

ప్రభాత ఉదయం, ఆదిలాబాద్ : “పంటలు సాగు చేయొద్దని చెబుతున్న రేవంత్ రెడ్డికి సీఎం పదవి ఎందుకు, ఆయన పదవి నుంచి దిగిపోవాలి” అని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 20 మండలాలు కరువుతో అల్లాడిపోతున్నాయని, రైతుల సంక్షేమం కోసం ఏం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో శుక్రవారం నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో ఆమె మాట్లాడారు. రాష్ట్రంలో కరువు రాగానే తుమ్మడిహెట్టి కట్టేందుకు సీఎం మహారాష్ట్ర వెళ్లారని, ఆ ప్రాజెక్ట్ కట్టాలని తాము ముందు నుంచీ డిమాండ్ చేస్తున్నా పట్టించుకోలేదని విమర్శించారు. “ఆదిలాబాద్‌లో బీఆర్ఎస్ నిర్వహించేది గర్జన కాదు.. తర్జన భర్జన, మొన్న సిద్దిపేటలో నిర్వహించిన సభకు అక్కడి బాబు.. సిరిసిల్ల బాబుని పిలవలేదు, ఆదిలాబాద్‌లో నిర్వహించే సభకు ఆయన్ను పిలవడం లేదు” అని ఎద్దేవా చేశారు. పదేళ్లు అధికారంలో ఉండి జిల్లాకు యూనివర్సిటీ, ఇంజినీరింగ్ కాలేజీ మంజూరు చేయలేదని, గతంలో పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్ సీసీఐని ఎందుకు తెరిపించలేకపోయారని ప్రశ్నించారు. జిల్లాకు మొదట బీఆర్ఎస్, తర్వాత కాంగ్రెస్, బీజేపీ మోసం చేశాయన్నారు. పత్తి అధికంగా పండించే జిల్లాలో టెక్స్ట్టైల్స్ పార్కు ఎందుకు ఏర్పాటు చేయలేదో చెప్పిన తర్వాతే సభ నిర్వహించాలని స్పష్టం చేశారు. ఈ ప్రాంత బీజేపీ ఎమ్మెల్యేలు పాయల్ శంకర్, హరీశ్‌బాబు సీఎంతోనే ఉంటారన్నారు. బీజేపీ మతాల మధ్య పంచాయితీ పెట్టి కాలం వెళ్లదీసే కుట్ర చేస్తోందని ఆరోపించారు. తాము సామాజిక న్యాయాన్ని పాటిస్తున్నామని, ఇందులో భాగంగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేదలకు టికెట్లు కేటాయించామని గుర్తు చేశారు. సభకు మాజీ ఎమ్మెల్యేలు రాథోడ్ బాపురావు, బోడ జనార్దన్ హాజరయ్యారు.