వేల ఉపగ్రహాలు.. లక్షల కోట్ల వ్యాపారం! స్టార్‌లింక్‌ కథేంటి?

Elon Musk's business strategy behind Starlink
Elon Musk's business strategy behind Starlink
Published on: 

ప్రపంచ కుబేరుడు ఎలాన్‌ మస్క్‌.. స్టార్‌లింక్‌ విషయంలో చేస్తున్న వ్యాఖ్యలు, పోస్టులు ఇప్పుడు దేశంలో చర్చనీయాంశంగా మారాయి. ఈ అంశంపై కొందరు మస్క్‌కు మద్దతుగా మాట్లాడుతుంటే.. మరికొందరు ఆయన వైఖరిని వ్యతిరేకిస్తున్నారు. అయితే, ఈ వాదోపవాదాలను కాసేపు పక్కనపెడితే.. అసలు స్టార్‌లింక్‌ ఆలోచన మస్క్‌కు ఎలా వచ్చింది? ఇంటర్నెట్‌ కోసం వేలాది ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపాలనే ఆలోచన వెనుక ఉన్న వ్యాపార వ్యూహం ఏమిటి?  స్టార్‌లింక్‌ వెనుక ఉన్న  ఆసక్తికర కథను ఒక్కసారి తెలుసుకుందాం..

స్టార్‌లింక్‌ భూమికి కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తులో తిరిగే వేలాది తక్కువ కక్ష్య ఉపగ్రహాల నెట్‌వర్క్‌ ద్వారా ఇంటర్నెట్‌ సేవలను అందిస్తుంది. భూమిపై ఉన్న గ్రౌండ్‌ స్టేషన్ల నుంచి ఉపగ్రహాలకు చేరిన డేటా.. అక్కడి నుంచి వినియోగదారుల ఇళ్లు, కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసే ప్రత్యేక డిష్‌ యాంటెన్నాకు చేరుతుంది. ఈ డిష్‌కు అనుసంధానమైన వైఫై రూటర్‌ ద్వారా మొబైల్‌, కంప్యూటర్‌ వంటి పరికరాల్లో ఇంటర్నెట్‌ ఉపయోగించుకోవచ్చు. ఉపగ్రహాలు భూమికి దగ్గరగా ఉండటంతో సంప్రదాయ భౌస్థిర ఉపగ్రహ ఇంటర్నెట్‌తో పోలిస్తే సిగ్నల్‌ ఆలస్యం (లేటెన్సీ) తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా, కేబుళ్లు వేయడం ఖరీదైన లేదా కష్టమైన మారుమూల ప్రాంతాల్లోనూ ఇంటర్నెట్‌ కనెక్టివిటీ అందించడానికి స్టార్‌లింక్‌ ఉపయోగపడుతుంది.

మస్క్ ఎంట్రీతో మారిన సీన్

భూమిపై ఇంటర్నెట్‌ సౌకర్యం లేని ప్రాంతాలకు అంతరిక్షం నుంచి కనెక్టివిటీ అందించాలనే ఆలోచన స్టార్‌లింక్‌తోనే మొదలుకాలేదు. 1980ల నుంచే భూమికి దగ్గరగా తిరిగే ఉపగ్రహాల సమూహాలను ఉపయోగించాలనే ప్రతిపాదనలు వచ్చాయి. 1990లలో టెలిడెసిక్‌, ఇరిడియం, గ్లోబల్‌స్టార్‌ వంటి సంస్థలు తక్కువ భూకక్ష్యలోని ఉపగ్రహాలతో కమ్యూనికేషన్‌ సేవలను అందించేందుకు ప్రయత్నించాయి. అయితే, భారీ పెట్టుబడులు, సాంకేతిక పరిమితులతో  ఈ ప్రాజెక్టులు నిలిచిపోయాయి.  

