పర్సంటేజీల పరేషాన్!

STO Office
ACB raids at Achampet STO office over demand for bribes to sanction bills
Published on: 

- ఎస్టీవోలో వసూళ్ల పర్వం

- స్లాబ్‌ల వారీగా డిమాండ్

- ఏసీబీ రైడ్‌తో భారీగా చర్చ

ప్రభాత ఉదయం, అచ్చంపేట: అచ్చంపేట సబ్‌ ట్రెజరీ ఆఫీస్(ఎస్టీవో)లో ఇటీవల ఏసీబీ తనిఖీలు జరిగిన నేపథ్యంలో కార్యాలయంలో బిల్లుల మంజూరు వ్యవహారంపై ఉద్యోగులు, పెన్షనర్లలో తీవ్ర చర్చ కొనసాగుతోంది. బిల్లులు మంజూరు కావాలంటే పర్సంటేజీ చెల్లించాల్సిందేనని, డబ్బులు ఇవ్వకపోతే ఫైళ్లలో కొర్రీలు పెట్టడం, వెనక్కి పంపడం, మంజూరులో జాప్యం చేస్తున్నారని పలువురు ఉద్యోగులు ఆరోపిస్తున్నారు.

 ప్రతి బిల్లుకు ఓ రేటు!

మెడికల్ బిల్లులు, జీపీఎఫ్, సరెండర్ లీవ్స్ సంబంధిత బిల్లులు, పెన్షనర్ల బిల్లులు, వసతి గృహాలు, ఉద్యోగుల రిటైర్‌మెంట్ బిల్లులు, ఆఫీసు బిల్లులు, ఇతర ప్రభుత్వ బిల్లుల మంజూరులో డబ్బులు చెల్లించాల్సి వస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రతి బిల్లుకు 2 శాతం నుంచి 5 శాతం వరకు, ఉద్యోగుల రిటైర్‌మెంట్ బిల్లుల విషయంలో 3 నుంచి 5 శాతం వరకు వసూళ్లు చేస్తున్నారనే ఆరోపణలు ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బిల్లుల రకాన్ని బట్టి స్లాబ్‌లు నిర్ణయించి వసూళ్లు చేస్తున్నారని సమాచారం.

 వాటాల వారీగా కేటాయింపులు

అచ్చంపేట, ఉప్పునుంతల, బల్మూర్, లింగాల, పదర, అమ్రాబాద్ మండలాలకు చెందిన ప్రభుత్వ శాఖలకు సంబంధించిన బిల్లులు అచ్చంపేట ఎస్టీవో కార్యాలయం ద్వారా మంజూరు కావాల్సి ఉంటుంది. కార్యాలయం అధికారులు బిల్లు కోసం వచ్చే ఉద్యోగులు, పెన్షనర్ల అందరి నుంచి వసూలు చేసిన డబ్బులు ఎవరి వాటా వారు తీసుకొని సాయంత్రం ఇంటికి వెళ్తారని, వారి ఆస్తులు, ఇతర అంశాలపై విచారణ జరిపించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. పెన్షనర్ల ఫైల్ చూసే సీనియర్ అకౌంటెంట్ పెన్షనర్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ, పంచాయతీరాజ్ శాఖ బిల్లులు చూసే ఓ మహిళా అధికారికి వసూళ్లలో కింగ్ మేకర్ అనే బిరుదు కూడా ఇవ్వొచ్చనే చర్చ ప్రస్తుతం కొనసాగుతోంది.

 అవినీతికి అడ్డుకట్ట పడుతుందా?

ఎస్టీవో కార్యాలయంలో పెరిగిన లంచాల వ్యవహారంతో ఉద్యోగులు విసుగు చెంది ఏమీ చేయలేక చివరకు ఏసీబీని ఆశ్రయించాల్సి వస్తుందని చెబుతున్నారు. ఇటీవలే నిర్వహించిన ఏసీబీ సోదాలపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరో వసూళ్ల కింగ్ మేకర్ అధికారి ఏసీబీకి పట్టుబడితే బాగుండే అనే చర్చ జోరుగా కొనసాగుతోంది. ఇప్పటివరకు బిల్లుల కోసం ఇబ్బందులు ఎదుర్కొన్న ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యలను అధికారులు పరిశీలించి బిల్లుల మంజూరు ప్రక్రియను పూర్తిగా పారదర్శకంగా నిర్వహించాలని కోరుతున్నారు. ఎస్టీవో కార్యాలయంలో బిల్లుల మంజూరు పేరుతో జరుగుతున్న అవినీతిపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరిపించాలని ఉద్యోగులు, పెన్షనర్లు డిమాండ్ చేస్తున్నారు. బిల్లుల పరిశీలన నుంచి మంజూరు వరకు ప్రతి దశను పారదర్శకంగా నిర్వహించి అక్రమాలకు తావులేకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.