

న్యూఢిల్లీ: దేశంలో ఔషధ చట్టాలను సవరించాలని కేంద్రం యోచిస్తున్నది. దేశీయ ఔషధాలను తయారు చేసే పరిశ్రమలను పర్యవేక్షించే అధికారులుగా హోమియోపతి డిగ్రీ కలిగిన వారిని అర్హులుగా గుర్తించాలని భావిస్తున్నది. ఔషధాల నాణ్యత, భద్రతను మరింత కట్టుదిట్టం చేయడంలో భాగంగా ఈ రంగానికి చెందిన నిపుణులనే ఇన్స్పెక్టర్లుగా నియమించాలని కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా తెలుస్తున్నది. ఈ అర్హతను అధికారికంగా గుర్తించడం కోసం సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ 1945 లో 49వ నిబంధనను మార్చాలని భావిస్తున్నది. దీని ద్వారా డ్రగ్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ 1940లోని సెక్షన్ 21ద్వారా హోమియోపతి డిగ్రీ, హోమియోపతి ఫార్మసీ చేసిన వారిని ఇన్స్పెక్టర్లుగా నియమించే అవకాశం ఉంటుంది. పాత నిబంధనల ప్రకారం ఈ అవకాశం లేదు. భారత్ లో ఆయుష్ (ఆయుర్వేద, యోగా, యునాని, సిద్ధ హోమియోపతి)సేవల ఎకానమీ 36.92బిలియన్లుగా ఉంది. ఎగుమతుల విలువ 1.25 బిలియన్లుగా ఉంది. కేంద్ర ఔషధ నియంత్రణ బోర్డు చైర్మన్ రాజీవ్ సింగ్ రఘువంశీ అధ్యక్షతన గతనెల 18న జరిగిన ఔషధాల సంప్రదింపుల కమిటీ(డీసీసీ) సమావేశంలో ఈ ఔషధ చట్టాన్ని సవరించాలని నిర్ణయించారు. ఈ ప్రతిపాదనకు కమిటీ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం హోమియోపతి మందులు కూడా డ్రగ్స్ అండ్ కాస్మోటిక్ డిపార్ట్మెంట్ అధికారులే తనిఖీ చేస్తున్నారు. అయితే హోమియోపతి డిగ్రీ పూర్తి చేసిన వారు తనిఖీ చేసే అవకాశం లేదు. దీంతో విషయ పరిజ్ఞానం ఉన్న వారిని మాత్రమే తనిఖీలకు అనుమతినివ్వాలని కమిటీ సూచించింది. ఈ మేరకు చట్టంలో సవరణ తెచ్చి హోమియోపతి మందుల తయారీ పరిశ్రమలను తనిఖీ చేసే అధికారం సంబంధిత డిగ్రీ చేసిన వారికి కూడా ఇవ్వాలని కేంద్రం ఆలోచనగా తెలుస్తున్నది.