ప్రభాత ఉదయం, స్పోర్ట్స్ : 2027 వన్డే వరల్డ్ కప్ గెలవాలంటే మహ్మద్ షమీ లాంటి అనుభవమైన బౌలర్ ఉండాల్సిందేనని మహ్మద్ కైఫ్ పేర్కొన్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలతోనే వరల్డ్ కప్ సాధ్యం కాదని తేల్చి చెప్పారు. బలమైన బ్యాటింగ్ ఆర్డర్‌తో పాటు ఫాస్ట్ బౌలర్లు కావాలని సూచనలు చేశారు. అప్పుడే దక్షిణాఫ్రికా లాంటి బౌన్సీ పిచ్‌లపై టీమిండియా రాణిస్తుందని తెలిపారు. 2023 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా షమీ లీడింగ్ వికెట్ టేకర్‌గా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. 36 ఏళ్ల షమీ 2027లోనూ టీమిండియాకు చాలా కీలక కానున్నట్టు పేర్కొన్నారు. షమీతో పాటు బుమ్రా, భువనేశ్వర్, సిరాజ్‌లను తీసుకోవాలని సూచనలు చేశారు.
రీ-ఎంట్రీ కోసం షమీ పోరాటం
మహ్మద్ షమీ టీమిండియాకు దూరమై దాదాపు ఏడాదిన్నరైంది. ఈ సమయంలో ఎన్నో దేశవాళీ, ఐపీఎల్ మ్యాచ్‌లలో షమీ అత్యున్నత ప్రదర్శన కనబరిచాడు. అయినా బీసీసీఐ, సెలక్టర్లు కన్నెత్తి చూడలేదు. 4 ఏళ్ల తర్వాత భువీకి టీమిండియా నుంచి పిలుపువచ్చినప్పటికీ షమీకి మాత్రం నిరాశే మిగిలింది. అయితే, న్యూజిలాండ్‌తో త్వరలో ప్రారంభం కాబోయే వన్డే సిరీస్‌లో షమీని సెలక్ట్ చేస్తారని ప్రచారం సాగుతోంది. అజిత్ అగార్కర్ తప్పుకున్న తర్వాత భువీకి పిలుపురాగా, త్వరలోనే షమీకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే దీనిపై తాత్కాలిక చీఫ్ సెలక్టర్ ప్రగ్యాన్ ఓజా, షమీతో మాట్లాడినట్టు తెలుస్తోంది. ఒకవేళ ఈ వన్డే సిరీస్‌లో స్థానం దక్కించుకుంటే, 2027 వన్డే వరల్డ్ కప్‌నకు రూట్ క్లియర్ కానుంది.