

ప్రభాత ఉదయం, పటాన్చెరు : అమీన్పూర్లోని సొసైటీ భూములపై వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. బీరంగూడ మల్లికార్జున నగర్లో ఇండస్ట్రియల్ ఎంప్లాయీస్ కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీకి చెందిన భూములను కొందరు ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఫిర్యాదులపై సంగారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ స్పందించారు. బాధితులు పలుమార్లు ప్రజావాణిలో ఫిర్యాదు చేయడంతో ఆయన క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించారు.
సర్వే నంబర్లు 969, 970, 989 నుంచి 1014, 1016, 1018 నుంచి 1020, 1029, 1030, 1033, 1034, 1036 నుంచి 1064, 1110 నుంచి 1118 పరిధిలోని భూముల హద్దులను నిర్ధారించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. భూములపై సమగ్ర విచారణ జరిపి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
ఈ ప్రాంతంలో సుమారు 90 నుంచి 92 ఎకరాల పట్టా భూములు ఉన్నాయని, వాటిని కొందరు ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. భూములకు సమగ్ర సర్వే నిర్వహించి, సరిహద్దులను ఖరారు చేసి రక్షణ కల్పించాలని కోరుతున్నారు. ఏళ్లుగా ఫిర్యాదులు చేస్తున్నా క్షేత్రస్థాయి రెవెన్యూ అధికారులు ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తున్నారు.
2014లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకుని వివాదాన్ని పరిష్కరించాలని, కబ్జా ప్రయత్నాలపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు విజ్ఞప్తి చేస్తున్నారు. కలెక్టర్ పర్యటనతోనైనా తమ భూములకు రక్షణ లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.