ఇమ్యూనిటీ కోసం ఫుడ్ ఒక్కటే సరిపోదు!

ఓ న్యూట్రిషనిస్ట్ చెప్పిన రహస్యాలు
Tips to improve immunity
Tips to improve immunitygsbs.tufts.edu
Published on: 

వానకాలమైనా, చలికాలమైనా... రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ఒకే ఒక్క ఆహారం లేదా పానీయం అద్భుతంగా పనిచేస్తుందని భావించడం సరైంది కాదు. ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు సమతుల ఆహారం, తగినంత ప్రొటీన్‌, నీరు క్రమం తప్పకుండా తీసుకోవాలి. గాఢ నిద్ర, ఒత్తిడి నియంత్రణ వంటి అనేక అంశాలు కూడా కలిసి పనిచేస్తాయి. ఇలాంటి చిన్నచిన్నఆరోగ్యకరమైన అలవాట్లే కాలక్రమంలో పెద్ద మార్పు తీసుకువస్తాయి. ప్రతీ సీజన్ ను ఆస్వాదిస్తూనే ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మన చేతుల్లోనే ఉందని చెబుతున్నారు ప్రముఖ న్యూట్రిషనిస్టు కినితా కడాకియా పటేల్.

జీవక్రియ, ఇమ్యూనిటీ సిస్టమ్ బలంగా ఉంచుకోవడం ఎంతో ముఖ్యం. దానికోసం ఖరీదైన సప్లిమెంట్లు లేదా డైట్ ప్లాన్స్ అవసరం లేదు. వంటింట్లో ఉండే పోషక విలువలున్నఆహారపదార్థాలను సరైన పద్ధతిలో తీసుకుంటే సరిపోతుందని తనదైన స్టయిల్లో మనకు కొన్ని సూచనలు, సలహాలిస్తున్నారు. అవేంటో చూసేద్దామా.. 

ఈ సీజన్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి?

మన రోగనిరోధక వ్యవస్థ (ఇమ్యూనిటీ సిస్టమ్) ఏడాది పొడవునా ఒకే విధంగా పనిచేయదు. కాలాన్ని బట్టి మారుతూ ఉంటుంది. వాతావరణంలోని అధిక తేమ, ఉష్ణోగ్రతల్లో తరచుగా వచ్చే మార్పులు, కలుషితమైన ఆహారం లేదా నీటి వల్ల వివిధ రకాల ఇన్ఫెక్షన్లకు గురయ్యే అవకాశం ఉంటుంది. పరిశుభ్రత సరిగ్గా పాటించని ప్రదేశాల్లో స్ట్రీట్ ఫుడ్, శుభ్రంగా కడగని కూరగాయలు, ఎక్కువసేపు నిల్వ ఉంచిన నీరు వంటి విషయాల్లో మరింత జాగ్రత్త అవసరం. అందుకే తాజాగా వండిన ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వడం, తినేముందు చేతులు కడుక్కోవడం, వంటగది పరిశుభ్రంగా ఉంచడం, తాగునీటిని సురక్షితంగా వినియోగించడం, పచ్చిగా లేదా సరిగా ఉడకని ఆహారాన్ని నివారించడం మంచిది.

ఇమ్యూనిటీ పెంచుకోవడం ఎలా?

వంటింట్లో రోజూ ఉపయోగించే పసుపు, అల్లం, దాల్చిన చెక్క, మిరియాలు వంటి సుగంధ ద్రవ్యాలు కేవలం రుచిని పెంచేవి మాత్రమే కాదు. వీటిలో యాంటీఆక్సిడెంట్‌, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు కలిగిన సమ్మేళనాలు ఉంటాయి. పసుపు శతాబ్దాలుగా భారతీయ సంప్రదాయ వైద్యంలో ఉపయోగిస్తున్నారు. ఇందులో ఉండే కర్కుమిన్‌కు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉన్నాయి.

అల్లం వర్షాకాలంలో, చలికాలంలో కూడా తీసుకోవడానికి అనువైన పదార్థాల్లో ఒకటి. ఇది జీర్ణక్రియకు తోడ్పడటంతో పాటు శరీరానికి వెచ్చదనాన్ని కలిగిస్తుంది. దాల్చిన చెక్క యాంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలు కలిగి ఉండటంతో పాటు రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు కూడా సహాయపడుతుంది. మిరియాలు, పసుపులోని కొన్ని సమ్మేళనాల శరీర శోషణను మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఈ సుగంధ ద్రవ్యాలను సమతుల ఆహారంలో భాగంగా ఉపయోగించడం ద్వారా రుచితో పాటు కొన్ని ప్రయోజనాలను కూడా పొందవచ్చు.

వర్షాకాలంలో, చలికాలంలో అల్లం టీ, లెమన్ చాయ్, హెర్బల్‌ టీ, పసుపు కలిపిన పాలు వంటి వేడి పానీయాలు హాయిని కలిగించడంతో పాటు ఇమ్యూనిటీనీ పెంచుతాయి. అయితే వీటిని ఏదైనా వ్యాధికి చికిత్సగా భావించకూడదు.

సీజన్‌తో సంబంధం లేకుండా తీసుకోవాల్సిన ఆహారమేంటి?

