

ప్రభాత ఉదయం, ఢిల్లీ:
దేశంలో అంతర్జాతీయ క్రీడా టోర్నమెంట్లు, చాంపియన్‌షిప్‌ల నిర్వహణను ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పోటీల నిర్వహణ కోసం నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్లకు అందించే ఆర్థిక సాయాన్ని గరిష్ఠంగా రూ.50 కోట్లకు పెంచింది. గతంలో ఈ పరిమితి కేవలం రూ.2 కోట్లుగా ఉండేది. ఈ మేరకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ శుక్రవారం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
ఈ నిధుల పెంపుతో దేశంలోని క్రీడా మైదానాలు, స్టేడియాలు, ఇతర మౌలిక సదుపాయాలను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా అభివృద్ధి చేసేందుకు అవకాశం కలగనుంది. భారత్‌లో అంతర్జాతీయ క్రీడా ఈవెంట్ల నిర్వహణ పెరిగితే ప్రపంచ క్రీడా రంగంలో కీలక హబ్‌గా ఎదిగేందుకు దోహదపడుతుంది. అంతేకాకుండా, ప్రపంచస్థాయి ఆటగాళ్లతో దేశీయ క్రీడాకారులు తలపడేందుకు, తమ ప్రతిభను మెరుగుపరుచుకునేందుకు అవకాశం లభిస్తుంది.