

ముంబై: జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయల్ అధునాతన హెల్త్ ట్రాకింగ్ గ్యాడ్జెట్‌ను మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. దాని పేరే ‘టెంపుల్’. ధర రూ.85వేలు. చిన్న క్యాప్సుల్ సైజులో ఉండే ఈ పరికరాన్ని కంటికి, చెవికి మధ్యనుండే కణత భాగంలో పెట్టుకోవాలి. గ్రిప్స్ అనే మెడికల్ గ్రేడ్ డిస్పోజబుల్ స్టిక్కర్ టేప్‌తో దీన్ని కణత భాగంలోని చర్మానికి అతికించుకోవాలి. కణత భాగాన్ని ఆంగ్లంలో ‘టెంపుల్ రీజియన్’ అంటారు. ఇందువల్లే ఈ డివైజ్‌కు టెంపుల్ అనే పేరును పెట్టారు.
పరికరం నుంచి యాప్‌కు అప్డేట్స్
టెంపుల్ అనేది మెదడు పనితీరును, శారీరక స్పందనలను ట్రాక్ చేసే అధునాతన పరికరం. ఇది పీపీజీ లైట్ సెన్సర్లతో మెదడులోని రక్త ప్రసరణ, ఆక్సిజన్ స్థాయిల తీరును పర్యవేక్షిస్తుంది. ఈ సెన్సర్లు నుదుటిపై కాంతిని ప్రసరింపజేసి రక్తకణాల కదలికలను నిశితంగా పరిశీలిస్తాయి. వీటితో ముడిపడిన అప్డేట్స్ను టెంపుల్ మొబైల్ యాప్‌కు ఎప్పటికప్పుడు చేరవేస్తాయి. ఈ పరికరం కోసం ప్రీ–ఆర్డర్ల స్వీకరణ 2026 నవంబర్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఇందులోనే లైఫ్‌టైమ్ సబ్‌స్క్రిప్షన్ ఫీజు కలిసి ఉంటుంది. అంటే భవిష్యత్తులో టెంపుల్ యాప్ సేవల కోసం రూపాయి కూడా కట్టనక్కర్లేదు.
‘టెంపుల్’ చేసే పనులివే
· రోజంతా కంప్యూటర్ల ముందు కూర్చొని పని చేసేవాళ్లకు ఎప్పుడు మెదడు అలసిపోతుందో, ఎప్పుడు ఏకాగ్రత తగ్గుతుందో తెలియదు. ఈ పరికరం మెదడులోని రక్త ప్రసరణను నిరంతరం కొలవడం ద్వారా మీరు ఏ సమయంలో చురుగ్గా ఉన్నారో, ఏ సమయంలో మెదడుకు విశ్రాంతి అవసరమో పసిగట్టి యాప్‌కు అలర్ట్స్ పంపుతుంది.
· ఈ పరికరం ప్రతి సెకనుకు ఎంట్రోపీ అనే ప్రత్యేక స్కోరును (1 నుంచి 250 స్కేల్‌లో) లెక్కిస్తుంది. నిద్రలేమి, అధిక పని ఒత్తిడి, కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంపై ఎంత శారీరక, మానసిక భారం పడుతుందో ఈ స్కోరు ద్వారా తెలుసుకోవచ్చు. ఒత్తిడిని తగ్గించుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
· క్రీడాకారులు, అథ్లెట్లు భారీ వ్యాయామాలు, కార్డియో సెషన్లు చేసినప్పుడు వారి మెదడు, శరీరం ఎలా స్పందిస్తోందో ఇది ట్రాక్ చేస్తుంది. వర్కౌట్ తర్వాత శరీరం ఎంత వేగంగా పూర్వ స్థితికి చేరుకుంటుందో అర్థం చేసుకోవడానికి ఇది సహాయపడుతుంది.
టార్గెట్ కస్టమర్లు వీళ్లే
మైక్రో ఇంజినీరింగ్ టెక్నాలజీతో టెంపుల్ పరికరం తయారీకి భారీగా ఖర్చవుతుంది. దీపిందర్ గోయల్ దీని మేకింగ్‌పై రీసెర్చ్ కోసం దాదాపు రూ.210 కోట్లు పెట్టుబడి పెట్టారు. టెంపుల్ సంస్థకు చెందిన న్యూరో సైంటిస్టులు, బయోటెక్ నిపుణులు ఏళ్ల తరబడి శ్రమించి, మెదడు డేటాను ఖచ్చితంగా విశ్లేషించే ఏఐ అల్గారిథమ్స్, సాఫ్ట్‌వేర్‌ను డెవలప్ చేశారు. ఈ ఖర్చంతా జరిగినందు వల్లే టెంపుల్ పరికరం ధర ఇంత ఎక్కువగా ఉంది. అయితే ఇది అందరి కోసం ఉద్దేశించినది కాదు. తమ పనితీరును, ఏకాగ్రతను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాలనుకునే సీఈఓలు, ప్రొఫెషనల్ అథ్లెట్లు, కోటీశ్వరులను టార్గెట్ చేస్తూ దీన్ని లగ్జరీ ప్రీమియం ప్రొడక్ట్‌గా డిజైన్ చేశారు.
వైద్య నిపుణులు ఏమంటున్నారు ?
పలువురు వైద్య నిపుణులు టెంపుల్ పరికరంపై సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. “ఇలాంటి గ్యాడ్జెట్లు ఇచ్చే రీడింగ్స్ ఆస్పత్రుల్లో చేసే నిజమైన క్లినికల్ పరీక్షలకు ప్రత్యామ్నాయం కావు. చర్మంపై పెట్టే ఈ లైట్ సెన్సార్లు పుర్రె ఎముకను దాటుకుని లోపలికి వెళ్లలేవు. ఇది తల పైచర్మం మీదుగా సాగే రక్త ప్రసరణను మాత్రమే కొలుస్తుంది తప్ప, మెదడు అంతర్గత స్థితిని చూపించలేదు” అని ఎయిమ్స్‌లో శిక్షణ పొందిన న్యూరో సర్జన్ డాక్టర్ అరుణ్ ఎల్.నాయక్ అభిప్రాయపడ్డారు. ‘‘టెంపుల్ పరికరం కోటీశ్వరులు, శ్రీమంతులు డబ్బు వృధా చేసుకోవడానికి కొనుక్కునే ఒక ఫ్యాన్సీ బొమ్మ” అని ఎయిమ్స్ ఢిల్లీకి చెందిన ప్రముఖ రేడియాలజిస్ట్, ఏఐ పరిశోధకుడు డాక్టర్ సుభ్రాంకర్ దత్తా వ్యాఖ్యానించారు.