

తెలుగు రాజకీయాల చరిత్రలో 1980వ దశకంలో ఎన్టీఆర్ సంచలనం సృష్టించారు. 1982లో ఎన్టీఆర్ ‘తెలుగుదేశం పార్టీ’ని స్థాపించి, కేవలం తొమ్మిది నెలల్లో దశాబ్దాల కాంగ్రెస్ ఏకఛత్రాధిపత్యాన్ని గండికొట్టారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ఇక కోలుకోదేమో అనే స్థాయిలో 1983, 1985 ఎన్నికల్లో వరుసగా ఘనవిజయాలు సాధించి ఎన్టీఆర్ తిరుగులేని శక్తిగా ఎదిగారు. అయితే, 1989 ఎన్నికలు వచ్చేసరికి రాజకీయ చిత్రం తలకిందులైంది. ప్రజల్లో అపరిమితమైన ఆరాధన ఉన్నప్పటికీ ఎన్టీఆర్ నేతృత్వంలోని తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయాన్ని మూటగట్టుకుంది. కాంగ్రెస్ పార్టీ సరికొత్త ఊపుతో, వ్యూహాత్మకంగా పునరాగమనం చేసింది. ఎన్టీఆర్ వంటి మహా ప్రజాకర్షక నాయకుడిని కాంగ్రెస్ ఎలా ఓడించింది? ఏడేళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ ఒక్కసారిగా ఎలా పుంజుకుంది? మర్రి చెన్నారెడ్డి నాయకత్వం కాంగ్రెస్ విజయానికి ఎంతవరకు దోహదపడింది? ఎన్టీఆర్ పాలనా వైఫల్యాలు, వివాదాస్పద నిర్ణయాలు ఎంతవరకు ప్రభావం చూపాయి? కాంగ్రెస్ పార్టీలోని దిగ్గజ నాయకులు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన రెడ్డి, కోట్ల విజయభాస్కర్ రెడ్డిలు ముఖ్యమంత్రులుగా రాష్ట్రాన్ని ఎలా పాలించారు? ఈ చారిత్రాత్మక ఘట్టం పూర్తి విశ్లేషణ.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో 1989 ఎన్నికలు ఒక కీలక మలుపు. టీడీపీ స్థాపించాక జరిగిన మొదటి రెండు అసెంబ్లీ ఎన్నికల్లో 1983లో 201 సీట్లు 1985లో 202 సీట్లను గెలుచుకుంది. కానీ 1989 వచ్చే నాటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. 1989 నవంబర్ 22న జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 181 సీట్లతో ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. తెలుగుదేశం పార్టీ మాత్రం 74 సీట్లే దక్కించుకుని చరిత్రలో మొదటిసారి ప్రతిపక్షమైంది. లోక్‌సభ ఎన్నికల్లోనూ టీడీపీ కేవలం రెండు సీట్లే (బొబ్బిలి, నర్సాపురం) సాధించి ఘోర పరాజయాన్ని చవిచూసింది. కాంగ్రెస్ ఓటు శాతం 47.09 శాతానికి పెరగగా, టీడీపీ 36.54 శాతానికి పడిపోయింది. 1985లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో టీడీపీ 202 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటే కాంగ్రెస్ కేవలం 50 సీట్లకే పరిమితమైంది. దీంతో ఒక దశలో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ రాజకీయంగా కోలుకోవడం కష్టమేననే అభిప్రాయం ఏర్పడింది. 1989 అంటే కేవలం నాలుగేళ్లకే జరిగిన ఎన్నికలలో టీడీపీ 202 నుంచి 74 సీట్లకు పడిపోయింది. అదే సమయంలో కాంగ్రెస్ 50 నుంచి 181 సీట్లకు ఎగబాకింది.
ముందస్తు నిర్ణయం.. అంచనా తప్పిందా?
