

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ కొండ ప్రాంతాల్లో ఒక్కసారిగా భూమి కంపించింది. చమోలీ జిల్లా పరిధిలోని పర్వత శ్రేణులను కేంద్రంగా చేసుకుని రెక్టర్ స్కేలుపై 4.9 తీవ్రతతో బలమైన భూకంపం సంభవించింది. క్షణాల వ్యవధిలోనే దీని ప్రభావం దేశ రాజధాని ఢిల్లీతో పాటు పరిసర నగరాలకు విస్తరించింది. బహుళ అంతస్తుల భవనాలు ఒక్కసారిగా ఊగిపోవడంతో ఇళ్లలో ఉన్న సామాగ్రి కిందపడిపోయింది. భయకంపితులైన ప్రజలు తమ నివాసాలు, కార్యాలయాల ఖాళీ చేసి వీధుల్లోకి పరుగులు తీశారు. కొండ ప్రాంతాల్లోని మారుమూల గ్రామాల్లో గోడలకు పగుళ్లు రావడంతో స్థానికులు తీవ్ర ఆందోళన చెందారు. ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
హిమాలయాల కింద దాగివున్న పెను ప్రమాదం
భారత భూభాగ పలక నిరంతరం ఆసియా పలక వైపునకు చొచ్చుకుపోతూ ఏటా కొద్ది మిల్లీమీటర్ల మేర కదులుతోంది. ఈ ఘర్షణ కారణంగా హిమాలయ పర్వతాల అడుగున దశాబ్దాలుగా విపరీతమైన ఒత్తిడి, శక్తి పోగుపడుతున్నాయి. చిన్నపాటి ప్రకంపనలు కేవలం ఆ ఒత్తిడిలో కొద్ది భాగాన్ని మాత్రమే బయటకు విడుదల చేస్తున్నాయి. భూ అంతర్భాగంలో ఇంకా అత్యంత భయానకమైన శక్తి నిల్వలు నిక్షిప్తమై ఉన్నాయని భూగర్భ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 8 కంటే ఎక్కువ తీవ్రతతో కూడిన మహా భూకంపం సంభవించే అవకాశాలు హిమాలయ ముఖద్వారాల్లో పొంచి ఉన్నాయని శాస్త్రవేత్తలు చాలా కాలంగా చెబుతున్నారు.