

వైద్య రంగానికి సవాలు విసిరిన అంశాలు కరోనా ముందు, తరువాత కూడా ఎన్నో ఉన్నాయి. కానీ తమిళనాడులోని మధురైలో చోటు చేసుకున్న ఈ వింత ఘటన, ప్రపంచ వైద్యుల మతి పోగొట్టింది.
ఒక 16 ఏళ్ల బాలుడు తన ఎడమ కంటిపై వాపు రావడంతో వైద్యులను ఆశ్రయించాడు. ఇదొక నొప్పిలేని తేలికపాటి గడ్డ అని వైద్యులు మొదట భావించారు. కానీ, ఆ తర్వాత కొద్దిరోజులకే కనురెప్ప వెనుక నుంచి చర్మం చీల్చుకుని రెండు గట్టి తెల్లటి మొనలు రావడం ప్రారంభించాయి. వాటిని CT స్కాన్ చేసి చూసిన వైద్యులు, ఆ అబ్బాయి కంటి పై భాగంలో రెండు దంతాలు పెరుగుతున్నట్లు గుర్తించారు.
అత్యంత అసాధారణమైన కేసు
నోటిలో కాకుండా శరీరంలోని వేరే ప్రదేశాలలో పన్ను రావడాన్ని ఎక్టోపిక్ టూత్ అంటారు. అయితే ఇలా కంటి పైభాగంలో (eye socket) ఎక్టోపిక్ టూత్ వచ్చిన ఏకైక కేసు ప్రపంచంలో ఇదేనని వైద్యులు చెబుతున్నారు. ఒకోసారి ముక్కు లోపల, నోటి పైకప్పుపై దంతాలు రావడం చూశాం కానీ, కంటి పైన రావడం అత్యంత విచిత్రమని అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తల్మాలజీ డాక్టర్స్ అన్నారు. ఇది దంతాలు, వెంట్రుకలు, ఎముక లాంటివి ఉండే ఒక రకమైన ట్యూమర్ (టెరాటోమా) కూడా కాదని వారు స్పష్టం చేశారు.
కారణాలేంటి?
గతంలో తగిలిన గాయాలు, జన్యు సమస్యల కారణంగా ఇలాంటి అరుదైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది కానీ, ఈ బాలుడి విషయంలో అవేమీ లేవని మరి ఇదెలా జరిగిందని తలలు పట్టుకుంటున్నారు.
ఇతర సమస్యలేమీ లేకపోవడంతో వైద్యులు విజయవంతంగా సర్జరీ చేసి ఆ రెండు పళ్ళను తొలగించారు. అలాగే అతడి శరీరంలో మరెక్కడా అదనపు దంతాలు కనిపంచలేదని తెలిపారు. ఇక సదరు బాలుడికి కంటి పైభాగంలో వాపు కూడా నయం అయిందని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఇది మొట్టమొదటి, అరుదైన కేసుగా అభివర్ణిస్తున్నారు వైద్యులు. అంతేగాదు వైద్యశాస్త్రంలోనే ఓ మిరాకిల్ కేసు అని చేతులెత్తేశారు!