ప్రొటీన్‌ను నిర్లక్ష్యం చేయకండి. రోగనిరోధక వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి ప్రోటీన్‌ చాలా ముఖ్యమైన పోషక పదార్థం. శరీరంలోని అనేక కణాలు, యాంటీబాడీలు, ఇతర రోగనిరోధక వ్యవస్థ భాగాల నిర్మాణంలో ప్రొటీన్‌ కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల సీజన్‌తో సంబంధం లేకుండా రోజువారీ ఆహారంలో తగినంత ప్రొటీన్‌ ఉండేలా చూసుకోవాలి. దాని కోసం.. పప్పులు, కందులు, శనగలు వంటి పప్పుధాన్యాలు, పాలు, పెరుగు వంటి పాల ఉత్పత్తులు, గుడ్లు, చేపలు, కొవ్వు తక్కువగా ఉన్నమాంసం, పనీర్‌ వంటి ఆహారాలు డైట్‌లో ఉండేలా చూసుకోవాలి. ఉదాహరణకు, పప్పుతో అన్నం మనకు అందుబాటులోని పోషకాహార భోజనం. ఇక అల్పాహారంలో గుడ్డు తీసుకోవచ్చు. పెరుగు లేదా యోగర్ట్‌ ప్రొటీన్‌కు మంచి వనరులుగా ఉపయోగపడతాయి. పనీర్‌ను వివిధ రకాల వంటకాల్లో చేర్చుకోవచ్చు.

స్నాక్స్‌ విషయంలో మీరిచ్చే సూచనలు?

వర్షం పడుతుంటే, చలిగా ఉంటే వేడి వేడి వడా పావ్‌, బజ్జీలు, పకోడీలు, చాట్‌, రోడ్డుపక్కన కాల్చిన మొక్కజొన్న వంటి వాటిని తినాలనే కోరిక కలగడం సహజమే. అయితే అవి ఎక్కడ, ఎలా తయారవుతున్నాయనే విషయం చాలా ముఖ్యం. పరిశుభ్రత లేని పరిస్థితుల్లో తయారైన ఆహారం, కలుషితమైన నీరు లేదా పదార్థాలు, పదేపదే ఉపయోగించిన నూనె వంటి వాటి వల్ల ఆహారం ద్వారా వచ్చే అనారోగ్యాల ముప్పు పెరగవచ్చు. అందుకే పూర్తిగా చిరుతిళ్లను మానేయాల్సిన అవసరం లేదు. వాటిని ఆరోగ్యకరమైన పద్ధతిలో ఇంట్లోనే తయారు చేసుకోవడం మంచి ప్రత్యామ్నాయం. పకోడీలు, బజ్జీలను తక్కువ నూనెతో లేదా ఎయిర్‌ ఫ్రైయర్‌లో తయారు చేయవచ్చు. సమోసాలను డీప్‌ ఫ్రై చేయకుండా బేక్‌ చేసుకోవచ్చు. ఇలా చేస్తే ఇష్టమైన రుచిని ఆస్వాదిస్తూనే ఆహార పరిశుభ్రతపై నియంత్రణ కూడా ఉంటుంది.

రెగ్యులర్ డైట్ ప్లాన్ గురించి ఏమైనా?

ప్రతికాలంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం కోసం క్లిష్టమైన డైట్‌ అవసరం లేదు. కొన్ని సాధారణ అలవాట్లను పాటిస్తే సరిపోతుంది. రోజును గోరువెచ్చని పానీయంతో ప్రారంభించవచ్చు. అల్లం టీ, లెమన్ చాయ్, హెర్బల్‌ టీ లేదా గోరు వెచ్చటి పాలల్లో చిటికెడు పసుపు కలిపి తాగొచ్చు. రోజువారీ ఆహారంలో తాజాగా వండిన భోజనం, వివిధ రకాల కూరగాయలు, తగినంత ప్రొటీన్‌, పప్పు ధాన్యాలు, సీజనల్‌ పండ్లు, సురక్షితమైన తాగునీరు ఉండేలా ప్లాన్ చేసుకుంటే సరిపోతుంది. ఆహారం ద్వారా అవసరమైన పోషకాలు అందకపోతే, వైద్యులు లేదా అర్హత కలిగిన ఆరోగ్య నిపుణుల సలహాతో విటమిన్‌ C, B12, D వంటి సప్లిమెంట్లను తీసుకోవచ్చు. అయితే సప్లిమెంట్లు సమతుల ఆహారానికి ప్రత్యామ్నాయం కావు.

ఫుడ్ ఒక్కటే సరిపోతుందా?

రోగనిరోధక శక్తికి (ఇమ్యూనిటీ) ఆహారం ఒక్కటే సరిపోదు. రోగనిరోధక శక్తిని బలంగా ఉంచుకోవడంలో ఆహారం ముఖ్యమైనదే అయినప్పటికీ, ఆరోగ్యకరమైన జీవనశైలి కూడా అంతే అవసరం. వాన కాలం, చలికాలం కారణంగా బయట వ్యాయామం చేయడం సాధ్యం కాకపోతే ఇంట్లోనే యోగా, స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌, రెసిస్టెన్స్‌ బ్యాండ్‌ వ్యాయామాలు, నడక లేదా మ్యాట్‌ పైలేట్స్‌ వంటి కార్యకలాపాలు చేయవచ్చు. అలాగే తగినంత నిద్ర, ఒత్తిడి నియంత్రణ, వ్యక్తిగత, ఆహార పరిశుభ్రత వంటి అంశాలను కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఇవన్నీ కలిపే ఆరోగ్యకరమైన జీవనశైలిని రూపొందిస్తాయి. (రూప)