రూ.250 కోట్ల లాటరీ.. ఐనా కిక్ లేదుర భయ్!

అమ్మకు బంగారు నగలు… నాన్నకు వ్యవసాయ భూమి… అన్నదమ్ములకు కార్లు... అయినా అదే ఇల్లు!! ఇంత డబ్బొచ్చినా కుటుంబమే తన ప్రపంచమంటున్న ఎన్నారై..
Anilkumar Bolla
Anilkumar Bolla UAE Lottery Winner
Published on: 

ఒక్కసారిగా వందల కోట్ల రూపాయలు చేతికొస్తే ఎవరైనా ఏం చేస్తరు? ఖరీదైన కార్లు కొనుక్కుంటరు.. కళ్లు చెదిరే బంగ్లాల్లోకి మారిపోతరు.. ప్రపంచమంతా చుట్టొస్తరు! కానీ, తెలంగాణకు చెందిన ఓ పోరడు మాత్రం తనకు వచ్చిన డబ్బుతో ముందు తనోళ్ల సంతోషం గురించే ఆలోచించిండు. అమ్మకు బంగారు నగలు కొనిచ్చిండు. నాన్నకు వ్యవసాయ భూమి కొనిచ్చిండు. తనకు, తన సోదరుడికి కార్లు కొనుక్కున్నడు. ఇన్ని చేసినా, తన కుటుంబం ఉంటున్న పాత ఇంటిని మాత్రం వదల్లేదు!

అబుదాబిలో ఉంటున్న ఈ 29 ఏళ్ల టెక్నీషియన్ కి యూఏఈ లాటరీలో ఏకంగా 100 మిలియన్‌ దిర్హామ్‌లు.. అంటే సుమారు రూ.250 కోట్ల రూపాయల జాక్‌పాట్‌ తగిలింది. 2025 అక్టోబర్‌లో అదృష్టం తలుపు తట్టడంతో ఆయన జీవితం ఒక్కసారిగా మారిపోయింది. అయితే, డబ్బు వచ్చిందని పొంగిపోలేదు..  మూలాలను మర్చిపోలేదు... తన కుటుంబానికే పెద్దపీట వేస్తున్నారు.

ఏడాదిలో జీవితం మొత్తం మారిపోయింది!

లాటరీ గెలిచి ఏడాది గడిచిపోయింది. ఈ ఏడాది తన జీవితంలో వచ్చిన, నచ్చిన అతిపెద్ద మార్పు ఏంటని అడిగితే, కుటుంబంతో ఎక్కువ సమయం గడపగలుగుతున్నానని అంటారు అనిల్‌కుమార్‌.

నిజమే కదా! డబ్బు సంపాదించే హడావుడిలో పడి కుటుంబంతో నాలుగు మాటలు మాట్లాడటానికే తీరిక లేకుండా పోతున్న రోజులివి. అలాంటిది, ఇప్పుడు తనకు నచ్చినట్టు కుటుంబంతో గడిపే అవకాశం అనిల్‌కుమార్‌కు దొరికింది.

గడిచిన ఏడాది తన జీవితాన్నే కాదు, తన ఆశయాల గురించి కూడా కొత్తగా ఆలోచించుకునేలా చేసిందని చెప్పారు. డబ్బు వల్ల స్వేచ్ఛ పెరిగింది. కొనాలనుకున్న వస్తువులన్నీ కొనుక్కోగలుగుతున్నాడు. ఐఫోన్‌ 17 ఎయిర్‌ ఫోన్‌తో పాటు నాలుగైదు ఖరీదైన వాచీలు కూడా కొనుగోలు చేసిండు. ఇవన్నీ ఒక ఎత్తయితే.. తన కుటుంబం కోసం చేసిన పనులు మరో ఎత్తు.

అమ్మకు నగలు.. నాన్నకు నేల!

డబ్బుతో విలాసాలు కొనుక్కోవచ్చు. కానీ, తల్లిదండ్రుల కలలు నెరవేర్చినప్పుడు వాళ్ల ముఖాల్లో కనిపించే వెలుగు మాత్రం వేరే. లాటరీ గెలిచిన తర్వాత ఆయన చేసిన మొదటి పని.. తన తల్లికి బంగారు ఆభరణాలు కొనడం.  “మా అమ్మకు నగలు ఉండాలనేది నా కల. అందుకే ఆమె కోసం అవన్నీ కొనిచ్చాను” అని అనిల్ వివరించారు.

కొడుకు ఇచ్చిన కానుక చూసి తల్లి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకున్నారట. ఇక తండ్రికి వ్యవసాయమంటే ప్రాణం. ముఖ్యంగా సేంద్రీయ వ్యవసాయం చేయాలనేది ఆయన అభిరుచి. అందుకే తండ్రికి కొంత వ్యవసాయ భూమిని కొనిచ్చారు.

రూ.250 కోట్లొచ్చినా.. అదే పాత ఇల్లు!

