ఉప ఎన్నికకు ముందే ఖైరతాబాద్‌లో ట్విస్ట్‌.. కోర్టు తీర్పుతో విజయారెడ్డి ఎమ్మెల్యే అవుతారా?

Khairatabad By Election
Published on: 

రాష్ట్రంలో ఖైరతాబాద్ ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది.  ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక తధ్యం అందరూ భావిస్తున్న తరుణంలో దానం నాగేందర్‌ ఎన్నిక చెల్లదంటూ కాంగ్రెస్‌ నాయకురాలు విజయారెడ్డి గతంలో దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌పై ఇటీవల హైకోర్టులో విచారణ సందర్భంగా చోటు చేసుకున్న పరిణమాలు  ఖైరతాబాద్‌ వ్యవహారంలో కొత్త ట్విస్ట్‌కు తెరతీశాయి. విజయారెడ్డికి అనుకూలంగా తీర్పు వస్తే.. ప్రస్తుత పరిణామాల ప్రకారం హైకోర్టు ఆమెను ఎమ్మెల్యేగా ప్రకటించే అవకాశం కూడా ఉంది. గతంలో ఇలాంటి ఎన్నికల వివాదాల్లో సమీప ప్రత్యర్థిని ఎన్నికైన అభ్యర్థిగా ప్రకటించిన సందర్భాలు ఉన్నాయి. దీంతో  ఖైరతాబాద్‌కు ఉప ఎన్నిక వస్తుందా? లేక కోర్టు తీర్పుతోనే ఎమ్మెల్యే ఎవరో తేలిపోతుందా? అనే ఆసక్తి అందరిలో కనిపిస్తుంది.

పిటిషన్‌ ఏమిటి?

2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్‌ నుంచి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా దానం నాగేందర్‌,  కాంగ్రెస్‌ అభ్యర్థిగా విజయా రెడ్డి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో దానం 22,104 ఓట్ల మెజార్టీతో విజయా రెడ్డి మీద విజయం సాధించారు. అయితే  ఈ ఎన్నికపై విజయారెడ్డి న్యాయపోరాటానికి దిగారు. 2024 జనవరి 20న తెలంగాణ హైకోర్టులో ఎన్నికల పిటిషన్‌ దాఖలు చేశారు. దానం నాగేందర్‌ తన ఎన్నికల అఫిడవిట్‌లో ముఖ్యంగా Form-26లో భార్య, ఆధారపడిన వారి ఆస్తులకు (Suppression of material assets) సంబంధించిన కీలక సమాచారాన్ని పూర్తిగా వెల్లడించలేదని, ఆ విధంగా ఈ సమాచారాన్ని దాచిపెట్టడం ఎన్నికల చట్టాల పరిధిలో తీవ్రమైన అంశమని ఆమె వాదించారు. ఈ విధంగా ఎన్నికలకు సంబంధించిన కీలక సమాచారాన్ని దాచడం ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధనలకు విరుద్ధమని, అందువల్ల దానం నాగేందర్‌ ఎన్నికను రద్దు చేయాలని ఆమె హైకోర్టును కోరారు. అంతేకాదు.. 2023 ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన తనను ఖైరతాబాద్‌ నుంచి ఎన్నికైన అభ్యర్థిగా ప్రకటించాలని కూడా పిటిషన్‌లో కోరారు.

ఉప ఎన్నికకు పిటిషన్‌‌తో ముడి

దానం నాగేందర్‌ 2023లో బీఆర్‌ఎస్‌ తరఫున ఖైరతాబాద్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం కాంగ్రెస్‌లో చేరి 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేయడంతో ఆయనపై పార్టీ ఫిరాయింపుల అంశం తెరపైకి వచ్చింది. ఈ వ్యవహారంలో 2026 సెప్టెంబర్‌ 18న హైకోర్టు దానం నాగేందర్‌ను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించింది. దీంతో ఖైరతాబాద్‌ అసెంబ్లీ స్థానం ఖాళీగా మారింది. సహజంగానే అక్కడ ఉప ఎన్నిక తప్పదన్న చర్చ మొదలైంది. అయితే ఇక్కడే ఊహించని ట్విస్ట్‌ చోటుచేసుకుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల ఫలితాన్ని సవాల్‌ చేస్తూ తాను దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ ఇంకా హైకోర్టులో పెండింగ్‌లో ఉందని విజయారెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఆ పిటిషన్‌పై తుది తీర్పు వచ్చే వరకు ఖైరతాబాద్‌ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ చేయకుండా కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్‌పై 2026 అక్టోబర్‌ 1న హైకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా.. విజయారెడ్డి దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ తేలే వరకు ఖైరతాబాద్‌ ఉప ఎన్నికకు నోటిఫికేషన్‌ జారీ చేయబోమని ఎన్నికల సంఘం తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.  దీంతో ఖైరతాబాద్‌ ఉప ఎన్నిక..విజయారెడ్డి దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌తో ముడిపడింది.

