

ప్రభాత ఉదయం, హైదరాబాద్:
ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్ఎస్) చేస్తారనే ప్రచారం తెలంగాణ బ్యూరోక్రసీలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన వీఆర్ఎస్ ఆలోచన వెనుక చాలా అంశాలే దాగి ఉన్నాయన్న చర్చ సాగుతున్నది. జయేశ్ ప్రభుత్వ అనుమతి లేకుండానే 176 సార్లు విదేశీ పర్యటనలు చేసిన విషయం కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) గమనంలో ఉన్నట్టు విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. అది కూడా కొచ్చి విమానాశ్రయం నుంచే అత్యధిక సందర్భాల్లో విదేశాలకు వెళ్లిన సమాచారం కూడా సీవీసీ దగ్గర ఉందని తెలుస్తున్నది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని సీవీసీ అప్రమత్తం చేసిందని అంటున్నారు. సీవీసీ అలర్ట్ చేయడంతోనే సీఎం రేవంత్ రెడ్డి ఆయనను ప్రధాన కార్యదర్శి పదవికి దూరం పెట్టారని చెబుతున్నారు. సీఎంతో సంబంధం లేకుండా భూ మార్పిడి ఫైళ్లను స్పీడ్‌గా ఆమోదించారని సీఎంవోలోని ఓ అధికారి గుర్తించారు. గంపగుత్తగా ఎలా ఆమోదం తెలిపారని ఆయన ఆరా తీయగా.. ‘జూనియర్ ఆఫీసర్‌గా నీ పరిధి తెలుసుకో’ అంటూ హుంకరించినట్లు హై సర్కిల్లో చర్చ జరుగుతోంది. అయితే జూనియర్ అధికారి తనను ప్రశ్నించినా, సీఎం, సీఎస్ జోక్యం చేసుకోకపోవడంతో జయేశ్ ఇబ్బంది పడ్డారని సమాచారం. దానికి తోడు తాను చేసిన తప్పులు ఎప్పటికైనా తన మెడకు చుట్టుకుంటాయని, విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని ముందుగానే పసిగట్టిన జయేశ్ రంజన్ వీఆర్ఎస్ అస్త్రాన్ని బయటకు తీశారని బ్యూరోక్రసీలో చర్చ జరుగుతోంది.
మలుపులు తిరుగుతున్న వ్యవహారం..
1992 బ్యాచ్‌కు చెందిన జయేశ్ రంజన్ వ్యవహారం మూడు రోజులుగా అనేక మలుపులు తిరుగుతోంది. కాంగ్రెస్ సర్కారు సీనియర్ ఐఏఎస్‌ను అవమానిస్తోందని బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారు. ఎంతగానో ఆశలు పెట్టుకున్న ప్రధాన కార్యదర్శి పదవి దక్కకపోవడం, మున్సిపల్ శాఖలో అంతగా పని లేకపోవడం వంటి పరిణమాలతో వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నారనే వార్తలు వస్తున్నాయి. ఐటీ కంపెనీలో పెద్ద పదవి లభించడంతో ప్రభుత్వ సర్వీస్‌కు గుడ్ బై చెబుతున్నారనే ప్రచారం కూడా తెరపైకి వచ్చింది. ఈ ప్రచారాన్ని పక్కనపెడితే అసలు విషయం వేరే ఉందని తెలంగాణ సచివాలయం హై సర్కిల్స్‌లో చర్చించుకుంటున్నారు. గత 13 ఏళ్లుగా జయేశ్ రంజన్ ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తూ వస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ శాఖలను పర్యవేక్షించారు. అప్పటి మంత్రి కేటీఆర్‌తో కలిసి వ్యవహారాలను చక్కబెట్టారు. ఈ మూడు శాఖలను కంటి చూపుతో శాసించారని అంటుంటారు. ఆయన అనుమతి లేకుండా కేటీఆర్ వద్ద కీలకమైన ప్రాజెక్టులకు అనుమతులు లభించేవి కాదనేది జగమెరిగిన సత్యం. పెట్టుబడుల పేరుతో విదేశాలకు చుట్టి వచ్చిన తరువాత ఒక సందర్భంలో సీఎం క్యాంప్ ఆఫీస్‌లో కేసీఆర్‌ను కలిశారు. విదేశాల నుంచి పలువురు తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నారని కేసీఆర్‌కు చెప్పగా, ‘మీరు వెళ్లేది పెట్టుబడుల కోసం కాదు. మరో పని కోసం వెళ్తున్నారు’.. అంటూ చురకలు అంటించారనే ప్రచారం జరిగింది. కేటీఆర్, జయేశ్ రంజన్ విదేశీ పర్యటనలపై కేసీఆర్‌కు కేటీఆర్ భార్య శైలిమ ఫిర్యాదు చేసినట్లు బీఆర్ఎస్ ముఖ్య నాయకులు సైతం చర్చించుకున్నారు. కేటీఆర్ ఒత్తిడితోనే పరిశ్రమలు, పెట్టుబడులు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా కొనసాగించారని బీఆర్ఎస్ వర్గాలే ధృవీకరించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక సీఎం రేవంత్ రెడ్డి సైతం జయేశ్ రంజన్‌కు ప్రాధాన్యం ఇచ్చారు. ఆయన తనవద్దే పెట్టుకొని మెట్రో పాలిటన్ ఏరియా అండ్ అర్బన్ డెవలప్మెంట్ శాఖ అప్పగించారు.
