

మనిషిని బలహీనుడిని చేసి, బతుకును భారంగా మార్చేసే మాయరోగం డిప్రెషన్. మెదడులో తిష్ఠ వేసి శారీరక, మానసిక ఆరోగ్యాన్నికుంగదీస్తుంది. అనవసర ఆలోచనలు రేకెత్తిస్తుంది. ఒకప్పుడు వయసు మళ్ళినవాళ్లలో మాత్రమే కనిపించే ఈ రుగ్మత ఇప్పుడు చిన్నాపెద్దా లేకుండా అందరినీ వెంటాడుతోంది. మరీ ముఖ్యంగా టీనేజ్ పిల్లల్లో ఇది చాలా పెద్ద సమస్యగా మారింది. అయితే, ఈ కుంగుబాటుకు నడకతో చెక్ పెట్టవచ్చంటోంది ఓ సర్వే.
లండన్ కింగ్స్ కాలేజీ ఇన్సిట్యూట్ ఆఫ్ సైకియాట్రి, సైకాలజీ అండ్ న్యూరోసైన్స్; యూనివర్సిటీ ఆఫ్ మాసాచ్యుసెట్స్ హామ్సెర్ట్ (అమెరికా) కలసి ఈ సర్వే చేశాయి. అమెరికాలోని హైస్కూలు స్థాయి విద్యార్థుల్లో కుంగుబాటు సమస్య తీవ్రంగా ఉన్నట్లు ఈ అధ్యయనం గుర్తించింది. టీనేజీలో దాదాపు 33శాతం మంది డిప్రెషన్ వల్ల నిస్సహాయత, విచారంలో ఉన్నట్లు కనుగొంది. 23 శాతం మందిని మానసిక అనారోగ్యం వేధిస్తోందని, 14శాతం మంది ఆ*త్మహత్య ఆలోచనలు సైతం చేసినట్లు తేల్చింది. ఈ సర్వే కోసం 11 నుంచి 12 ఏళ్ల లోపు ఉన్న హైస్కూలు పిల్లల్లో మానసిక ఆరోగ్యం రోజువారీ నడకను అనుసరించి ఎలా ఉందో ఏడాది పాటు సర్వే టీమ్ గమనించింది.
కారణాలు ఇవీ..
టీనేజీలోనే కుంగుబాటు బారిన పడడానికి చాలా కారణాలు ఉన్నాయని సర్వే చెబుతోంది. ఒంటరితనం, సోషల్ మీడియా ప్రభావం, వేధింపులు, చదువుపై పెరుగుతున్నఅంచనాలు వంటి వాటితోపాటు ప్రస్తుత సమాజం తీరూ దీనికి కారణమేనంటోంది.
ఆరోగ్యానికి అడుగులు..
సమస్యకు పరిష్కారాన్నీఅధ్యయన బృందం కనుగొంది. కుంగుబాటును నడక తగ్గిస్తున్నట్లు గుర్తించింది. రోజూ 5వేలు, అంతకంటే తక్కువ అడుగులు నడిచే యువతలో మానసిక సమస్యలు ఎక్కువగా ఉన్నాయని, 8వేల అడుగులకు పైగా నడిచే వాళ్లలో కాస్త తక్కువ కనిపించాయని తేల్చింది. ఇక, రోజూ 12వేలకు పైగా అడుగులు నడిచేవాళ్లు మానసికంగా చాలా బలంగా ఉన్నట్లు వెల్లడించింది.
నడిచే మార్గాలు..
టీనేజీ యువతలో నడిచే అలవాటు ప్రస్తుతం బాగా తగ్గిపోయింది. స్కూలు బస్సులు, బైక్ లు, కార్లు అందుబాటులోకి రావడంతో కనీసం స్కూలుకు కూడా నడిచి వెళ్లడం లేదు. అయితే, మానసిక ఆరోగ్యం బలంగా ఉండాలంటే, మెంటల్ హెల్త్ ఇష్యూస్ రాకూడదంటే నడక తప్పనిసరి అని నిపుణులు అంటున్నారు. దీనికోసం కొన్ని మార్గాలు సూచించారు. అవి..
1. దగ్గరలోనే ఉన్నస్కూల్/కాలేజీకి రోజూ నడచి వెళ్లడం.
2. మొబైల్లో మాట్లాడుతున్నప్పుడు ఇంట్లోనో లాన్ లోనో కాసేపు అటూ ఇటూ తిరగడం.
3. ఏదైనా స్పోర్ట్స్ స్కూల్లో, నచ్చిన ఆటలో జాయిన్ కావడం.
4. రాత్రి డిన్నర్ చేసిన తర్వాత కుటుంబంతో కలసి కాసేపు నడవడం.
5. పెట్స్‌తో కలసి కాసేపు రాత్రిళ్లు వాకింగ్ చేయడం.
6. కెమెరా తీసుకొని దగ్గరలోని అందమైన ప్లేసెస్‌కు వెళ్లి ఫొటోలు తీయడం.
7. వీకెండ్లో ఏదైనా లోకల్ మ్యూజియానికో ఇంకేదైనా టూరిస్ట్ ప్లేస్‌కో వెళ్లడం. స్నేహితులతో కలసి వాకింగ్ టూర్స్ వేయడం.
8. ఫ్రెండ్స్‌తో నడక గురించి చాలెంజ్ చేసి పోటీ పడడం.
9. ఏదైనా డ్యాన్స్ కోర్సులో జాయిన్ కావడం.
10. స్కూల్/కాలేజీలోని వాకింగ్/రన్నింగ్ ట్రాక్ మీద రోజూ కనీసం 2వేల అడుగులు నడవడం.
వీటిలో ఏ ఒక్కటి పాటించినా అది టీనేజీ పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యానికి కాస్తంత భరోసా ఇస్తుందని సర్వే బృందం చెబుతోంది. మరింకెందుకు ఆలస్యం.. టీనేజీ పిల్లలూ ఈరోజే మీ దినచర్యలో నడకను భాగం చేసుకోండి. పేరెంట్సూ.. మీ పిల్లలకు నడతతోపాటు నడక గురించీ చెప్పండి. ఎందుకంటే..చదువుల ఒత్తిళ్లతో పిల్లల ఆ*త్మహత్యలు పెరిగిపోతున్న ప్రస్తుత కాలంలో వాళ్లను కాపాడుకొనేందుకు ఉన్న ఏ చిన్నఅవకాశాన్నైనా ఉపయోగించుకోవడం పేరెంట్స్‌గా మీ బాధ్యత.