సిరా గుర్తు వేసినా..ఓటేయలేకపోయాం

West bengal Bypoll controversy
West bengal voters inked but 'not allowed' to vote
Published on: 

* బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ వాళ్లే మా ఓట్లు వేశారు

* బెంగాల్‌ ఉపఎన్నికల్లో ఓటర్ల నుంచి ఫిర్యాదులు

* రిజీనగర్, నందిగ్రామ్‌లో ఓటర్లను అడ్డుకున్నారు: సీపీఎం, కాంగ్రెస్ ఆరోపణలు

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో రిజీనగర్, నందిగ్రామ్ ఉప ఎన్నికలు జరిగిన తీరు వివాదాస్పదంగా మారింది. ‘పోలింగ్ కేంద్రంలో చేతి వేలిపై సిరా గుర్తు వేసిన తర్వాత కూడా..ఓటేయలేకపోయాం’ అని పలువురు ఓటర్లు వాపోయారు. ‘మీ ఓటు ఇప్పటికే పడిపోయింది’ అంటూ పోలింగ్ సిబ్బంది ఓటర్లను వెనక్కి పంపినట్టు జాతీయ మీడియాలో వార్తా కథనాలు వెలువడ్డాయి. ఉప ఎన్నికలపై సీపీఎం, కాంగ్రెస్, ఇతర పార్టీల అభ్యర్థులు తీవ్ర ఆరోపణలు చేశారు. ‘పోలీసుల పర్యవేక్షణలో ఓటర్లను భయపెట్టే వాతావరణం నెలకొన్నది’ అని కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్ రంజన్ చౌదరి ఆరోపించారు. రిజీనగర్‌లో పరిస్థితి భయంకరంగా ఉందని సీపీఎం అభ్యర్థి మహ్మద్ సయీద్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. సీపీఎం ఎన్నికల ఏజెంట్‌ హల్దార్ మాట్లాడుతూ, ‘ఎన్నికల ఏజెంట్‌ అని చెప్పినా పోలీసులు నా ఐడీ కార్డును బలవంతంగా తీసుకుని చింపేశారు. ఎన్నికల ఏజెంట్‌కే ఓటు వేయడానికి అవకాశం లేకపోతే, సాధారణ ఓటర్ల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు’ అని అన్నారు. ‘బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ వాళ్లే మా తరఫున ఓటు వేశారు’ అని మరో ఓటర్ రంజాన్ షేక్ కూడా ఆరోపించారు. కాగా, ప్రతిపక్షాల ఆరోపణలను అధికార బీజేపీ ఖండించింది. ఎన్నికలపై  ఫిర్యాదులను ముర్షిదాబాద్ జిల్లా పోలీసు అధికారి సచిన్ మక్కర్ తోసిపుచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసిందని అన్నారు.

నందిగ్రామ్‌లోనూ అంతే..

పోలింగ్ కేంద్రాలకు వెళ్లకుండా బీజేపీ కార్యకర్తలు, పోలీసులు అనేకమంది ఓటర్లను అడ్డుకున్నారని, ఓటర్లను బెదిరించారని కాంగ్రెస్, వామపక్ష పార్టీల కార్యకర్తలు ఆరోపించారు. హరిపూర్ గ్రామానికి చెందిన అనూప్‌కుమార్ మాట్లాడుతూ, ‘మా కుటుంబంతో పాటు చాలా కుటుంబాలు భయంతో పోలింగ్ కేంద్రాలకు వెళ్లలేకపోయాయి’ అని వాపోయారు. ‘నందిగ్రామ్‌లో పోలింగ్ ఒక ప్రహసనం. ఫాసిస్టు పద్ధతిలో అధికారాన్ని చేజిక్కించుకునే ప్రయత్నం జరగడం సిగ్గుచేటు’ అని కాంగ్రెస్ అభ్యర్థి మిలన్ ప్రధాన్ ఆరోపించారు.