రాష్ట్ర ప్రగతికి వేదికగా 85వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ : మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

హైదరాబాద్‌లో జరగనున్న 85వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్‌సీ) సదస్సు ఏర్పాట్లపై ఆర్‌ అండ్‌ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సమీక్షించారు. ఈ సదస్సును రాష్ట్ర ప్రగతికి వేదికగా మార్చాలని ఆదేశించారు.
Minister Komatireddy Venkat Reddy reviewing preparations for the 85th Indian Road Congress conference in Hyderabad
హైదరాబాద్‌లో 85వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ సదస్సు ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : ఈ నెల 19 నుంచి 22వ తేదీ వరకు హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం 85వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్‌సీ) సదస్సును ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనుందని ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఈ సదస్సును రాష్ట్ర ప్రగతికి వేదికగా నిర్వహించాలని ఆ శాఖ ఉన్నతాధికారులను ఆదేశించారు. సదస్సు ఏర్పాట్లపై సోమవారం సెక్రటేరియట్​లో ఆర్‌ అండ్‌ బీ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని ఈ సదస్సును ప్రారంభిస్తారని చెప్పారు. పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రాష్ట్రాల రోడ్లు, భవనాల శాఖ మంత్రులు, దేశంలోని వివిధ ప్రాంతాల ప్రతినిధులు, అంతర్జాతీయ డెలిగేట్లు, ఇంజినీరింగ్ నిపుణులు సదస్సుకు హాజరవుతారని పేర్కొన్నారు. ఐఆర్‌సీ వేదికగా రాష్ట్ర రోడ్ నెట్ వర్క్, రైల్వే ప్రాజెక్టులకు సంబంధించిన పలు కీలక ప్రకటనలు ఉంటాయని.. ఇది తెలంగాణ అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలువనుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా, సదస్సుకు హాజరయ్యే అతిథులకు తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సంప్రదాయాలు, కళలు, పర్యాటక ప్రాంతాలను పరిచయం చేసేలా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. హైటెక్స్ ప్రాంగణంలో సుమారు 400 ఎగ్జిబిషన్ స్టాళ్లతో పాటు ప్రత్యేకంగా ‘తెలంగాణ పెవిలియన్’ ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, భారీ మౌలిక వసతుల ప్రాజెక్టులు, పెట్టుబడుల అవకాశాలను ఆ పెవిలియన్‌లో ప్రత్యేకంగా ప్రదర్శించాలని ఆదేశించారు. పర్యాటక శాఖ సమన్వయంతో సదస్సుకు వచ్చే అతిథులు రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలు, చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలను సందర్శించేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ‘ఇన్వెస్ట్ తెలంగాణ’ గ్లోబల్ సమ్మిట్‌కు ఐఆర్‌సీ ప్రీ సమ్మిట్‌గా నిలవాలని మంత్రి ఆకాంక్షించారు.  

డిసెంబర్​లోపే ఆసుపత్రుల పనులు పూర్తిచేయాలి..

అల్వాల్ టిమ్స్, వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణ పనులను వేగవంతం చేసి, ఈ ఏడాదిలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఉస్మానియా జనరల్ ఆసుపత్రి, నిమ్స్ విస్తరణ, కొత్త హైకోర్టు భవన నిర్మాణాలను కూడా త్వరితగతిన పూర్తిచేయాలని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ప్రజలకు మెరుగైన రవాణా, వైద్య సదుపాయాలు కల్పించడమే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, ఇందుకు సంబంధించిన ప్రతి ప్రాజెక్టును అధికారులు ప్రత్యేక శ్రద్ధతో ముందుకు తీసుకెళ్లాలని మంత్రి కోరారు. సమావేశంలో ఆర్‌ అండ్‌ బీ శాఖ కార్యదర్శి ఇలంబర్తి, ప్రత్యేక కార్యదర్శి గంగాధర్, ‘మోర్త్’ రీజినల్ ఆఫీసర్ కృష్ణ ప్రసాద్, ఎన్‌హెచ్‌ఏఐ రీజినల్ ఆఫీసర్ శివశంకర్, ఆర్‌ అండ్‌ బీ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.