గుట్టుచప్పుడు కాకుండా విదేశాలకు..
ఏ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ పర్యటించని విధంగా జయేశ్ రంజన్ 176 సార్లు విదేశాలు చుట్టి వచ్చారని అంటున్నారు. సాధారణంగా సర్వీస్ అధికారులు విదేశీ పర్యటనలకు వెళ్లే ముందు తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వానికి సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. హైదరాబాద్ నుంచి నేరుగా విదేశాలకు వెళ్లేందుకు అంతర్జాతీయ విమాన సర్వీసులు ఉన్నాయి. సీట్లు దొరకక పోతే ఢిల్లీ నుంచి వెళ్లవచ్చు. అయితే జయేశ్ మాత్రం ఎవరికీ అనుమానం రాకుండా కేరళం రాష్ట్రం కొచ్చిన్ నుంచి విదేశాలకు వెళ్లి వచ్చారని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ అనుమతి కూడా లేకుండానే ఏ ధైర్యంతో ఇలా చేశారనేది ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. ఈ విదేశీ పర్యటనల వ్యవహారం కేంద్ర విజిలెన్స్ కమిషన్ దృష్టికి వెళ్లగా, రంగంలోకి దిగిన సీవీసీ... కొచ్చిన్ విమానాశ్రయం నుంచి సీసీటీవీ పుటేజీలు తెప్పించి పరిశీలించిందని సమాచారం. కొచ్చిన్ నుంచి దుబాయ్, లండన్ నగరాలకు జయేశ్ వెళ్లినట్లు వెల్లడైంది. సీవీసీ అధికారులు వెంటనే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని అప్రమత్తం చేశారు. ఈ పర్యటనలకు అనుమతులు ఇచ్చారా? అనుమతులు ఇస్తే వివరాలు తెలియచేయాలని కోరారు. దీంతో జయేశ్ రంజన్.. జనరల్ విమానాల్లో ప్రయాణించారా? లేదంటే చార్టర్ ఫ్లైట్‌లో వెళ్లారా? అనేది తెలుసుకునే పనిలో రాష్ట్ర అధికారులు ఉన్నారు.
ప్రభుత్వాన్ని బద్నాం చేసేలా ప్రచారం
కొద్ది రోజుల కింద సీఎం రేవంత్ రెడ్డిని భూ మార్పిడి ఫైళ్ల వ్యవహారంలో సీఎంవో అధికారి ఒకరు అప్రమత్తం చేశారు. ‘మీ అనుమతి లేకుండానే భూ మార్పిడి ఫైళ్లకు అనుమతులు ఇచ్చారని, ఇందులో ఏదో మతలబు ఉంది.’ అని తెలిపారు. ఇదే విషయాన్ని సదరు అధికారి జయేశ్ వద్ద ప్రస్తావించగా, సర్వీసులో జూనియర్వి నన్నే ప్రశ్నిస్తావా? అని సీరియస్ అయ్యారు. అయితే సీవీసీ విదేశీ పర్యటనలపై ఆరా తీయడం, భూ మార్పిడి ఫైళ్ల క్లియరెన్స్‌పై విచారణ చేపట్టే అవకాశం ఉండడంతో జయేశ్ రంజన్ తన వ్యూహానికి పదును పెట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వకపోవడంతోనే వీఆర్ఎస్ తీసుకుంటున్నట్లు ప్రచారం ప్రారంభించారని అంటున్నారు. వీఆర్ఎస్ తీసుకున్నాక సీవీసీ విచారణకు ప్రాధాన్యం ఉండదనే ముందు చూపుతో స్వచ్ఛంద పదవీ విరమణ డ్రామా మొదలుపెట్టారని చెబుతున్నారు.