నిర్వహణ లోపాలు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణం : రిమ్స్ ఘటనపై నివేదిక

ఆదిలాబాద్ రిమ్స్ఆ సుపత్రిలోని ఎన్‌ఎస్‌సీయూలో ఏసీ పేలిపోయి దట్టమైన పొగలు అలుముకోవడంతో ఐదుగురు పసికందులు మృతి చెందిన విషాదకర ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన విచారణ కమిటీ తన నివేదికను సమర్పించింది.
RIMS Fire Accident Case
Adilabad RIMS Hospital Fire Incident Report
Published on: 

ప్రభాత ఉదయం, ఆదిలాబాద్ ప్రతినిధి: ఆదిలాబాద్​ రిమ్స్​ హాస్పిటల్​లో జరిగిన ప్రమాద ఘటనపై విచారణ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. సెప్టెంబర్​ 21న జరిగిన ప్రమాదంలో ఐదుగురు పసికందులు చనిపోయిన విషయం తెలిసిందే. దీనిపై ఆరుగురు సభ్యుల ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఐటీడీఏ పీవో మంద మకరందు నేతృత్వంలో ఫైర్​, ట్రాన్స్​కో, టీఎజీ ఎండీసీ, హెల్త్​ ఆఫీసర్లు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ ఘటన జరిగిన తీరు, ఎస్‌ఎన్‌సీయూ రూమ్​ పరిస్థితి, సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణ చేసి 50 పేజీల నివేదికను ప్రభుత్వానికి అందించింది. ఈ ప్రమాదానికి నిర్వహణ లోపం, సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని కమిటీ తేల్చింది.

కమిటీ నివేదికలో కీలక విషయాలు

ఆరుగురు సభ్యుల ఉన్నత స్థాయి కమిటీ అన్ని కోణాల్లో విచారణ చేపట్టింది. ఘటన జరిగిన తీరు, నవజాత శిశువుల ప్రత్యేక సంరక్షణ విభాగం (ఎన్‌ఎస్‌సీయూ) రూమ్​ నిర్వహణ, విద్యుత్ సరఫరా, సిబ్బంది పనితీరు.. తదితర విషయాలపై లోతుగా విచారణ చేపట్టింది. ప్రత్యేకంగా నిపుణులను రప్పించి ప్రమాద తీరుతెన్నులను విశ్లేషించింది. అత్యంత అప్రమత్తంగా, భద్రంగా ఉండాల్సిన ఎన్‌ఎస్‌సీయూలో ఏసీల నిర్వహణను పట్టించుకోకపోవడం, ఏసీ వైర్లను ఎలుకలు కొరికినా సిబ్బంది గుర్తించలేదని విచారణలో బయటపడింది. ఈ విషయంలో హాస్పిటల్​ అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించినట్లు తేలింది.  కాగా రిమ్స్ ఘటనపై ప్రభుత్వానికి నివేదిక వెళ్లడంతో బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకుంటుందోనన్న చర్చ సాగుతోంది.

 ఘటన జరిగిందిలా..

రిమ్స్‌లో అప్పుడే పుట్టిన పిల్లలు ఎస్ఎన్‌సీయూ వార్డులో చికిత్స పొందుతున్నారు. సెప్టెంబర్ 21న అర్ధరాత్రి సమయంలో ఏసీ పేలిపోవడంతో ఒక్కసారిగా దట్టమైన పొగలు అలుముకొని మంటలు చెలరేగాయి. ప్రమాద సమయంలో ఎస్‌ఎన్‌సీయూలో 27 మంది శిశువులు ఉన్నారు. విధుల్లో ఉన్న సిబ్బంది, డాక్టర్లు, ఫైర్, పోలీస్ సిబ్బంది శిశువులను బయటకు తీసుకువచ్చారు. చికిత్స పొందుతూ ఐదుగురు చనిపోయారు.