

సుప్రీంకోర్టు తీర్పుతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయింది. దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టులోనూ ఊరట లభించలేదు. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన అనర్హత వేటును అత్యున్నత న్యాయస్థానం సమర్థించడంతో ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి–మార్చి మధ్య ఉత్తరప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఆయా ఎన్నికల సమయంలోనే ఖైరతాబాద్ ఉప ఎన్నిక నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్ నియోజకవర్గ భౌగోళిక, రాజకీయ చరిత్రను తెలుసుకుందాం..
ఒక్క నియోజకవర్గం.. నాలుగు నియోజకవర్గాలుగా చీలింది!
ఖైరతాబాద్ నియోజకవర్గానికి రాజకీయంగానే కాదు.. భౌగోళికంగానూ ప్రత్యేకమైన చరిత్ర ఉంది. నియోజకవర్గాల పునర్విభజనకు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనే అతిపెద్ద అసెంబ్లీ నియోజకవర్గంగా ఖైరతాబాద్ గుర్తింపు పొందింది. 2004 అసెంబ్లీ ఎన్నికల నాటికి ఇక్కడ ఏకంగా 7,51,715 మంది ఓటర్లు ఉన్నారు. 2009లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనతో ఆ భారీ నియోజకవర్గం రూపురేఖలే మారిపోయాయి. అప్పటి ఖైరతాబాద్ నుంచి శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్.. ఇలా నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఆవిర్భవించాయి. ఒకే నియోజకవర్గం నుంచి ఏకంగా నాలుగు నియోజకవర్గాలు ఏర్పడ్డాయంటే.. ఒకప్పుడు ఖైరతాబాద్ ఎంత విస్తారంగా ఉండేదో అర్థం చేసుకోవచ్చు.
ఖైరతాబాద్ పేరుకు.. ఓ చరిత్ర
ఖైరతాబాదుకు ఆ పేరు రావడం వెనుక పెద్ద చరిత్ర ఉంది. హైదరాబాద్ ను పాలించిన కులీ కుతుబ్ షా కుమార్తె ఖైరతున్నీసా బేగం తీవ్ర అస్వస్థతకు గురైన సమయంలో వైద్యుల సూచనతో ఆమెను ఆహ్లాదకర వాతావరణంలో ఉంచే నిమిత్తం నౌబత్ పహడ్ (బిర్లామందిర్) ప్రాంతాన్ని ఎంచుకున్నారు. అక్కడే ఖైరతున్నీసా ఆరోగ్యం కుదటపడింది. మరణానంతరం కూడా తన భౌతిక దేహాన్ని అక్కడే సమాధి చేయాలని కోరుకుంది. ఇందుకోసం ఆమె బతికి ఉన్నప్పుడే ఒక టూంబ్ నిర్మించుకున్నారు. ఖైరుతున్నీసా బేగం టూంబ్ పేరిట కాలక్రమేణా ఈ ప్రాంతం పేరు ఖైరతాబాద్ గా స్థిరపడింది. అయితే ఆమె హజ్ యాత్రకు వెళ్లి అక్కడే కాలం చేయడంతో టూంబ్‌లో సమాధి చేయలేకపోయారు.
రాజకీయాలకు, పరిపాలనకు గుండెకాయ
తెలంగాణ రాజకీయ, కీలకమైన పరిపాలన విభాగాలు, ఆధ్యాత్మిక, పర్యాటక ప్రాంతాలు ఈ నియోజకవర్గంలోనే ఉన్నాయి. రాష్ట్ర పరిపాలనకు గుండె కాయ లాంటి సచివాలయం, రాష్ట్ర శాసనసభ, శాసనమండలి, గవర్నర్ నివసించే లోక్‌భవన్, ఎమ్మెల్యే కాలనీ, మినిస్టర్స్ క్వార్టర్స్, అనేక ప్రభుత్వ కార్యాలయాలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నివాస సముదాయాలు, ప్రభుత్వ అతిథి గృహాలు, సీని తారలు ఉండే ఫిలింనగర్, టాంక్ బండ్, నెక్లెస్ రోడ్, నాణేలను ముద్రించే మింట్ కాంపౌండ్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్యాలయం, రవీంద్రభారతి, హుస్సేన్ సాగర్, బిర్లా మందిర్, బిర్లా ప్లానిటోరియం, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యాలయం, ప్రెస్ క్లబ్, రాష్ట్ర పోలీస్ శాఖ కమాండ్ కంట్రోల్ సెంటర్, పూరీ జగన్నాథ్ ఆలయం, ప్రఖ్యాత నిమ్స్ ఆస్పత్రి ఖైరతాబాద్ నియోజకరవర్గంలోనే ఉన్నాయి.
ఖైరతాబాద్ అంటేనే బడా గణేష్!
