డిజిటల్ చెల్లింపులు పెరుగుతాయని.. కొత్త చార్జీలను అమలుచేస్తే తమ వ్యాపార కార్యకలాపాలపై ప్రభావం పడే అవకాశం ఉందని వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు.
రూ.2 వేల కంటే ఎక్కువ విలువైన చెల్లింపులపై 0.4 శాతం ఎండీఆర్‌ను విధిస్తున్నట్టు గత సెప్టెంబర్‌లో యూపీఐ స్టీరింగ్ కమిటీ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రూ.2వేల పైబడి ఉన్న లావాదేవీపై రూ.8, రూ.10,000 చెల్లింపులపై రూ.40 అదనపు చార్జ్ విధించాలని నిర్ణయించారు. అయితే ఈ విధానం వ్యక్తిగత లావాదేవీలకు వర్తించదు. ఎంపిక చేసిన వ్యాపార లావాదేవీలకే పరిమితం చేశారు. రైల్వేలు, టెలికాం, బీమా, ఇంధనం, వ్యవసాయ ఇన్‌పుట్స్ వంటి ఎంపిక చేసిన రంగాల్లో రూ.2,000 దాటిన లావాదేవీలకు రూ.5 స్థిరమైన ఎండీఆర్‌ను నిర్ణయించారు.