అనిల్ కథలో అందరినీ ఆకట్టుకునే విషయం ఏమిటంటే వందల కోట్ల రూపాయలు వచ్చిన తర్వాత కూడా ఆయన కుటుంబం లాటరీ గెలవకముందు ఎక్కడైతే నివసించేవారో, అక్కడే ఉంటున్నారు. తెలంగాణలోని రైతు కుటుంబం నుంచి వచ్చిన అనిల్‌కుమార్‌కు ఆ ఇల్లు కేవలం నాలుగు గోడలు కాదు. అది తన తండ్రి కలల మేడ. అందుకే అంత డబ్బు వచ్చినా ఆ ఇంటిని వదిలి మరోచోటికి మారాలనే ఆలోచనే రాలేదు.

కిక్ తగ్గిందట!

లాటరీ గెలిచిన అనిల్‌కుమార్‌ తన కుటుంబంతో కలిసి బాలీ, థాయిలాండ్‌, ఆమ్‌స్టర్‌డామ్‌ లాంటి ప్రాంతాలను సందర్శించి కొత్త అనుభవాలను ఆస్వాదించిండు. మొదట్లో ప్రయాణాలంటే తెగ ఉత్సాహం చూపించిన ఆయనకు, ఇప్పుడు ఆ ఉత్సాహం కొంత తగ్గిందట.

“ఎందుకో తెలియదు కానీ, ఆ ఉత్సాహం క్రమంగా తగ్గిపోయింది. అయినా, నాకు లభిస్తున్నఅవకాశాలు, నేను చేస్తున్న పనుల పట్ల ఎంతో కృతజ్ఞతతో ఉన్నాను” అని ఆయన అంటారు.

‘అన్నీ ఉన్నా ఏదో వెలితి’ అనిపించే సందర్భాలు కూడా జీవితంలో ఉంటాయి. అందుకే సంతోషం అంటే కేవలం ఖరీదైన వస్తువులు, విదేశీ ప్రయాణాలు మాత్రమే కాదు. మనసుకు నచ్చిన పని చేయడం, మనవాళ్లతో గడపడం, జీవితంలో ఓ లక్ష్యం ఉండటం, అంతే.. అంటారాయన.

ఇప్పుడేం చేస్తున్నారు?

తన కోరికల్లో చాలావరకు నెరవేర్చుకున్న అనిల్‌కుమార్‌ ఇప్పుడు దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలపై దృష్టి పెట్టారు. డబ్బును ఎలా పెంచుకోవాలి? భవిష్యత్తులో ఆర్థికంగా మరింత స్థిరంగా ఎలా ఉండాలి? అనే అంశాలపై ఆలోచిస్తున్నారు. ఇందులో భాగంగా కొత్త వ్యాపార అవకాశాలను అన్వేషిస్తున్నారు. అబుదాబి విమానాశ్రయం సమీపంలో, దుబాయ్‌ మెరీనాలో ఆస్తులను కొనుగోలు చేశారు.

ఒక్కసారిగా భారీ మొత్తం చేతికి వచ్చినప్పుడు దాన్ని ఎలా ఉపయోగించుకోవాలనేది చాలా ముఖ్యం. వచ్చిన డబ్బంతా ఖర్చు చేసేస్తే, ఎంత పెద్ద మొత్తమైనా ఎంతోకాలం నిలవకపోవచ్చు. అనిల్‌కుమార్‌ కూడా ఇప్పుడు ఇదే దిశగా అడుగులు వేస్తున్నాడు. నచ్చినవి కొనుక్కోవడంతో పాటు, రాబోయే రోజుల్లో తన ఆర్థిక భద్రతకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవడంపై దృష్టి పెడుతున్నారు.

లాటరీ గెలిచినోళ్లకు సలహా!

ఇంత పెద్ద మొత్తాన్ని గెలుచుకున్న తర్వాత ఇతర లాటరీ విజేతలకు ఏదైనా సలహా ఇస్తారా అని అడిగితే అనిల్‌కుమార్‌ చెప్పిన మాటలు ఆలోచింపజేస్తాయి.

“కోటీశ్వరుల క్లబ్‌లోకి స్వాగతం! వినయంగా ఉండండి. మీ డబ్బును బాధ్యతాయుతంగా నిర్వహించండి. క్రమశిక్షణతో, తెలివిగా ఖర్చు చేయండి” అని ఆయన సూచించారు.

అనిల్‌కుమార్‌ కథలో డబ్బుంది.. అదృష్టం ఉంది.. విలాసవంతమైన జీవితం ఉంది. కానీ, అన్నింటికంటే ఎక్కువగా కనిపించేది కుటుంబంపై ఆయనకు ఉన్న ప్రేమ.

‘డబ్బుంటే దునియా కనిపిస్తది.. కానీ, మనసుంటేనే మనుషులు కనిపిస్తరు!’ - అనిల్‌కుమార్‌ బొల్లా కథలోని ముచ్చట అదే!