వందేళ్లు దాటినా... కరిగిపోని కల

1916లో ప్రారంభమైన మైసూర్ శాండల్ సోప్ వెనుక ఓ రాజు, తన మంత్రులు చేసిన యంత్రాంగం ఏంటి? వందేళ్లకు పైగా ఆ బ్రాండ్ తన ప్రజాదరణను ఎలా నిలబెట్టుకుంది?
Mysore Sandal Soap
Mysore Sandal Soap Historye-bay
Published on: 

మార్కెట్‌లో ఎప్పటికప్పుడు కొత్తకొత్త బ్రాండ్స్ వస్తూ.. పోతూ ఉంటాయి. కానీ వందేళ్లయినా ఒక బ్రాండ్‌కు ప్రజల్లో ఆదరణ తగ్గలేదంటే దాని విశిష్టత ఏంటో తెలుసుకోవాల్సిందే. అదే ‘మైసూర్ శాండల్ సోప్’ కథ. ఇది ఒక బ్రాండ్‌ విజయగాథ మాత్రమే కాదు. తరతరాలుగా సంపాదించుకున్న ప్రజల నమ్మకాన్ని కాపాడుకోవడానికి ఓ సంస్థ చేస్తున్న పోరాటానికి ఉదాహరణ.

మనం ఏఐ యుగంలో జీవిస్తున్నాం. ఇప్పుడు రీసెర్చ్ చేయడం, విషయాన్ని తెలుసుకోవడం పెద్ద పనేం కాదు. కానీ ఓ వందేళ్ల క్రితమే మనదేశంలో ఒక సబ్బుపై అద్భుతమైన పరిశోధన జరిగింది. అది కూడా మొదటి ప్రపంచ యుద్ధకాలంలో పురుడుపోసుకున్నది. అదే వందేళ్ల చరిత్రను తనలో దాచుకున్న మైసూర్ శాండల్ సోప్.

మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో…

మొదటి ప్రపంచ యుద్ధం కారణంగా మైసూర్ రాజ్యం నుంచి జర్మనీ, బ్రిటన్, ఐరోపా దేశాలకు గంధపు చెక్కల ఎగుమతి ఆగిపోయింది. దాంతో టన్నుల కొద్దీ గంధపు చెక్కలు నిలువ ఉండిపోయాయి. ఇది గమనించిన మైసూరు మహారాజు నాలుగో కృష్ణరాజ వడియార్, ఆయన దివాన్ ఎం.విశ్వేశ్వరయ్య ఈ వనరులను స్వదేశంలోనే ఉపయోగించుకోవాలని భావించారు. దీని కోసం 1916లో గవర్నమెంట్ శాండల్‌వుడ్ ఆయిల్ ఫ్యాక్టరీని స్థాపించారు. బెంగళూరులోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISC) శాస్త్రవేత్తలు బ్రిటిష్ ఫార్మా ప్రమాణాలకు అనుగుణంగా గంధపు నూనెను తీసే సాంకేతికతను కనిపెట్టారు.

కథ సురువైందిక్కడే?

లండన్ నుంచి మనదేశానికి వచ్చిన ఒక విదేశీ ప్రముఖుడు మైసూర్ మహారాజుకు గంధపు సబ్బులను బహుమతిగా ఇచ్చాడు. ఆ సబ్బులను చూసిన తర్వాత.. మన సబ్బులను, మనమే ఎందుకు తయారు చేసుకోకూడదనే ఒక ఆలోచన వచ్చింది. సబ్బు తయారీ, పరిమళాల సాంకేతికతను తెలుసుకోవడానికి ఇండస్ట్రియల్ కెమిస్ట్ ఎస్.జి.శాస్త్రిని లండన్ పంపారు. లండన్ నుంచి తిరిగి వచ్చిన శాస్త్రి.. స్వచ్ఛమైన గంధపు నూనెతో పాటు మరికొన్ని సహజ నూనెలను కలిపి ఒక ఫార్ములా తయారు చేశారు. అలా 1918లో భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ గంధపు సబ్బు ‘మైసూర్ శాండల్ సోప్’ పురుడుపొసుకున్నది.

ప్యాకింగ్‌లోనూ రాయల్ లుక్

మైసూర్ శాండల్ సోప్ నాణ్యత, డిజైన్‌లోనూ తనదైన ముద్రను సొంతం చేసుకుంది. అండాకారపు సోప్, నగలు దాచే పెట్టె లాంటి ప్యాకింగ్, మైసూర్ రాజ వంశ చిహ్నమైన 'శరభ' లోగో దీనికి ప్రత్యేక ఆకర్షణ. మైసూర్ మహారాజు స్వయంగా ఈ సబ్బులను విదేశీ ప్రముఖులకు, వైస్రాయ్‌లకు బహుమతిగా ఇస్తూ పెద్దగా ప్రకటనలు లేకుండానే మైసూర్ శాండల్ సోప్‌ను దేశవ్యాప్తంగా ప్రాచుర్యంలోకి తెచ్చారు.

