· 5 వికెట్లతో జింబాబ్వే నడ్డివిరిచిన వైష్ణవి శర్మ
· 8 వికెట్ల తేడాతో టీమిండియా విక్టరీ
· 3-0 తేడాతో సిరీస్ గెలిచిన స్మృతి సేన
వడోదర: స్మృతి మందాన కెప్టెన్సీలోని టీమిండియా వన్డేల్లోనూ పసికూన జింబాబ్వేను వైట్‌వాష్ చేసింది. వడోదర వేదికగా బుధవారం జరిగిన మూడో వన్డేలో జింబాబ్వేపై ఏకంగా 8 వికెట్ల తేడాతో టీమిండియా ఉమెన్స్ జట్టు విక్టరీ కొట్టింది. జింబాబ్వే విధించిన 132 పరుగుల టార్గెట్‌ను కేవలం 17 ఓవర్లలోనే ఊదిపడేసింది. లేడీ సెహ్వాగ్ షెఫాలీ వర్మ (59), ప్రతీకా రావల్ (51) ఇద్దరూ చివరి వరకు నిలబడి మ్యాచ్ గెలిపించేశారు. దీంతో మూడు వన్డేల సిరీస్‌ను 3-0 తేడాతో భారత్ కైవసం చేసుకుంది.
వైష్ణవి శర్మ దెబ్బకు కుప్పకూలిన జింబాబ్వే
వడోదర వేదికగా జరిగిన మూడో వన్డేలో 39.5 ఓవర్లలో జింబాబ్వే 131 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా లేడీ సింగం వైష్ణవి శర్మ బౌలింగ్ ఇరగదీసింది. ఆమె దెబ్బకు జింబాబ్వే బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఈ క్రమంలో 10 ఓవర్లు వేసిన వైష్ణవి శర్మ, ఏకంగా 5 వికెట్లు పడగొట్టి 39 పరుగులు ఇచ్చింది. 3.90 ఏకానమీతో ఓ ఓవర్ కూడా మేడీన్ చేసింది. క్రాంతి గౌడ్, సయాలీ సత్ఘరే తలో రెండు వికెట్లు తీసి జింబాంబ్వే నడ్డి విరిచారు. జింబాబ్వే విధించిన లక్ష్యాన్ని టీమిండియా ఆడుతూ పాడుతూ 2 వికెట్లు కోల్పోయి ఛేదించింది.