

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : కన్నబిడ్డను కంటికిరెప్పలా కాపాడాల్సిన తల్లిదండ్రులే కన్నబంధాలను కాదనుకుంటున్నారు. తల్లిపొత్తిళ్లలో వెచ్చగా నిదురించాల్సిన పసికందులను తల్లులో, తండ్రులో.. వారి బంధువులో నిర్దాక్షిణ్యంగా గిరాటేస్తున్నారు. పురిటి వాసన కూడా పోని పసికందులను ముళ్లపొదలు, పత్తి చేలు, రైల్వే ట్రాక్‌లు, బస్టాండ్లు, రహదారుల పక్కన వదిలేస్తున్న హృదయవిదారక ఘటనలు రాష్ట్రంలో ఇటీవల విరివిగా వెలుగు చూస్తున్నాయి. ముఖ్యంగా ఆడ శిశువులనే వదిలేస్తున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో స్థానికులు, రైతులు, ప్రయాణికులు సమయానికి స్పందించి.. చిన్నారుల ప్రాణాలను కాపాడుతుండగా, మరికొన్ని ఘటనల్లో సకాలంలో వైద్యం అందక.. పుట్టిన కొద్దిగంటల్లోనే ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. మానవత్వానికి సవాలుగా నిలుస్తున్న ఈ దారుణ అంశాలు మహిళా శిశు సంక్షేమ శాఖ, చైల్డ్ హెల్ప్‌లైన్ నివేదికల్లో వెల్లడయ్యాయి.
ఆడపిల్ల పుట్టిందనే వివక్షే కారణమా?
ఆడ శిశువులను వదిలివేస్తున్న ఘటనలే అధికంగా నమోదవుతున్నాయి. ఈ ఘటనలు సమాజంలో ఇంకా కొనసాగుతున్న లింగ వివక్షను ప్రశ్నిస్తున్నాయి. ఆడపిల్ల పుట్టిందనే అసహనం, కుటుంబ ఒత్తిళ్లు, సామాజిక భయాలు, ఆర్థిక ఇబ్బందుల్లాంటి అంశాలు కొన్ని ఘటనలకు కారణమై ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అవాంఛిత గర్భధారణ, కుటుంబ సమస్యలు లేదా ఇతర కారణాలతో శిశువును పెంచలేని పరిస్థితుల్లో నిర్మానుష్య ప్రాంతాల్లో వదిలేస్తున్నారని పోలీసుల దర్యాప్తుల్లో వెల్లడవుతున్నది. ఇలాంటి ఘటనల్లో కొందరు స్థానికులు మానవత్వాన్ని చాటుతున్నారు. శిశువుల ఏడుపు విని వెంటనే పోలీసులకు, వైద్య సిబ్బందికి సమాచారం అందిస్తున్నారు. పోలీసులు, శిశు సంక్షేమ అధికారులు చిన్నారులను ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.
నెలకు 10 ఘటనలు
పురిటి బిడ్డలను (శిశువులను) వదిలేసే ఘటనలు హైదరాబాద్, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో నెలకు సగటున 10 వరకూ నమోదవుతున్నాయని మహిళా శిశు సంక్షేమ శాఖ, చైల్డ్ హెల్ప్‌లైన్ నివేదికలు పేర్కొంటున్నాయి. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రులు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్ల పరిసరాల్లో ఇటువంటి ఘటనలు అత్యధికంగా వెలుగుచూస్తున్నాయి. వదిలేసిన పిల్లలలో దాదాపు 70% నుంచి 80% వరకు ఆడశిశువులే ఉంటున్నట్టు ఐసీడీఎస్ నివేదికలు వెల్లడిస్తున్నాయి.
మచ్చుకు కొన్ని అమానవీయాలు..
నవబర్ 5న కామారెడ్డి జిల్లా దోమకొండ ప్రాంత శివారు వేల్పుగొండ వద్ద ముళ్లపొదల్లో ఉన్న చిన్నారిని స్థానికులు గుర్తించారు. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు.
జూలైలో శంషాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ఎయిర్పోర్ట్ కాలనీలో తెల్లటి సంచిలో అప్పడే పుట్టిన ఆడ శిశువును వదిలి వెళ్లారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ఆ చిన్నారిని శిశువిహార్‌కు తరలించారు.
మే నెలలో నిజామాబాద్ జిల్లా నందిపేట మండల కేంద్రం రాజ్‌నగర్ దుబ్బా ప్రాంతంలోని బహిరంగ ప్రదేశంలో చిన్నారిని వదిలి వెళ్లారు. క్రికెట్ అడుతున్న పిల్లలకు శిశువు ఏడుపు వినిపించడంతో స్థానికులకు సమాచారం ఇచ్చారు. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ శిశువు మరణించింది.
ఏప్రిల్‌లో రాజన్న సిరిసిల్ల జిల్లా కొత్త బస్టాండ్ మరుగుదొడ్డిలో ఆడ శిశువును వదిలేశారు. చిన్నారి ఏడుపు విన్న ప్రయాణికులు చిన్నారిని పోలీసులకు అప్పగించారు.
మార్చిలో కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్‌నగర్ మండలం సీతానగర్ సమీపంలో ఒక రోజు వయసున్న ఆడ శిశువును వదిలేశారు. చిన్నారి ఏడుపు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.