వేల కోట్ల వ్యాపారంగా మారిన సుఖనిద్ర

నిద్రను వ్యాపారంగా మార్చుకుంటున్న కార్పొరేట్లు
world sleep economy
world sleep economyworld sleep economy
Published on: 

ప్రభాత ఉదయం, సెంట్రల్ డెస్క్: ఒకప్పటి పరిస్థితి గుర్తు చేసుకోండి. చీకటి పడిన తరువాత ఆరుబయట నులకమంచం వేసుకుని, చల్లగాలి తగులుతుంటే ఆకాశంలో చుక్కలు లెక్కపెడుతూ కన్నుమూస్తే చాలు.. తెల్లవారేదాకా ఏ లోకంలో ఉన్నామో తెలిసేది కాదు. అన్ని లోకాలు విహరించి తెల్లవారు జామున కోడి కూతతో మెలకువ వచ్చేది. కానీ నేడు? వేల రూపాయల లగ్జరీ ఫోమ్ పరుపులు ఉన్నాయి, రిమోట్‌తో పనిచేసే ఫ్యాన్లు, చల్లటి ఏసీలు ఉన్నాయి. కానీ, కంటినిండా నిద్ర మాత్రం కరువైంది. నిద్రపట్టేందుకు మాత్రలు మింగుతూ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నవారూ ఉన్నారు. ప్రకృతి మనిషికి సహజంగా ఇచ్చిన నిద్ర కోసం.. నేడు ప్రజలు గాడ్జెట్లు, పిల్స్ కొంటూ వేలల్లో ఖర్చు చేస్తున్నారు. దీంతో నిద్రను ట్రాక్ చేసే స్మార్ట్ వాచీలు, ధరించగలిగే గ్యాడ్జెట్లు, ఏఐ ఆధారిత యాప్‌లు మార్కెట్లోకి వచ్చాయి.

నిద్రను వ్యాపారంగా మార్చుకుంటున్న కార్పొరేట్లు

నిద్ర కరువై అల్లాడుతున్న జనం అవసరాన్ని కొన్ని కంపెనీలు వేల కోట్ల వ్యాపారంగా మార్చుకుంటున్నాయి. ఓ అంచనా మేరకు ప్రపంచవ్యాప్తంగా ఇది సుమారు 585 బిలియన్ల నుంచి 600 బిలియన్ డాలర్లకు చేరుకుంది. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది నిజం. దీనినే "స్లీప్ ఎకానమీ" అంటున్నారు. ఈ కొత్త పదం ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచాన్ని ఏలుతోంది. నిద్ర పట్టడానికి మార్కెట్లో దొరకని వస్తువంటూ లేదు. ప్రీమియం మ్యాట్రెస్‌లు, మెడకు సౌకర్యంగా ఉండే దిండ్లు స్పెషల్ నైట్ సూట్స్. తగినంత నిద్ర ఎలా పోవాలన్న విషయంలో కౌన్సెలింగ్ ఇచ్చే ఏజెన్సీలు కూడా తయారయ్యాయి. జనం నిద్రను కేవలం విశ్రాంతిగా కాకుండా, మరుసటి రోజు పని సామర్థ్యాన్ని పెంచే ఒక ముఖ్యమైన అంశంగా ప్రజలు గుర్తిస్తున్నారు.

సహజ నిద్రను తిరిగి పొందేదెలా?

నిద్ర ఎందుకు దూరమైందంటే సమాధానం చాలా సులభం. పడుకునే ముందు కూడా అరచేతిలో మెరిసే మొబైల్ స్క్రీన్ల బ్లూలైట్.. మన మెదడును తప్పుదోవ పట్టిస్తోంది. "ఇంకా రాత్రి కాలేదు పగలే ఉంది" అని భ్రమింపజేస్తోంది. మెలటోనిన్ అనే నిద్ర హార్మోన్ ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల మంచం మీద అటూ ఇటూ దొర్లడమే మిగులుతోంది. లైట్లు ఆర్పేసినా ఆలోచనల రీల్స్ తిరుగుతూనే ఉన్నాయి. విచిత్రమేమిటంటే, ఈ సమస్య నుంచి బయటపడటానికి ఖరీదైన పరికరాలు ఏవీ అక్కర్లేదు. పడుకోవడానికి ఒక గంట ముందు స్క్రీన్లను పక్కన పెట్టడం, కాస్త మనశ్శాంతిగా గడపడమే అసలైన పరిష్కారం. నాగరికత పేరిట ఎన్నో సుఖాలను కొనుక్కున్న ఆధునిక మనిషి... ప్రకృతి ఇచ్చిన అత్యంత విలువైన వరమైన 'ప్రశాంతమైన నిద్ర'ను మాత్రం పోగొట్టుకుని, మళ్లీ దానికోసమే మార్కెట్ల వెంట పరుగులు తీస్తున్నాడు!