

కర్ణాటక సీఎం డీకే శివకుమార్ స్మార్ట్ గ్లాసెస్ సాయంతో ఒక పారిశ్రామికవేత్త తనతోపాటు కేరళ సీఎం వీడీ సతీశన్‌పై స్టింగ్ ఆపరేషన్‌కు ప్రయత్నించారని సంచలన ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలతో స్మార్ట్ గ్లాసెస్ వినియోగం, వాటితో రహస్యంగా వీడియోలు రికార్డు చేసే అవకాశాలపై చర్చ మొదలైంది. మరోవైపు, 2026 ఐపీఎల్ సందర్భంగా ఆటగాళ్లు, సహాయక సిబ్బంది, మ్యాచ్ అధికారులు స్మార్ట్ గ్లాసెస్ ఉపయోగించడంపై బీసీసీఐ ఆంక్షలు విధించింది. వీటి ద్వారా మ్యాచ్‌లను రికార్డు చేయడం, ప్రత్యక్ష ప్రసారం చేయడం, సమాచారాన్ని ప్రసారం చేయడం సాధ్యమవుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో, అసలు స్మార్ట్ గ్లాసెస్ ఎలా పనిచేస్తాయి? వాటి గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
స్మార్ట్ గ్లాసెస్ ఆలోచన వెనుక కథ ఇదే
స్మార్ట్ గ్లాసెస్ తయారీ వెనుక మొబైల్స్ తర్వాత టెక్నాలజీ ప్రపంచాన్ని శాసించే నెక్స్ట్-జెన్ వేరబుల్ డివైజెస్‌ను అభివృద్ధి చేయాలనే టెక్ దిగ్గజాల దూరదృష్టి ఉంది. ప్రతి చిన్న పనికీ ఫోన్‌ను జేబులో నుంచి తీయాల్సిన అవసరం లేకుండా.. చేతులు ఖాళీగా ఉంచుతూనే హ్యాండ్స్-ఫ్రీ అనుభూతితో ఫొటోలు, వీడియోలు తీయడం, కాల్స్ మాట్లాడటం, సమాచారాన్ని పొందడం వంటి పనులు చేయాలన్నదే దీనికి వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ముఖ్యంగా సోషల్ మీడియా క్రియేటర్లకు తాము చూస్తున్న దృశ్యాలను అదే కోణంలో రికార్డు చేసి ఫస్ట్ పర్సన్ వ్యూ (POV) కంటెంట్ ను అందించడమూ దీనికి మరో కారణం. మొట్టమొదటగా గూగుల్ సంస్థ 2012-13 ప్రాంతంలో 'గూగుల్ గ్లాస్' (Google Glass) పేరుతో ఇలాంటి ప్రయోగానికి తెరలేపింది. అయితే ఆ సమయంలో చాలా కొత్తగా ఉండటం, ధర ఎక్కువ కావటం, గోప్యతా సమస్యల కారణంగా పెద్దగా విజయవంతం కాలేదు. ఆ తర్వాత 2016లో స్నాప్‌చాట్ సంస్థ 'స్పెక్టాకిల్స్' పేరుతో వీడియో రికార్డ్ చేసే సన్‌గ్లాసెస్‌ను తీసుకొచ్చింది. 2019లో అమెజాన్ ఫ్రేమ్‌లో స్పీకర్లు, మైక్రోఫోన్లతో సంగీతం వినడం, కాల్స్ మాట్లాడటం, అలెక్సా వాయిస్ అసిస్టెంట్‌ను ఉపయోగించడం వంటి సదుపాయాలను అందించింది. వీటిలో కెమెరా లేదు.
ఈ క్రమంలో ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా.. రే-బాన్ మాతృసంస్థ ఎస్సిలోర్‌లక్సోటికాతో భాగస్వామ్యమై 2021లో ‘రే-బాన్ స్టోరీస్’ను విడుదల చేసింది. అయితే అవి సాధారణ కెమెరా ఫీచర్లతో మాత్రమే ఉండేవి. ఆ తర్వాత సాంకేతికతను మరింత మెరుగుపరుస్తూ సెప్టెంబర్ 2023లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) , మెరుగైన కెమెరా సామర్థ్యంతో కూడిన రెండో తరహా 'Ray-Ban Meta Smart Glasses' ను అధికారికంగా విడుదల చేసింది. ఆ తర్వాత నుంచి ఇవి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఆదరణ పొందాయి. ఆపిల్, ఒప్పో, షియోమీ, రైజర్, ఓక్లీ తదితర సంస్థలు కూడా స్మార్ట్ గ్లాసెస్ అభివృద్ధి మీద పని చేస్తున్నాయి.
కళ్లద్దాల్లో కెమెరా.. ఏఐ అసిస్టెంట్!