2014 ప్రారంభంలో ఎలాన్‌ మస్క్‌, వ్యాపారవేత్త గ్రెగ్‌ వైలర్‌ కలిసి సుమారు 700 ఉపగ్రహాలతో ‘వరల్డ్‌వూ’ పేరుతో ఒక నెట్‌వర్క్‌ను ప్రతిపాదించారు. అయితే ఇది కూడా చర్చల దశలోనే నిలిచిపోయింది. దీంతో ఎలాన్ మస్క్ సంస్థ స్పేస్‌ఎక్స్‌ సొంతంగా ఉపగ్రహ ఇంటర్నెట్‌ ప్రణాళికను ముందుకు తీసుకెళ్లింది. 2015 జనవరిలో అమెరికాలోని రెడ్‌మండ్‌లో స్పేస్‌ఎక్స్‌ ఉపగ్రహ అభివృద్ధి కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా స్టార్‌లింక్‌ ప్రాజెక్టును మస్క్ బహిరంగంగా ప్రకటించారు. 2016 నవంబర్‌లో స్పేస్‌ఎక్స్‌ అమెరికా ఫెడరల్‌ కమ్యూనికేషన్స్‌ కమిషన్‌ (FCC)కు ఉపగ్రహ వ్యవస్థ నిర్వహణ కోసం దరఖాస్తు చేసింది. ఈ క్రమంలో  "Starlink" అనే పేరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.   2019 మే 24న ఫాల్కన్‌ 9 రాకెట్‌ ద్వారా ఒకేసారి 60  ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపారు. 2020 జులైలో ఎంపిక చేసిన వినియోగదారులతో పరిమిత బీటా పరీక్షలు ప్రారంభమయ్యాయి. అదే ఏడాది అక్టోబర్‌లో విస్తృత ప్రజా బీటా సేవలను ప్రారంభించారు. 2021లో అమెరికా, కెనడా సహా పలు దేశాల్లో విస్తృతంగా వాణిజ్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. తర్వాత దశల వారీగా యూకే, జర్మనీ, ఫ్రాన్స్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, యూరప్‌, లాటిన్‌ అమెరికా, ఆసియా, ఆఫ్రికాలోని పలు దేశాలు, భూభాగాల్లోనూ స్టార్‌లింక్‌ అందుబాటులోకి వచ్చింది. అయితే, స్టార్‌లింక్‌ ఒకసారి ప్రారంభించి పూర్తిచేసిన ప్రాజెక్టు కాదు. నెట్‌వర్క్‌ సామర్థ్యాన్ని పెంచేందుకు కొత్త ఉపగ్రహాలను నిరంతరం ప్రయోగిస్తూ, పాత ఉపగ్రహాలను కక్ష్య నుంచి తొలగిస్తూ, మెరుగైన సాంకేతికతను జోడిస్తూ నిరంతరం విస్తరిస్తున్న వ్యవస్థ.

167కిపైగా దేశాలు..11 బిలియన్ డాలర్ల ఆదాయం

స్టార్‌లింక్‌ నెట్‌వర్క్‌ విస్తరణ ఏ స్థాయిలో ఉందో ఉపగ్రహాల సంఖ్యే చెబుతోంది. ఉపగ్రహాల కదలికలను ట్రాక్‌ చేసే జోనాథన్‌ మెక్‌డోవెల్‌ గణాంకాల ప్రకారం.. 2026 ఆగస్టు 27 నాటికి కక్ష్యలో 11,102 స్టార్‌లింక్‌ ఉపగ్రహాలు ఉండగా, వాటిలో 11,087 పనిచేస్తున్నాయని Space.com వెల్లడించింది. 2026 అక్టోబర్‌లో ప్రచురితమైన బిజినెస్‌ ఇన్‌సైడర్‌ నివేదిక ప్రకారం.. ప్రస్తుతం 167కి పైగా దేశాలు, ప్రాంతాలు, ఇతర మార్కెట్లలో స్టార్‌లింక్‌  సేవలు అందుబాటులో ఉన్నాయి.  1.3 (13 మిలియన్లు) కోట్ల మంది వినియోగదారులతో 11 బిలియన్ డాలర్ల (రూ. 90,000 కోట్లకు పైగా) ఆదాయాన్ని ఆర్జిస్తోంది. స్పేస్‌ఎక్స్‌ కంపెనీకి 60 శాతం ఆదాయం స్టార్‌లింక్‌ నుంచే వస్తోంది. 2025లో స్పేస్‌ఎక్స్‌ మొత్తం ఆదాయం సుమారు 1870 కోట్ల డాలర్లు కాగా, స్టార్‌లింక్‌ సహా కనెక్టివిటీ విభాగం ఆదాయం 1138.7 కోట్ల డాలర్లు. అంటే మొత్తం ఆదాయంలో సుమారు 61 శాతం.

