

ప్రభాత ఉదయం, జగిత్యాల : కొండగట్టులో అరుదైన ఆధ్యాత్మిక ఘట్టం ఆవిష్కృతం కానుంది. సుమారు 60 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఆలయంలో శ్రీ హనుమాన్ చందనోత్సవ మహోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. నవంబర్ 15 నుంచి 20 వరకు చందనోత్సవం, మహా సంప్రోక్షణ కార్యక్రమాలు జరగనుండగా, నవంబర్ 20 నుంచి డిసెంబర్ 29 వరకు 40 రోజుల పాటు స్వామివారి నిజరూప దర్శనానికి భక్తులకు అవకాశం కల్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని శనివారం జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆదేశించారు.
నిజరూప దర్శనానికి రోజుకు సుమారు 50 వేల మంది భక్తులు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ముఖ్యంగా ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్, ఆర్టీసీ ప్రత్యేక బస్సుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. భక్తులకు తాగునీరు, చలువ పందిళ్లు, తాత్కాలిక మరుగుదొడ్లు, వైద్య శిబిరాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. నిరంతర విద్యుత్ సరఫరాతో పాటు పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.