కళ్లద్దాల్లా కనిపించే సాధారణ ఫ్రేమ్ వెనుక అత్యాధునిక సాంకేతికత దాగి ఉంది. అదే రే-బాన్–మెటా (Ray-Ban Meta) స్మార్ట్ గ్లాసెస్. చూడటానికి మామూలు సన్‌గ్లాసెస్ లాగే ఉండే ఈ చిన్న పరికరం.. ఒకేసారి కెమెరాగా, రికార్డర్‌గా, ఫోన్‌గా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) అసిస్టెంట్‌గా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తోంది. కేవలం వీడియోలు, ఫోటోలు తీయడం వరకే పరిమితమైన సాధారణ కెమెరా గ్లాసెస్ తరహా నుంచి.. ఇవి ఇప్పుడు అప్‌గ్రేడ్ అయ్యాయి. మనం ఎదురుగా చూస్తున్న వస్తువులు, ప్రదేశాలు లేదా మనుషుల గురించి ఏఐ (AI) సాయంతో క్షణాల్లో సమాచారం ఇవ్వగలగడం వంటి అధునాతన ఫీచర్లతో టెక్ ప్రపంచంలో ఇవి సంచలనం సృష్టిస్తున్నాయి.
అల్ట్రా-వైడ్ కెమెరా..వాయిస్ కమాండ్..ఇన్‌బిల్ట్ మెమరీ
ఈ స్మార్ట్ గ్లాసెస్ చూడటానికి సాధారణ స్టైలిష్ కళ్లజోడు లేదా సన్‌గ్లాసెస్ లాగే కనిపిస్తాయి. కానీ వీటి తయారీలో అత్యాధునిక సాంకేతికతను ఉపయోగిస్తారు. ఫ్రేమ్ ముందు భాగంలో (ముక్కు వారగా లేదా అంచుల వద్ద) అత్యంత సూక్ష్మమైన 12 MP అల్ట్రా-వైడ్ కెమెరా అమర్చబడి ఉంటుంది. దీని ద్వారా మనం చూసే దృశ్యాలను ఫస్ట్-పర్సన్ వ్యూ (First-person view) లో వీడియో లేదా ఫోటోలుగా క్యాప్చర్ చేయవచ్చు. ఫ్రేమ్ కాడ (Temple) పైన ఉండే చిన్న టచ్ ప్యాడ్ లేదా బటన్‌ను నొక్కడం ద్వారా లేదా వాయిస్ కమాండ్ (Voice Command) ఇవ్వడం ద్వారా రికార్డింగ్ ప్రారంభమవుతుంది. రికార్డైన డేటా గ్లాసెస్‌లోని ఇన్‌బిల్ట్ మెమరీలో స్టోర్ అవుతుంది. బ్లూటూత్ ద్వారా స్మార్ట్‌ఫోన్ యాప్‌కు కనెక్ట్ చేసి వాటిని ఎప్పుడైనా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కొన్ని మోడళ్లలో Facebook, Instagram వంటి ప్లాట్‌ఫామ్‌లకు ప్రత్యక్ష ప్రసారం చేసే సదుపాయం కూడా ఉంది. వీటితో రికార్డింగ్ చేస్తున్నప్పుడు కళ్లద్దాలపై ఉన్న చిన్న లైట్ వెలుగుతుంది. తద్వారా చుట్టుపక్కల వారికి చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలియజేయడానికి ఇది ఉపయోగపడుతుంది.
ఇయర్‌ఫోన్లు లేకుండానే కాల్స్.. మ్యూజిక్
ఈ స్మార్ట్ గ్లాసెస్‌లో అత్యంత ప్రత్యేకమైన ఫీచర్ వీటిలోని ఓపెన్-ఇయర్ స్పీకర్లు. సాధారణ ఇయర్‌ఫోన్లలాగా వీటిని చెవుల్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఫ్రేమ్ కాడల లోపల ఉండే చిన్న స్పీకర్ల ద్వారా బయటి శబ్దాలు వినిపిస్తూనే, మనం క్లియర్‌గా మ్యూజిక్ వినవచ్చు లేదా ఫోన్ కాల్స్ మాట్లాడవచ్చు. అలాగే చుట్టుపక్కల వారిని డిస్టర్బ్ చేయకుండా మనకు మాత్రమే ఆడియో వినిపించేలా సౌండ్ లీకేజ్ కంట్రోల్ టెక్నాలజీని ఇందులో వాడారు.
భవిష్యత్తులో.. ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ
ప్రస్తుతం వస్తున్న రేబాన్-మెటా గ్లాసెస్ కేవలం కెమెరా, ఆడియో పరంగానే కాకుండా, రాబోయే రోజుల్లో కళ్లద్దాల లెన్స్‌పైనే నేరుగా డిజిటల్ స్క్రీన్ లేదా హోలోగ్రాఫిక్ సమాచారాన్ని చూపించే ఆగ్మెంటెడ్ రియాలిటీ (AR) టెక్నాలజీ వైపు వేగంగా అడుగులు వేస్తున్నాయి. మనం చూస్తున్న దారిని మ్యాప్ రూపంలో కళ్లద్దాలపైనే చూపించడం, విదేశీ భాషలను రియల్ టైమ్‌లో మన మాతృభాషలోకి అనువదించి (Live Translation) చూపించడం వంటి ఫీచర్లతో త్వరలోనే ఇవి మార్కెట్లోకి రానున్నాయి.