రాష్ట్ర అసెంబ్లీ పదవీకాలం1990 మార్చి వరకూ ఉన్నా లోక్‌సభ ఎన్నికలు ముందే రావడంతో ఎన్టీఆర్ జమిలి ఎన్నికలకే నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీని ముందుగానే రద్దు చేసి లోక్‌సభ ఎన్నికలతో పాటు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లారు. ఆ సమయంలో టీడీపీ నాయకత్వం కొన్ని రాజకీయ అంచనాలు వేసింది. కేంద్రంలో రాజీవ్‌గాంధీ ప్రభుత్వంపై బోఫోర్స్ ఆరోపణలు, కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు, ఎన్టీఆర్‌కు ఉన్న వ్యక్తిగత ప్రజాదరణ, లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగితే జాతీయ స్థాయి అంశాలు ప్రభావితం చేసి మళ్లీ తేలికగా గెలవవచ్చని భావించారు. కానీ దానికి విరుద్ధంగా స్థానిక అంశాలు ముందంజలోకి వచ్చాయి. 1985 నుండి 1989 వరకు పాలనలో ఎన్టీఆర్ తీసుకున్న కొన్ని నిర్ణయాలు తీవ్ర అసంతృప్తికి దారితీశాయి. ఉద్యోగులు & ఉపాధ్యాయుల నిరసనలు, మంత్రులందరినీ బర్తరఫ్ చేయడం, సినిమాలకు ప్రాధాన్యం ఇస్తున్నారు అనే ఆరోపణలు టీడీపీకి ఓటమికి కారణాలుగా నిలిచాయి. రాష్ట్రంలో పెరిగిన ప్రభుత్వ వ్యతిరేకతను, స్థానిక అసంతృప్తిని సరిదిద్దుకోకుండా ముందస్తుగా ఎన్నికలకు వెళ్లడం రాజకీయంగా వ్యూహాత్మక పొరపాటుగా పరిణమించింది.
మర్రి చెన్నారెడ్డి చాకచక్యం
1989 ఎన్నికలకు ముందు ఎన్టీఆర్ ప్రభంజనాన్ని తట్టుకోవడానికి కాంగ్రెస్ హైకమాండ్ సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న మర్రి చెన్నారెడ్డికి పీసీసీ (APCC) అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. ఈ ఎత్తుగడ చాలా బాగా పని చేసింది. చెన్నారెడ్డి పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలను, వర్గపోరును సమర్థవంతంగా అణచివేసి నేతలందరినీ ఒకే తాటిపైకి తెచ్చారు. క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు.ఎన్టీఆర్ 1985-1989 మధ్య తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలను చెన్నారెడ్డి క్షేత్రస్థాయిలోకి బలంగా తీసుకెళ్లారు. 1983, 1985లలో టీడీపీ వైపు తరలివెళ్లిన కాంగ్రెస్ సాంప్రదాయ ఓటు బ్యాంక్‌ను (రెడ్డి సామాజికవర్గం, దళితులు, మైనారిటీలు) తిరిగి కాంగ్రెస్ గూటికి చేర్చడంలో ఆయన విజయం సాధించారు. బీసీ వర్గాలకు కూడా సీట్ల కేటాయింపులో ప్రాధాన్యం ఇచ్చి వారి మద్దతు కూడగట్టారు. టిక్కెట్ల కేటాయింపులో క్షేత్రస్థాయిలో బలం ఉన్న అభ్యర్థులకే ప్రాధాన్యమివ్వడం కాంగ్రెస్‌కు కలిసివచ్చింది.