అంగారకుడే లక్ష్యం.. స్టార్‌లింక్‌ ఆదాయమే ఇంధనం!

అంగారకుడిపై మానవ నివాసాల ఏర్పాటు ఎలాన్‌ మస్క్‌ కల.. ఆ కలను నిజం చేసుకునేందుకు ఆయన ఎంచుకున్న మార్గం మాత్రం భూమిపై ఇంటర్నెట్‌ వ్యాపారం! స్టార్‌లింక్‌ వెనుక ఉన్న అసలు వ్యూహం ఇదే. ప్రముఖ జీవిత చరిత్ర రచయిత వాల్టర్‌ ఐజాక్‌సన్‌ రాసిన Elon Musk పుస్తకం ప్రకారం.. 2014 చివర్లో ప్రపంచ ఇంటర్నెట్‌ మార్కెట్‌పై దృష్టి సారించిన మస్క్‌, అందులో మూడు శాతం వాటా సాధించినా ఏడాదికి సుమారు 30 బిలియన్‌ డాలర్ల ఆదాయం పొందవచ్చని లెక్కించారు. ఆ ఆదాయంతో స్పేస్‌ఎక్స్‌ అంతరిక్ష ప్రయోగాలకు నిధులు సమకూర్చుకోవడం, పునర్వినియోగ రాకెట్ల ద్వారా ప్రయోగాల ఖర్చు తగ్గించడం, భవిష్యత్తులో మానవులను అంగారకుడిపైకి తీసుకెళ్లే సాంకేతికతను అభివృద్ధి చేయడం ఆయన దీర్ఘకాలిక వ్యూహంలో భాగం. అంతేకాకుండా ప్రపంచంలో సగం మందికి పైగా ఇప్పటికీ సరిగ్గా ఇంటర్నెట్ లేని గ్రామీణ, కొండ ప్రాంతాలు, సముద్రాలు, దీవులలో నివసిస్తున్నారు. అక్కడ కేబుళ్లు వేయడం అసాధ్యం. అంతరిక్షం నుండి నేరుగా సిగ్నల్స్ అందిస్తే ప్రపంచంలో ప్రతి మూలకూ వేగవంతమైన ఇంటర్నెట్ అందించవచ్చని  మస్క్ భావించారు. ఈ క్రమంలో స్టార్‌లింక్‌ ప్రపంచవ్యాప్తంగా ఉపగ్రహ ఇంటర్నెట్‌ సేవలను అందించే వ్యాపారంగా ఎదగడమే కాకుండా.. మస్క్‌ అంతరిక్ష ఆశయాలకు ఆర్థిక, సాంకేతికంగా తోడ్పడే ప్రాజెక్టుగా మారింది.

ప్రేమకథా నవల ప్రేరణతో..

‘స్టార్‌లింక్‌’ అనే పేరు వినగానే అంతరిక్షంలోని నక్షత్రాలను అనుసంధానించే వ్యవస్థ గుర్తుకొస్తుంది. కానీ ఈ పేరుకు వెనుక ఉన్న ప్రేరణ అంతరిక్ష సాంకేతికత కాదు.. ఓ ప్రేమకథా నవల! 2018లో సామాజిక మాధ్యమంలో స్పందించిన ఎలాన్‌ మస్క్‌.. ‘స్టార్‌లింక్‌’ పేరుకు జాన్‌ గ్రీన్‌ రాసిన 2012 నవల The Fault in Our Stars ప్రేరణగా నిలిచిందని వెల్లడించారు.