వనమా ఎన్నిక రద్దు..! విజయారెడ్డి కేసులో ఇదే కీలకమా?

ఆస్తులకు సంబంధించి అంశాన్ని దాచిపెట్టారనే కారణంతో ఎమ్మెల్యే ఎన్నిక రద్దు చేసిన సందర్భం తెలంగాణలో ఉంది.  2023 జులై 25న కొత్తగూడెం అప్పటి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నికను తెలంగాణ హైకోర్టు రద్దు చేసింది. ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులకు సంబంధించిన కీలక వివరాలను దాచారన్న ఆరోపణలను పరిగణనలోకి తీసుకున్న కోర్టు.. ఆయన ఎన్నిక చెల్లదని ప్రకటించింది. 2018 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా వనమా వెంకటేశ్వరరావు, బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా జలగం వెంకటరావు పోటీ చేశారు. డిసెంబర్‌ 11, 2018న వెలువడిన ఫలితాల్లో వనమా 4,139 ఓట్ల మెజార్టీతో జలగంపై విజయం సాధించారు. అయితే నామినేషన్ సమయంలో వనమా వెంకటేశ్వరరావు సమర్పించిన ఎలక్షన్ అఫిడవిట్ (Form-26)లో తీవ్రమైన నిబంధనల ఉల్లంఘన జరిగిందని ఆరోపిస్తూ 2019 ప్రారంభంలో జలగం వెంకటరావు తెలంగాణ హైకోర్టులో ఎలక్షన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌లో వనమా వెంకటేశ్వరరావు, ఆయన కుటుంబ సభ్యులకు చెందిన వ్యవసాయ భూములు, నివాస స్థలాలు, ఆస్తుల వివరాలను కావాలని దాచిపెట్టారని (Non-disclosure of Assets), 2004, 2009, 2014 ఎన్నికల్లో చూపించిన ఆస్తులను 2018లో పొందుపరచకపోవడమే కాకుండా పెండింగ్ క్రిమినల్ కేసుల వివరాలను కూడా పూర్తిగా వెల్లడించలేదని ఆరోపించారు. ఈ కేసును నాలుగున్నరేళ్లపాటు విచారించిన తెలంగాణ హైకోర్టు 2023 జులై 25న  తీర్పునిచ్చింది. అఫిడవిట్‌లో నిజాలను దాచిపెట్టినందుకు గాను వనమా వెంకటేశ్వరరావు ఎన్నికను చెల్లదని రద్దు చేయడమే కాకుండా, ఆయనకు రూ. 5 లక్షల జరిమానా విధించింది. అంతేకాకుండా, ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం ఆ ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకటరావును 2018 డిసెంబర్ 12 నుంచే కొత్తగూడెం శాసనసభ్యుడిగా (MLA) ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది. అయితే, హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ వనమా వెంకటేశ్వరరావు అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, 2023 ఆగస్టు 7న విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు హైకోర్టు ఉత్తర్వులపై మధ్యంతర స్టే (Interim Stay) విధించింది. సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో జలగం వెంకటరావు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం లేకుండా పోయింది, ఆ తర్వాత కొద్ది నెలల్లోనే నవంబర్/డిసెంబర్ 2023 సార్వత్రిక ఎన్నికల గడువు సమీపించడంతో ఆ వివాద ప్రక్రియ ముగిసింది.