ఖైరతాబాద్ పేరు వినగానే ముందుగా గుర్తుకొచ్చేది బడా గణేష్. వినాయక చవితి సందర్భంగా ఇక్కడ కొలువుదీరే భారీ గణేష్ విగ్రహం దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు పొందింది. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యంత ఎత్తైన గణేష్ విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ మహా గణపతిని దర్శించుకునేందుకు లక్షలాది మంది భక్తులు ఖైరతాబాద్‌కు తరలివస్తుంటారు. ఈ సంప్రదాయానికి సుదీర్ఘ చరిత్ర ఉంది. 1954లో ప్రారంభమైన ఖైరతాబాద్ గణేష్ ఉత్సవాలు.. కాలక్రమంలో నగరానికే ప్రత్యేక ఆకర్షణగా మారాయి. అందుకే ఖైరతాబాద్ పేరు వినిపించినా ప్రతి సారి బడా గణేష్ రూపం గుర్తుకురావడం సహజం.
నాలుగు దిక్కులా విస్తరించిన నియోజకవర్గం
ఖైరతాబాద్ నియోజకవర్గం కూడా ఒకే ప్రాంతానికి పరిమితం కాలేదు.. హైదరాబాద్ నడిబొడ్డున నాలుగు దిక్కులా విస్తరించి ఉన్న నియోజకవర్గం. ఖైరతాబాద్, సోమాజిగూడ, రాజ్‌భవన్ రోడ్, పంజాగుట్ట, బంజారాహిల్స్, హిమాయత్‌నగర్, నారాయణగూడ, హైదర్‌గూడ, లక్డీకాపూల్, ఎర్రమంజిల్, ఫిలింనగర్, బీఎస్ మక్తా, ఎంఎస్ మక్తా, ప్రేమ్‌నగర్, నవీన్‌నగర్, ద్వారకాపురి కాలనీ తదితర ప్రాంతాలు దీని పరిధిలో ఉన్నాయి. జూబ్లీహిల్స్‌లోని కొన్ని ప్రాంతాలతో పాటు బషీర్‌బాగ్, కింగ్‌కోఠిలోని కొంత భాగం కూడా ఇందులోకి వస్తుంది. ఇలా చూస్తే.. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం వైపులా విస్తరించిన విభిన్న ప్రాంతాలను కలుపుకుంటూ ఖైరతాబాద్ ప్రత్యేక భౌగోళిక స్వరూపాన్ని కలిగి ఉంది.
ఓటర్ల జాబితాలో సర్ ట్విస్ట్
సర్ ప్రక్రియ ప్రారంభానికి ముందు ఖైరతాబాద్ నియోజకవర్గంలో 2,96,036 మంది ఓటర్లు ఉన్నారు. సర్ ప్రక్రియలో భాగంగా తొలగించిన తొలగించిన బోగస్/ఏస్డీడీ ఓట్లర్ల సంఖ్య 1,23,472 (మరణించినవారు, నివాసం మారినవారు, ఆచూకీ లేనివారు, డూప్లికేట్ ఓటర్లు). అంటే దాదాపు 41 శాతం మంది ఓటర్లను తొలగించారు. ఒక నియోజకవర్గం పరిధిలో ఏకంగా 1.23 లక్షల ఓట్లను ఒకేసారి తొలగించడం ఒక రికార్డు. దీంతో ప్రస్తుతం మిగిలిన ఓటర్ల సంఖ్య 1,72,564. సర్ ప్రక్రియ ముగిసిన తర్వాత, ఉప ఎన్నిక నిర్వహించే నాటికి దాదాపు 2 లక్షలకు అటు, ఇటుగా ఓటర్లు ఉండే అవకాశం ఉంది.
కాంగ్రెస్ కంచుకోట..పీజేఆర్ అడ్డా
ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం 1967లో ఉనికిలోకి వచ్చింది. సికింద్రాబాద్ లోకసభ పరిధిలో ఈ నియోజకవర్గం ఉంటుంది. 1967 నుంచి 2023 వరకు సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికలు కలిపి మొత్తం సార్లు 15 ఈ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎన్నికలు నిర్వహించారు.
1967 నుంచి 2023 వరకు జరిగిన 15 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా 9 సార్లు (1967, 1972, 1978, 1985, 1989, 1994, 2004, 2008, 2009) విజయం సాధించింది. తర్వాత బీఆర్ఎస్ 2 సార్లు (2018, 2023), టీడీపీ 2 సార్లు (1983, 1999) గెలిస్తే, బీజేపీ (2014), టీపీఎస్ (1970) చెరోక్క సారి విజయం సాధించాయి.
1967లో గెలిచిన బి.వి.గురుమూర్తి (కాంగ్రెస్) ఈ నియోజకవర్గానికి తొలి ఎమ్మెల్యే. ఆయన మరణంతో 1970లో వచ్చిన ఉప ఎన్నికలో ఎన్.కృష్ణారావు (టీపీఎస్) విజయం సాధించారు. 1972లో కృష్ణా రావు మరోసారి కాంగ్రెస్ టికెట్ మీద గెలిచారు.
ఈ నియోజకవర్గం నుంచి పి.జనార్ధన్ రెడ్డి అత్యధికంగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన 1978, 1985, 1989, 1994, 2004 ఎన్నికల్లో విజయం సాధించారు. జనార్ధన్ రెడ్డి మరణంతో 2008లో వచ్చిన ఉప ఎన్నికలో ఆయన తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి గెలుపొందారు.
