అంగారకుడిపై నీటి సరస్సులు

నాసా రోవర్ పంపిన సమాచారంతో బయటపడిన గుట్టు
Perseverance rover on  mars ai generation
Mars GroundwaterNASA Rover, perseverance
Published on: 

అంగారక గ్రహంపై గల ప్రసిద్ధ జెజెరో క్రేటర్‌లోని 'మార్జిన్ యూనిట్' ప్రాంతంలో నీటి చరిత్ర అత్యంత సంక్లిష్టంగా సాగిందని తాజా పరిశోధన వెల్లడించింది. నాసాకు చెందిన పెర్సివరెన్స్ రోవర్ సేకరించిన సమాచారం ప్రకారం.. అక్కడ కేవలం ప్రాచీన సరస్సులే కాకుండా, భూగర్భ జలాలు, వేడి నీటి బుగ్గల (హైడ్రోథర్మల్) కార్యకలాపాలు కూడా చోటుచేసుకున్నాయి. ఈ వివరాలు ప్రతిష్ఠాత్మక 'కమ్యూనికేషన్స్ ఎర్త్ అండ్ ఎన్విరాన్‌మెంట్' జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.

అంచనాలు తారుమారు.. అగ్నిశిలల గుర్తింపు

గతంలో అంగారక కక్ష్యలోని ఆర్బిటర్లు అందించిన డేటా ఆధారంగా ఈ ప్రాంతంలో ప్రాచీన సరస్సు తీరం ఉంటుందని, అక్కడ అవక్షేప శిలలు (సెడిమెంటరీ రాక్స్) కనిపిస్తాయని పరిశోధకులు భావించారు. అయితే తీరా అక్కడికి చేరుకున్న పెర్సివరెన్స్ రోవర్‌కు అగ్నిశిలలు (ఇగ్నియస్ రాక్స్) ఎదురయ్యాయి. శిలాద్రవం చల్లబడటం ద్వారా ఏర్పడిన ఈ రాళ్లు అంగారకుడి అంతర్గత పరిస్థితులను విశ్లేషించడంలో అత్యంత కీలక ఆధారాలుగా మారాయి.

సూపర్‌క్యామ్ విశ్లేషణలో విస్తుపోయే నిజాలు

రోవర్‌ పైభాగంలో అమర్చిన 'సూపర్‌క్యామ్' పరికరం లేజర్ కిరణాల సాయంతో అక్కడి రాళ్లపై పరిశోధనలు సాగించింది. 185కి పైగా లక్ష్యాలను పరిశీలించిన మీదట మార్జిన్ యూనిట్ రాళ్లు కనీసం మూడు వేర్వేరు సందర్భాలలో నీటితో చర్య జరిపినట్లు తేలింది. కార్బన్ డయాక్సైడ్ సమృద్ధిగా ఉన్న భూగర్భ జలాలు రాళ్ల గుండా ప్రవహించడం ద్వారా కార్బొనేట్లు ఏర్పడ్డాయి. ఆ తర్వాత క్రేటర్‌లో సరస్సు ప్రవాహం ఉండగా.. చివరి దశలో వేడి నీరు భూగర్భంలో ప్రవహించి ఫ్లోరైట్, కాల్షియం సల్ఫేట్ వంటి ఖనిజాలను మిగిల్చింది.

జీవం ఉనికిపై సరికొత్త ఆశలు

భూమిపై నీరు, ఒలివిన్ ఖనిజం మధ్య చర్యలు జరిగినప్పుడు వెలువడే హైడ్రోజన్‌‌ సూక్ష్మజీవులకు శక్తి వనరుగా మారుతుంది. అదే ప్రక్రియ ద్వారా ఏర్పడిన సిలికా, కార్బొనేట్లు అణురూప జీవజాతుల అవశేషాలను భద్రపరచడంలో సహాయపడతాయి. జెజెరో క్రేటర్‌లో కనిపించిన ఖనిజ నిల్వలు ఒకప్పుడు అక్కడ జీవజాలం మనుగడ సాగించడానికి అనుకూల వాతావరణం ఉండి ఉండవచ్చనే వాదనకు బలం చేకూరుస్తున్నాయి. ఇది మార్స్ వాతావరణ పరిణామ క్రమాన్ని అధ్యయనం చేయడంలో సరికొత్త మలుపుగా మారింది.