టీడీపీ ఓటమికి..అనేక రాజకీయ, పాలనాపరమైన కారణాలు
1989 శాసనసభ ఎన్నికల్లో ఎన్టీఆర్ నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ ఓటమికి అనేక రాజకీయ, పాలనాపరమైన కారణాలు కలగలిసి దోహదం చేశాయి. 1985–1989 మధ్య కాలంలో ఎన్టీఆర్ తీసుకున్న కొన్ని వివాదాస్పద నిర్ణయాలు సమాజంలోని వివిధ వర్గాల్లో తీవ్ర అసంతృప్తిని రాజేశాయి. విశేషించి, ప్రభుత్వ ఉద్యోగుల విరమణ వయస్సును తగ్గించడం, సమ్మెల సమయంలో కఠిన వైఖరి అవలంబించడం వల్ల సుమారు 3 లక్షల మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకమయ్యారు. అలాగే 1989 ఫిబ్రవరిలో సమాచారం లీకేజీ నెపంతో తన మంత్రివర్గంలోని 31 మంది మంత్రులనూ ఒకేసారి బర్తరఫ్ చేయడం పార్టీ అంతర్గతంగా పెద్ద సంక్షోభానికి, స్థానిక నాయకులలో అసమ్మతికి దారితీసింది. విజయవాడలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగారావు హత్యతో ఆయన సామాజికవర్గంలో తెలుగుదేశంపై వ్యతిరేకత పెరిగింది. ముఖ్యమంత్రి హోదాలో ఉండి 'బ్రహ్మర్షి విశ్వామిత్ర' సినిమా నిర్మాణం, దర్శకత్వంతోపాటు అందులో వివిధ వేషధారణలు వేయడం, గంటల తరబడి మేకప్‌లతో గడపడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. రాష్ట్రంలో కరువు, ఉద్యోగుల సమ్మె వంటి తీవ్రమైన సమస్యలు ఉన్న సమయంలో సీఎం సినిమాలు తీసుకోవడంలో నిమగ్నమయ్యారనే సందేశం ప్రజల్లోకి వెళ్లింది. ఇలా చాలా కారణాలు ఎన్టీఆర్ ప్రభుత్వ ఓటమికి కారణమయ్యాయి.
వ్యక్తిగతంగా కూడా ఎన్టీఆర్ ప్రతిష్టకు మచ్చ
వ్యక్తిగతంగానూ ఎన్టీఆర్ రాజకీయ ప్రతిష్టకు మచ్చగా మిగిలిన ఎన్నికలుగా 1989 అసెంబ్లీ ఎన్నికలు నిలిచిపోయాయి. ఆ ఎన్నికల్లో ఎన్టీ రామారావు ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తి, అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గాల నుంచి పోటీ చేశారు. అప్పటి జనతాదళ్ నేత ఎస్. జైపాల్‌రెడ్డి సూచనతో ఎన్టీఆర్ కల్వకుర్తి నుంచి బరిలోకి దిగారు. అయితే అక్కడ ఆయనకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్ అభ్యర్థి చిత్తరంజన్ దాస్ చేతిలో ఎన్టీఆర్ 3,568 ఓట్ల తేడాతో ఓడిపోయారు. హిందూపురంలో విజయం సాధించినప్పటికీ, కల్వకుర్తి ఫలితం ఎన్టీఆర్ రాజకీయ జీవితంలో ప్రత్యేక ముద్ర వేసింది. రాజకీయ ప్రస్థానంలో ఆయన అసెంబ్లీ ఎన్నికల్లో ఎదుర్కొన్న ఏకైక ఓటమిగా కల్వకుర్తి పరాజయం నిలిచిపోయింది.
ముగ్గరు ముఖ్యమంత్రుల కథ
1989 ఎన్నికల్లో భారీ విజయంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ, 1989 నుంచి 1994 వరకు ఐదేళ్ల కాలంలో ముగ్గురు ముఖ్యమంత్రులను మార్చడం ఒక సంచలనాత్మక ఘట్టం. ఎన్టీఆర్ ప్రాభవాన్ని తట్టుకుని సాధించిన ఘనవిజయాన్ని అంతర్గత విభేదాలు, వర్గపోరు, అధిష్టానం నిర్ణయాల వల్ల కాంగ్రెస్ సరిగ్గా వినియోగించుకోలేకపోయింది.