గోప్యతా సవాళ్లు..వివాదాలు
స్మార్ట్ గ్లాసెస్ మార్కెట్లోకి వచ్చినప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన వ్యక్తిగత గోప్యతపై వివాదాలు మొదలయ్యాయి. ఎవరికీ ఎలాంటి అనుమానం రాకుండా సాధారణ కళ్లజోడుతో ఎవరైనా రహస్యంగా వీడియోలు లేదా ఫోటోలు తీసే అవకాశం ఉండటంతో వీటిని క్రిటిక్స్ 'స్పై గ్లాసెస్' లేదా 'పర్వర్ట్ గ్లాసెస్' అని విమర్శించారు. యూరప్ దేశాలలో, అమెరికాలోని కొన్ని ప్రాంతాలలో (ఉదాహరణకు న్యూయార్క్ కోర్టులు వంటి కొన్ని సున్నితమైన ప్రదేశాలలో) ఈ కెమెరా గ్లాసెస్ వాడకంపై అధికారికంగా నిషేధాలు విధించారు. అలాగే, కెమెరా ఆన్‌లో ఉన్నప్పుడు వెలగాల్సిన చిన్న వార్నింగ్ లైట్‌ను కొందరు టేప్‌లతో కప్పివేసి రహస్య రికార్డింగ్‌లకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. అంతేకాకుండా, గ్లాసెస్ ద్వారా సేకరించిన డేటాను మెటా సంస్థ తన ఏఐ (Meta AI) మోడళ్లకు శిక్షణ ఇవ్వడానికి వాడుతోందనే విమర్శలు కూడా వచ్చాయి.
చూపులేని వారికి ఏఐ కళ్లద్దాలు.. బెంగళూరు నిపుణుల ఘనత!
బెంగళూరుకు చెందిన వైద్య నిపుణులు అంధులు, దృష్టిలోపం ఉన్నవారి కోసం ఏఐ సాయంతో పనిచేసే ‘స్మార్ట్ విజన్ అల్ట్రా గ్లాసెస్’ను రూపొందించారు. ఇవి ఎదురుగా ఉన్న వ్యక్తులు, వస్తువులను గుర్తించడంతోపాటు దారి తెలుసుకునేందుకు సహాయపడతాయి. అంతేకాదు.. 18 భారతీయ భాషల్లోని అక్షరాలను చదివి వినిపించగలవు. దీంతో దృష్టిలోపం ఉన్నవారు ఇతరులపై ఆధారపడకుండా తమ రోజువారీ పనులను స్వయంగా చేసుకునేందుకు ఇవి దోహదపడతాయి. బెంగళూరులోని నారాయణ నేత్రాలయ, ఎస్‌హెచ్‌జీ టెక్నాలజీస్ సంయుక్తంగా ఈ స్మార్ట్ విజన్ గ్లాసెస్‌ను రూపొందించాయి. ఇవి చూడటానికి సాధారణ కళ్లజోడులాగే కనిపించినా.. దృష్టిలోపం ఉన్నవారికి మార్గనిర్దేశం చేసే సహాయక పరికరంగా పనిచేస్తాయి. ఎదుటి వస్తువులు, వ్యక్తులను గుర్తించడం, దారి తెలుసుకోవడం వంటి పనుల్లో సాయం చేస్తూ వారి స్వతంత్ర జీవనానికి తోడ్పడతాయి. ఈ స్మార్ట్ గ్లాసెస్‌లో అమర్చిన లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్ (లైడార్) సెన్సార్ పరిసరాలను స్కాన్ చేసి, అక్కడి పరిస్థితుల గురించి బ్లూటూత్ స్పీకర్ ద్వారా ధరించిన వారికి వివరిస్తుంది. ఇవి రంగులను గుర్తించడంతోపాటు మెట్రో స్టేషన్ల వంటి బహిరంగ ప్రదేశాల్లోని సూచిక బోర్డులను చదివి వినిపిస్తాయి. చేతితో రాసిన వైద్యుల ప్రిస్క్రిప్షన్లు, నోట్‌బుక్‌లలోని రాతను కూడా చదవగలవు. వీటిలో అత్యవసర కాలింగ్ సదుపాయం సైతం ఉంది. దీన్ని యాక్టివేట్ చేస్తే.. వినియోగదారుడి లొకేషన్, చివరిగా మాట్లాడిన మాటలు, చిత్రాలను ముందుగా నిర్దేశించిన కాంటాక్టులకు పంపిస్తాయి.