GI ట్యాగ్- 2006..

భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత, 1956లో ఈ ఫ్యాక్టరీలు కర్ణాటక ప్రభుత్వ పరిధిలోకి వచ్చాయి. 1980లో బెంగళూరు, మైసూర్, శివమొగ్గలోని అన్ని గంధపు నూనె, సబ్బుల విభాగాలను విలీనం చేసి KSDL (Karnataka Soaps and Detergents Limited) గా మార్చారు. మారుతున్న కాలంలో ముడిసరుకు కొరత ఏర్పడినా, కృత్రిమ సువాసనల (Synthetic Fragrances) వైపు వెళ్లకుండా వందశాతం స్వచ్ఛమైన గంధపు నూనెనే వాడటం ఈ సబ్బు ప్రత్యేకత. 2006లో లభించిన జియోగ్రాఫికల్ ఇండికేషన్ (GI) ట్యాగ్ ఈ సబ్బుకు అంతర్జాతీయంగా ఒక చెరగని ముద్రను, నకిలీల నుండి చట్టపరమైన రక్షణను అందించింది. మొదటి ప్రపంచ యుద్ధం తెచ్చిన సంక్షోభం నుండి పుట్టిన ఈ సోప్, నేడు కోట్ల టర్నోవర్ సాధిస్తూ భారతదేశపు అత్యంత ప్రతిష్టాత్మక బ్రాండ్‌లలో ఒకటిగా నిలిచింది.

ఈ బ్రాండ్ స్పెషలిదే!

మైసూర్ శాండల్ సోప్‌ (Mysore Sandal Soap) ప్రజాదరణ వెనుక అనేక ప్రత్యేకమైన అంశాలు ఉన్నాయి. సహజమైన, ఎక్కువసేపు నిలిచే సువాసన, వృక్ష ఆధారిత పదార్థాలతో తయారీ, చర్మానికి సున్నితంగా ఉండే గుణం, రాజవంశాల వారసత్వాన్ని గుర్తుచేసే బ్రాండ్‌ ప్రతిష్ఠ . ఇవన్నీ ఈ సబ్బును ప్రత్యేకంగా నిలబెట్టాయి. అదే సమయంలో.. ఈ సోప్ సామాన్యులకు కూడా అందుబాటులో ఉండే బ్రాండ్‌గా పేరు తెచ్చుకుంది. ఈ సబ్బు భారతీయుల రోజువారీ జీవితంలోనూ భాగమైపోయింది. పండుగల సమయంలో పెద్ద మొత్తంలో కొనుగోలు చేయడం, పెళ్లిళ్లలో బహుమతిగా ఇవ్వడం, కర్ణాటకకు వెళ్లే టూరిస్టులు గుర్తుగా మైసూర్ శాండల్ సోప్‌ను కొనే సంప్రదాయం నేటికీ కొనసాగుతున్నది. ఇతర అంతర్జాతీయ బ్రాండ్ల మాదిరిగా మైసూర్ శాండల్ సోప్‌ తయారీ సంస్థ కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్‌ (KSDL) దశాబ్దాల పాటు ప్రముఖుల ప్రచారాలు, భారీ ప్రకటనలపై ఎక్కువగా ఆధారపడలేదు. బదులుగా, ప్రజల జ్ఞాపకాలు, సాంస్కృతిక అభిమానం, స్థిరమైన నాణ్యతే దాని ప్రజాదరణకు ప్రధాన కారణాలయ్యాయి. మైసూర్ శాండల్ పేరుతో నకిలీ సోప్స్‌ కొద్దికాలం పాటు మార్కెట్‌లో లభించాయి. దాన్ని గుర్తించిన అధికారులు సీజ్ చేశారు. మొత్తంగా చూస్తే, మైసూర్ శాండల్ సోప్‌ కథ కేవలం ఒక సబ్బు బ్రాండ్‌ విజయగాథ మాత్రమే కాదు. తరతరాలుగా సంపాదించుకున్న ప్రజల నమ్మకాన్ని కాపాడుకోవడానికి ఒక సంస్థ చేస్తున్న పోరాటానికి కూడా ఉదాహరణ.

బ్రాండ్ అంబాసిడర్

కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (KSDL) తన ఐకానిక్ మైసూర్ శాండల్ సోప్‌ను జాతీయ స్థాయిలో మరింత విస్తరించడానికి ఒక సరికొత్త మార్పును తీసుకొచ్చింది. ఈ హెరిటేజ్ సబ్బుకు సరికొత్త రూపాన్ని (Refreshed Look) ఇస్తూ, ప్రముఖ నటి తమన్నా భాటియాను అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారు.  శతాబ్ద కాలంగా నాణ్యత మార్చకుండా, భావోద్వేగ బంధంగా నిలిచిన మైసూర్ శాండల్ సోప్.. నేడు ₹1,785 కోట్ల విలువైన విజయవంతమైన ప్రభుత్వ రంగ బ్రాండ్‌గా భారతదేశ మార్కెట్‌లో దూసుకుపోతున్నది. (-రూప)