

ప్రభాత ఉదయం, ఆదిలాబాద్:
జిల్లాలోని తలమడుగు మండలం కొత్తూరు గ్రామానికి చెందిన రైతు 18 ఎకరాల్లో సోయా పంట వేయగా, అందులో 4 ఎకరాల వరకు మొలకలు వచ్చాయి. చాలామంది రైతులు ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. ఎల్‌నినో ప్రభావాన్ని తట్టుకొని పండించిన పంటకు చివరి దశలో మొలకలు రావడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కేవలం ఒకే రకం కంపెనీకి చెందిన విత్తనాలు వేసిన రైతులకు మాత్రమే ఈ సమస్య ఎదురవుతోందని వారు పేర్కొంటున్నారు. ఇటీవల పలు గ్రామాల రైతులు జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఈ సమస్యపై వ్యవసాయ శాఖ అధికారులు శాస్త్రవేత్తలతో పరిశీలన చేయిస్తున్నారు. బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సైతం పలు గ్రామాలను సందర్శించి రైతులతో మాట్లాడారు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
పత్తికి బదులు సోయా పంట
ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావం ఉంటుందనే ముందస్తు హెచ్చరికతో అనేక మంది రైతులు పత్తికి బదులు సోయా పంట వైపు మొగ్గు చూపారు. జిల్లాలో సుమారు 60 వేల ఎకరాల్లో సోయా పంట వేశారు. మరో పక్షం రోజుల్లో పంట కోతకు రానున్నది. ఈ దశలో మొలకలు రావడంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. తలమడుగు మండలం రుయ్యాడి, తలమడుగు, కొత్తూరు, కజ్జర్ల తదితర గ్రామాల్లో ఈ సమస్య ఎదురవుతున్నది. పలు గ్రామాల్లో పండించిన పంటలో సుమారు 80 శాతం వరకు జర్మినేషన్ సమస్య ఏర్పడిందని పలువురు రైతులు వాపోతున్నారు. పంటను మార్కెట్‌కు తరలించకముందే ఇలా నష్టం వాటిళ్లడంతో దిగుబడి కష్టమేనని వారు ఆవేదన చెందుతున్నారు.
80 శాతం పంటకు మొలకలు వచ్చాయి: అఖిల్ (రైతు, తలమడుగు)
ఈ ఏడాది ఆరు ఎకరాల్లో సోయా పంట వేశా. కోతకు వచ్చిన దశలో ఏకంగా 80 శాతం వరకు పంటకు మొలకలు వచ్చాయి. కేవలం 20 శాతం మాత్రమే పంట దిగుబడి వచ్చేలా ఉంది. అధికారులు ఈ సమస్యను పరిగణనలోకి తీసుకొని మమ్మల్ని ఆదుకోవాలి.
శాస్త్రవేత్తలు పరిశీలన చేస్తున్నారు: రవీందర్ సింగ్ (జిల్లా వ్యవసాయ శాఖ అధికారి)
జిల్లాలోని పలు గ్రామాల్లో సోయా పంటకు మొలకలు వచ్చాయనే విషయం మా దృష్టికి వచ్చింది. వ్యవసాయ శాస్త్రవేత్తలతో ఈ సమస్యపై గ్రామాల్లో పరిశీలన చేయించాం. వారు అందజేసే నివేదికను బట్టి తదుపరి చర్యలు తీసుకుంటాం.