శాస్త్రీయ ధ్రువీకరణతో ఆయుర్వేదంపై విశ్వాసం పెరుగుతుంది : ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్

ఆయుర్వేదానికి శాస్త్రీయ ఆధారాలతో ధ్రువీకరణ లభిస్తే రోగుల్లో విశ్వాసం పెరగడంతోపాటు, ప్రపంచ వ్యాప్తంగా సంప్రదాయ వైద్య విధానాలకు ఆదరణ పెరుగుతుందని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు.
 శాస్త్రీయ ధ్రువీకరణతో ఆయుర్వేదంపై విశ్వాసం పెరుగుతుంది : ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్
Published on: 

న్యూఢిల్లీ: ఆయుర్వేదానికి శాస్త్రీయ ఆధారాలతో ధ్రువీకరణ లభిస్తే రోగుల్లో విశ్వాసం పెరగడంతోపాటు, ప్రపంచ వ్యాప్తంగా సంప్రదాయ వైద్య విధానాలకు ఆదరణ పెరుగుతుందని ఉపరాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలో అఖిల భారత ఆయుర్వేద సంస్థ (ఏఐఐఏ) నిర్వహించిన ‘KAUMARACON- 2026’ బాల వైద్యశాస్త్రంపై అంతర్జాతీయ సదస్సులో గురువారం ఆయన ప్రసంగించారు. ఆయుర్వేద చికిత్సల శాస్త్రీయ విధానాలను అధ్యయనం చేయడంతోపాటు, వాటి ప్రభావశీలతను పరిశోధనల ద్వారా నిర్ధారించడంపై విద్యార్థులు, పరిశోధకులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ముఖ్యంగా విద్యార్థులు ఒక నిర్దిష్ట అంశాన్ని ఎంచుకొని, దానిపై ప్రత్యేక ఆసక్తితో పరిశోధనలు చేసి, అది ఎలా పనిచేస్తుందో నిర్ధారించాలి’ అని రాధాకృష్ణన్ పేర్కొన్నారు. సంప్రదాయ వైద్య పరిజ్ఞానాన్ని పరిరక్షించాల్సిన అవసరాన్ని ప్రస్తావిస్తూ.. ఆయుష్ మంత్రిత్వ శాఖ చేపడుతున్న కృషిని అభినందించారు. గతంలో ఈ పరిజ్ఞానంలో ఎక్కువ భాగం మౌఖిక సంప్రదాయం ద్వారా తరతరాలకు అందేదని, ప్రస్తుతం దానిని లిఖితపూర్వక గ్రంథాల రూపంలో భద్రపరచడం ప్రశంసనీయమన్నారు. శాస్త్రీయ క్రమశిక్షణ, రోగుల సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వాలని రాధాకృష్ణన్ స్పష్టం చేశారు. వ్యాధుల నివారణ, జీవనశైలి నిర్వహణలో ఆయుర్వేదం సహాయకారిగా ఉండగలదని, అయితే వ్యాధి నిర్ధారణ, అత్యవసర వైద్యం, శస్త్రచికిత్సలు, తీవ్రమైన వ్యాధుల చికిత్సలో ఆధునిక వైద్యం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. ఈ రెండు వైద్య విధానాలను బాధ్యతాయుతంగా సమన్వయం చేయడం అనేది శాస్త్రీయ ఆధారాలు, భద్రత, నాణ్యత, అమలులో ఉన్న వైద్య ప్రమాణాలపై గౌరవం ఆధారంగా జరగాలి అని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.