డాక్టర్ మర్రి చెన్నారెడ్డి (డిసెంబర్ 1989 – డిసెంబర్ 1990)
1989 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని ఘనవిజయ తీరాలకు చేర్చిన ప్రధాన వ్యూహకర్తగా డాక్టర్ మర్రి చెన్నారెడ్డి రెండోసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఎన్టీఆర్ హయాంలో ప్రభుత్వంతో విభేదించిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల డిమాండ్లపై చెన్నారెడ్డి సానుకూలంగా స్పందించారు. వారి బదిలీలు, వేతన సవరణలు, పదవీ విరమణ వయస్సు సంబంధిత అంశాలను పరిష్కరించి ఉద్యోగ వర్గాల్లో నమ్మకాన్ని పునరుద్ధరించారు. 1990 చివరినాటికి హైదరాబాద్ పాతబస్తీలో తీవ్రస్థాయిలో మత అల్లర్లు చెలరేగాయి. ఇది రాష్ట్ర శాంతిభద్రతల వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. ఈ అల్లర్లను అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమైందనే విమర్శలు వెల్లువెత్తాయి. సీనియర్ నేతలతో విభేదాలు, కాంగ్రెస్ అధిష్టానం ఒత్తిడి కారణంగా ఆయన ఏడాది తిరక్కుండానే సీఎం పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
నేదురుమల్లి జనార్దనరెడ్డి (డిసెంబర్ 1990 – అక్టోబర్ 1992)
చెన్నారెడ్డి నిష్క్రమణ అనంతరం నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ నేత నేదురుమల్లి జనార్దనరెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. నేదురుమల్లి పాలనా కాలంలో తీసుకున్న అత్యంత కీలకమైన నిర్ణయం నక్సలైట్ల (పీపుల్స్ వార్ గ్రూప్) పై నిషేధం విధించడం. శాంతిభద్రతల పరిరక్షణ ధ్యేయంగా నక్సల్స్ కదలికలపై తీవ్ర ఆంక్షలు విధించి, పోలీసు యంత్రాంగానికి పూర్తి స్వేచ్ఛనిచ్చారు. ఈయన హయాంలోనే గ్రామీణ ప్రాంతాల్లో 'సారా వ్యతిరేక ఉద్యమం' మెల్లగా ఊపందుకోవడం ప్రారంభమైంది. అయితే, ప్రైవేట్ మెడికల్, ఇంజనీరింగ్ కళాశాలలకు అనుమతులు మంజూరు చేయడంలో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలు, ఆ తర్వాత రాష్ట్ర హైకోర్టు తీవ్ర స్థాయిలో నిరసిస్తూ ఇచ్చిన తీర్పు నేదురుమల్లి ప్రభుత్వాన్ని తీవ్ర ప్రతికూలతలోకి నెట్టాయి. దాంతో నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తన పదవి నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.
కోట్ల విజయభాస్కరరెడ్డి (అక్టోబర్ 1992 – డిసెంబర్ 1994)
అంతర్గత కలహాలతో కూరుకుపోయిన పార్టీని చక్కదిద్దేందుకు రాయలసీమకు చెందిన సీనియర్ నేత, అప్పటి కేంద్ర మంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డిని అధిష్టానం మూడో సీఎంగా పంపింది. నెల్లూరులో ప్రారంభమైన సారా వ్యతిరేక పోరాటం ఉగ్రరూపం దాల్చడంతో , 1993 అక్టోబర్ 2 నుంచి రాష్ట్రంలో సారా విక్రయాలను సంపూర్ణంగా నిషేధిస్తూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. కోట్ల విజయభాస్కరరెడ్డి నిష్కలంకమైన నాయకుడిగా పేరు పొందినప్పటికీ, కాంగ్రెస్ అంతర్గత విభేదాలను అదుపు చేయలేకపోయారు.
మూడు ముక్కలాటతో నవ్వులపాలు
టీడీపీ ఆవిర్భావానికి ముందు 1978–1983 మధ్య కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు మర్రి చెన్నారెడ్డి, అంజయ్య, భవనం వెంకట్రామ్, కోట్ల విజయభాస్కరరెడ్డి.. ఇలా నలుగురు ముఖ్యమంత్రులను మార్చింది. 1983లో ప్రజలు కాంగ్రెస్‌కు బదులుగా ఎన్టీఆర్ నాయకత్వంలోని టీడీపీకి పట్టం కట్టడానికి దారితీసిన కారణాల్లో ఇది కూడా ఒకటి. అయినా కాంగ్రెస్ తన పద్ధతిని మార్చుకోలేదు. 1989–1994 మధ్య మరోసారి అదే ‘మూడు ముక్కలాట’ను పునరావృతం చేస్తూ మర్రి చెన్నారెడ్డి, నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డిలను వరసగా మార్చుకుంటూ ఢిల్లీ హైకమాండ్ మార్క్ సంస్కృతిని మరోసారి చూపించింది. దాంతోపాటు సీఎం పదవి కోసం సాగిన అంతర్గత కుమ్ములాటలు కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టను మరింత దిగజార్చాయి.