వనమా వెంకటేశ్వరరావు కేసులో జలగం వెంకటరావును ఎమ్మెల్యేగా ప్రకటించినట్లే.. దానం కేసులో విజయారెడ్డికి అనుకూలంగా తీర్పు వస్తే ఆమెను ఎమ్మెల్యేగా ప్రకటించే అవకాశం ఉందని కొందరు న్యాయ నిపుణుల అభిప్రాయం. ఈ రెండు కేసుల్లోనూ ఎన్నికల అఫిడవిట్‌లో ఆస్తులకు సంబంధించిన వివరాల వెల్లడే ప్రధాన అంశంగా ఉండటం ఆసక్తికర పరిణామం. అయితే జలగం-వనమా కేసు, విజయారెడ్డి-దానం కేసులను ఒకేలా చూడలేం. విజయారెడ్డికి అనుకూలంగా పరిణామాలు సాగాలంటే.. ముందుగా ఆమె ఎన్నికల పిటిషన్‌లో చేసిన ఆరోపణలు హైకోర్టులో రుజువు కావాలి. ముఖ్యంగా దానం నాగేందర్‌ ఎన్నికల అఫిడవిట్‌లో కీలక ఆస్తుల వివరాలను వెల్లడించలేదన్న ఆమె వాదనలను కోర్టు అంగీకరించి, అవి ఆయన ఎన్నికను రద్దు చేయడానికి సరిపడే న్యాయపరమైన కారణాలని నిర్ధారించాలి. ఆ తర్వాతే ఆమెను ఎన్నికైన అభ్యర్థిగా ప్రకటించాలా? లేక ఇతర ఉపశమనం ఇవ్వాలా? అన్నది హైకోర్టు నిర్ణయిస్తుంది.

ఎప్పుడూ తీర్పు వస్తుంది?

ఇక్కడ మరో కీలక ప్రశ్న ఎదురవుతోంది. గతంలో కొత్తగూడెం ఎన్నికల వివాదంలో జలగం వెంకటరావు దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌పై హైకోర్టు తీర్పు వెలువడేందుకు దాదాపు ఐదేళ్ల సమయం పట్టింది. 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దాఖలైన ఆ పిటిషన్‌లో.. 2023 జులై 25న హైకోర్టు వనమా వెంకటేశ్వరరావు ఎన్నికను రద్దు చేసి, జలగం వెంకటరావును ఎమ్మెల్యేగా ప్రకటించింది. ఇప్పుడు ఖైరతాబాద్‌ విషయానికి వస్తే.. విజయారెడ్డి 2024 జనవరిలో దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌కు కూడా దాదాపు మూడేళ్లు కావస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న ఆ పిటిషన్‌ ఎప్పుడు తుది విచారణకు వస్తుంది? విచారణ పూర్తయి తీర్పు ఎప్పుడు వెలువడుతుంది? అన్నది ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది.

విజయారెడ్డికి అనుకూలంగా తీర్పు వస్తే..ఉప ఎన్నిక ఉండదా?

హైకోర్టు విజయారెడ్డికి అనుకూలంగా తీర్పు ఇస్తే ఖైరతాబాద్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా ఉపఎన్నిక (By-election) నిర్వహించాల్సిన అవసరం అసలే ఉండదు. ప్రజాప్రాతినిధ్య చట్టం, 1951 ప్రకారం ఎలక్షన్ పిటిషన్‌లో గెలిచిన అభ్యర్థి ఎన్నిక చెల్లదని కోర్టు రద్దు చేసినప్పుడు, ఆ ఎన్నికల్లో రెండవ స్థానంలో నిలిచిన పోటీదారుని నేరుగా విజేతగా (ఎమ్మెల్యేగా) ప్రకటించే చట్టపరమైన అధికారం న్యాయస్థానానికి ఉంటుంది. హైకోర్టు గనుక విజయారెడ్డి వాదనతో ఏకీభవించి దానం నాగేందర్ అఫిడవిట్ నిబంధనలను ఉల్లంఘించారని నిర్ధారిస్తే, ఆమెను నేరుగా ఖైరతాబాద్ శాసనసభ్యురాలిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరిస్తుంది. అదే సమయంలో విజయారెడ్డి పిటిషన్‌ ను కొట్టివేస్తే  ఖైరతాబాద్‌ ఉప ఎన్నికకు మార్గం సుగమం కావచ్చు. ఒక వేళ దానం ఎన్నికను మాత్రమే రద్దు చేసి, విజయారెడ్డిని ఎన్నికైన అభ్యర్థిగా ప్రకటించకపోతే  ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంటుంది.  కాబట్టి ఖైరతాబాద్‌ విషయంలో అసలు కీలకమైన అంశం.. విజయారెడ్డి పిటిషన్‌ మీద వచ్చే తీర్పు ఖైరతాబాద్ భవితవ్యాన్ని నిర్ణయిస్తుంది.