1983లో మాధవరం రామచంద్ర రావు (టీడీపీ), 1999లో కె.విజయరామారావు (టీడీపీ) గెలిచారు. 2014లో బీజేపీ అభ్యర్ధి చింతల రామచంద్రారెడ్డి ఎమ్యేల్యేగా గెలిచారు.
2009లో కాంగ్రెస్ అభ్యర్ధిగా విజయం సాధించిన దానం నాగేందర్, 2018, 2023లలో బీఆర్ఎస్ టికెట్ మీద గెలిచారు.
రెండు సార్లు మాత్రమే ఉప ఎన్నికలు
ఖైరతాబాద్ నియోజవర్గానికి 1967 నుంచి ఇప్పటి వరకు 1970, 2008లలో రెండు సార్లు మాత్రమే ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ రెండు సందర్భాలలోనూ సిట్టింగ్ ఎమ్మెల్యేల మరణంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఇప్పుడు ఎమ్మెల్యే మీద అనర్హత వేటుతో ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉంది.
1970 ఉప ఎన్నిక.. తెలంగాణ ఉద్యమ ప్రభావం
1967లో ఖైరతాబాద్ నియోజవర్గం ఏర్పడిన తర్వాత తొలి ఉప ఎన్నిక 1970లో జరిగింది. అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే బి.వి. గురుమూర్తి మరణంతో ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయింది. ఈ ఉప ఎన్నికలో తెలంగాణ ప్రజా సమితి (TPS) తరఫున నాగం కృష్ణారావు, కాంగ్రెస్ తరఫున ఎస్. యాదగిరి పోటీ చేశారు. 1970 జూన్ 15న వెలువడిన ఫలితాల్లో నాగం కృష్ణారావు 14 వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తద్వారా తెలంగాణ ఉద్యమం నేపథ్యంలో ఏర్పడిన తెలంగాణ ప్రజా సమితి (టీపీఎస్).. అధికారికంగా పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా మారకముందే ఎన్నికల రాజకీయాల్లో తన ప్రభావాన్ని చాటుకుంది.
పీజేఆర్ మరణంతో..2008 ఉప ఎన్నిక
2004లో ఖైరతాబాద్ నుంచి కాంగ్రెస్ తరఫున గెలిచిన పి. జనార్దన్‌రెడ్డి 2007 డిసెంబర్ 28న మరణించడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది. 2008 మే 29న పోలింగ్ జరిగింది. ఈ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన విష్ణువర్ధన్‌రెడ్డి 2.54 లక్షలకుపైగా ఓట్లు సాధించి, సమీప ప్రత్యర్థి శ్రీనివాసరావు (లోక్‌సత్తా)పై ఏకంగా 1.96 లక్షల ఓట్ల మెజార్టీతో గెలిచారు. టీఆర్ఎస్ అభ్యర్థి ఖాజా అరిఫుద్దీన్ 54,134 ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు. పీజేఆర్ మీద గౌరవంతో ఈ ఎన్నికలో టీడీపీ అభ్యర్ధిని నిలబెట్టలేదు. కానీ టీఆర్ఎస్ (ఇప్పటి బీఆర్ఎస్) మాత్రం అభ్యర్ధిని నిలబెట్టింది. ఏకగ్రీవం కోసం సహకరించాలని పీజేఆర్ కుమారుడు విష్ణు వెళితే గంట సేపు వెయిట్ చేయించి కలవకుండా (కేసీఆర్) పంపించారు. ఇప్పుడు విష్ణు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు.
ఐదుగురు మంత్రులను ఇచ్చిన ఖైరతాబాద్!
ఈ నియోజకవర్గం నుంచి గెలిచిన వారిలో బీవీ గురుమూర్తి, పి. జనార్దన్‌రెడ్డి, రామచంద్రరావు, విజయరామారావు, దానం నాగేందర్‌లకు మంత్రులుగా పని చేసే అవకాశం వచ్చింది. బీవీ గురుమూర్తి నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందారెడ్డి క్యాబినెట్లలో మంత్రిగా ఉన్నారు. పి. జనార్దన్‌రెడ్డి 1981లో అంజయ్య, 1982లో భవనం వెంకట్రామ్ భనవం వెంకట్రామ్, 1991-94 మధ్య కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, నేదుమల్లి జనార్దన్‌రెడ్డి క్యాబినెట్లలో పనిచేశారు. మాధవరం రామచంద్రరావు 1983లో ఎన్టీఆర్ మంత్రివర్గంలో, 1984లో నాదెండ్ల కేబినెట్లో మంత్రిగా ఉన్నారు. విజయరామారావు 1999-2004 మధ్య చంద్రబాబునాయుడు మంత్రివర్గంలో ఉన్నారు. దానం నాగేందర్..2009-14 మధ్య వైఎస్ రాజశేఖరరెడ్డి, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి కేబినెట్లలో మంత్రిగా ఉన్నారు.