ప్రభాత ఉదయం, ఢిల్లీ: 2036 ఒలింపిక్స్ ఆతిథ్యమే లక్ష్యమని ప్రధాని నరేంద్ర మోడీ తెలిపారు. ఏసియన్ గేమ్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారులతో ఆయన సమావేశమయ్యారు. ఈ తరుణంలోనే వారిని సత్కరించి, ఫోటోలు దిగారు. అనంతరం ప్రధాని మోడీ మాట్లాడుతూ, భారత త్రివర్ణ పతాకాన్ని ఆసియా క్రీడల చాంపియన్లు ఉన్నత శిఖరాలకు చేర్చారని ప్రశంసించారు. పట్టుదల, నమ్మకంతో ఏదైనా సాధించగలమని నిరూపించారన్నారు.
85 మెడల్స్ సాధించి, దేశ కీర్తి ప్రతిష్టలను మరింత పెంచారని కొనియాడారు. 2036 ఒలింపిక్ క్రీడలను ఇండియాలో విజయవంతంగా నిర్వహించడానికి ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోందని పేర్కొన్నారు. ప్రపంచంలోనే పెద్ద క్రీడా పండుగ ఒలింపిక్స్‌ను ఇండియాకు తీసుకురావడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ఇటీవలే ముగిసిన ఆసియా క్రీడల్లో 21 గోల్డ్, 27 సిల్వర్, 37 బ్రాంజ్ సహా మొత్తం 85 పతకాలను భారత్ సాధించింది.