

వాషింగ్టన్: అమెరికా ఫార్మా దిగ్గజం జాన్సన్ అండ్ జాన్సన్‌కు చెందిన ప్రొస్టేట్ క్యాన్సర్ ఔషధం (జేఎన్జే-6143) ప్రారంభ దశ క్లినికల్ ట్రయల్స్‌లో అద్భుత ఫలితాలను చూపించింది. నోటి ద్వారా తీసుకునే ఈ ట్యాబ్లెట్ ప్రొస్టేట్ క్యాన్సర్ గడ్డలను (ట్యూమర్లను) పూర్తిగా అదృశ్యమయ్యేలా, చిన్నవిగా మారేలా చేసింది. ఈవిషయాన్ని జాన్సన్ అండ్ జాన్సన్ శనివారం వెల్లడించింది. వాస్తవానికి జేఎన్జే-6143 ఔషధం తయారీతో ముడిపడిన ప్రాథమిక సాంకేతికతను అమెరికాకు చెందిన హాల్డా థెరప్యూటిక్స్ అనే స్టార్టప్ తొలుత అభివృద్ధి చేసింది. అయితే గతేడాది ఈ కంపెనీని రూ.28వేల కోట్లకు (3.05 బిలియన్ డాలర్లు) కొనడం ద్వారా ఈ ఔషధ హక్కులను జాన్సన్ అండ్ జాన్సన్ దక్కించుకుంది.
ట్రయల్స్‌లో గుర్తించిన అంశాలివీ
అనేక రకాల చికిత్సలు పొంది, వ్యాధి ముదిరిపోయిన ప్రొస్టేట్ క్యాన్సర్ రోగులపై జేఎన్జే -6143 అనే కొత్త ఔషధాన్ని పరీక్షించారు. క్యాన్సర్ కణాలు బతకడానికి అవసరమయ్యే ఒక రకమైన ప్రోటీన్‌ను ఈ మందు అడ్డుకుంటున్నట్లు గుర్తించారు. ఇది కేవలం క్యాన్సర్ కణాలనే లక్ష్యంగా చేసుకొని నాశనం చేస్తున్నట్లు ట్రయల్స్‌లో వెల్లడైంది. ప్రొస్టేట్ క్యాన్సర్ తీవ్రతను పర్యవేక్షించడానికి రక్తంలో పీఎస్ఏ అనే మార్కర్‌ను గుర్తిస్తారు. తాజా ప్రయోగ పరీక్షల్లో భాగంగా 50 మిల్లీగ్రాముల డోస్ తీసుకున్న 31 మంది రోగులలో 77 శాతం మందికి పీఎస్ఏ స్థాయులు కనీసం 50 శాతం తగ్గాయి. 48 శాతం మంది రోగులలో పీఎస్ఏ స్థాయులు 90 శాతానికిపైగా తగ్గాయి. పెద్దసైజు క్యాన్సర్ గడ్డలు కలిగిన రోగులలో 69 శాతం మందిలో ట్యూమర్లు పూర్తిగా లేదా పాక్షికంగా తగ్గినట్లు నిర్ధారణ అయింది. ఈమేరకు పరిశోధన వివరాలను యూరోపియన్ సొసైటీ ఫర్ మెడికల్ ఆంకాలజీ కాంగ్రెస్ సదస్సులో ప్రదర్శించారు.
ప్రొస్టేట్ క్యాన్సర్ అంటే ?
ప్రొస్టేట్ అంటే పౌరుష గ్రంథి. ఇది పురుషుల మూత్రాశయానికి సరిగ్గా కింద, ఒక చిన్న అక్రోటు కాయ సైజులో ఉంటుంది. పురుషుల వీర్య కణాల రక్షణకు అవసరమైన ప్రత్యేక ద్రవాన్ని ప్రొస్టేట్ తయారు చేస్తుంది. 50 ఏళ్లు దాటిన వారిలో పలువురికి ప్రొస్టేట్ క్యాన్సర్ ముప్పు ఎక్కువగా ఉంటుంది. వంశపారంపర్యంగా, హార్మోన్ల మార్పుల వల్ల ఈ గ్రంథిలోని కణాలు అదుపు తప్పి విపరీతంగా పెరిగిపోయి క్యాన్సర్ గడ్డలుగా మారుతాయి.