

ప్రభాత ఉదయం, జగిత్యాల: తల్లిదండ్రుల ఒడిలో పెరగాల్సిన పసికందును మృత్యువు కబళించడంతో ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. తల్లి చున్నీ బైక్ చక్రంలో చిక్కుకోవడంతో జరిగిన ప్రమాదంలో 45 రోజుల పసికందు ప్రాణాలు కోల్పోయింది. రామడుగు మండలం గోపాల్‌రావుపేట గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది. అయితుపల్లి గ్రామానికి చెందిన బొమ్మగోని కిషన్, కవిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తెకు జ్వరం రావడంతో కరీంనగర్‌లోని ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అనంతరం శుక్రవారం బైక్ మీద తిరిగి వస్తున్నారు. మార్గమధ్యలో గోపాల్‌రావుపేట సమీపంలో కవిత చున్నీ బైక్ వెనుక చక్రంలో చిక్కుకోవడంతో తల్లీబిడ్డ ఇద్దరూ కిందపడి గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా తెల్లవారుజామున పసికందు మృతి చెందింది. కళ్ల ముందే కుమార్తె దూరం కావడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.