 సక్సెస్ ఫార్ములా

గతంలోనూ పలు సంస్థలు ఉపగ్రహాల ద్వారా ఇంటర్నెట్‌ అందించేందుకు ప్రయత్నించినా.. స్టార్‌లింక్‌ స్థాయిలో నెట్‌వర్క్‌ను విస్తరించడం సవాలుగా మారింది. అయితే, ఎలాన్‌ మస్క్‌ విజయానికి ప్రధానంగా మూడు అంశాలు తోడ్పడ్డాయి. మొదటిది.. రాకెట్ల పునర్వినియోగ సాంకేతికత. స్పేస్‌ఎక్స్‌ ఫాల్కన్‌ 9 రాకెట్ల మొదటి దశను తిరిగి భూమిపైకి తీసుకొచ్చి, మళ్లీ ప్రయోగాలకు ఉపయోగించడం ద్వారా ఖర్చులను తగ్గించింది. రెండోది.. ఉపగ్రహాల కక్ష్య ఎత్తు. సంప్రదాయ భూస్థిర ఉపగ్రహాలు భూమికి సుమారు 35,786 కిలోమీటర్ల ఎత్తులో ఉంటే.. స్టార్‌లింక్‌ ఉపగ్రహాలు ప్రధానంగా కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తులోని దిగువ భూ కక్ష్యలో (LEO) పనిచేస్తాయి. దీనివల్ల సిగ్నల్‌ ఆలస్యం తగ్గి, వీడియో కాల్స్‌, ఆన్‌లైన్‌ గేమింగ్‌ వంటి సేవలకు మెరుగైన కనెక్టివిటీ అందుతుంది. మూడోది.. ఉపగ్రహాల తయారీ నుంచి రాకెట్‌ ప్రయోగాల వరకు కీలక కార్యకలాపాలను స్పేస్‌ఎక్స్‌ స్వయంగా నిర్వహించడం. దీంతో ఖర్చులు, ప్రయోగాల షెడ్యూల్‌పై నియంత్రణ పెరిగింది. అవసరాన్ని బట్టి కొత్త ఉపగ్రహాలను పంపడం, పాతవాటిని తొలగించి కొత్త సాంకేతికతను ప్రవేశపెట్టడం కూడా సులభమైంది. ఇలా తక్కువ ప్రయోగ వ్యయం, తక్కువ సిగ్నల్‌ ఆలస్యం, సమగ్ర సాంకేతిక వ్యవస్థ.. ఈ మూడు అంశాలు స్టార్‌లింక్‌ విస్తరణలో కీలక పాత్ర పోషించాయి.

42 వేల ఉపగ్రహాలు..ఫోన్‌కే నేరుగా సిగ్నల్‌ !

స్టార్‌లింక్‌ భవిష్యత్తు ప్రణాళికలు మరింత విస్తృతంగా ఉన్నాయి. భూమి చుట్టూ దాదాపు 42,000 ఉపగ్రహాలతో భారీ నెట్‌వర్క్‌ను నిర్మించాలన్నది స్పేస్‌ఎక్స్‌ దీర్ఘకాలిక లక్ష్యం. మరోవైపు, డైరెక్ట్‌-టు-సెల్‌ (Direct to Cell) సాంకేతికతతో ప్రత్యేక డిష్‌లు, బాహ్య యాంటెన్నాలు లేకుండానే సాధారణ స్మార్ట్‌ ఫోన్‌లకు నేరుగా ఉపగ్రహాల నుంచి సిగ్నల్‌ అందించాలని ప్రయత్నిస్తోంది. దీనివల్ల సెల్‌ఫోన్‌ టవర్లు అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లోనూ మొబైల్‌ కనెక్టివిటీ సాధ్యమవుతుంది.