‘నిన్ను ఇక్కడే బొందపెడతా!’.. దామోదర రాజనర్సింహ వర్సెస్‌ జుక్కల్‌ ఎమ్మెల్యే

ఢిల్లీలోని షాంగ్రిలా హోటల్‌లో మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్‌ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. మంత్రి తనను బూతులు తిట్టిన మాట వాస్తవమేనని ఎమ్మెల్యే ధ్రువీకరించారు.
Minister Damodar Rajanarasimha and Jukkal MLA Thota Lakshmikant Rao
మంత్రి దామోదర రాజనర్సింహ, జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు
Published on: 

ప్రభాత ఉదయం, కామారెడ్డి : కాంగ్రెస్ ముఖ్యనేతల మధ్య అంతర్గత విభేదాలు మరోసారి రచ్చకెక్కాయి. డీసీసీ అధ్యక్షుల నియామక వ్యవహారంలో ఏకంగా ఢిల్లీలోని ఓ హోటల్​లో మంత్రి, ఎంఎల్​ఏ మధ్య చోటుచేసుకున్న ఘర్షణ రాష్ట్ర రాజకీయవర్గాల్లో కలకలం రేపింది. ఆదివారం ఢిల్లీలో కాంగ్రెస్​ నిర్వహించిన ర్యాలీకి రాష్ట్రం నుంచి ఆ పార్టీ ముఖ్యనేతలు తరలివెళ్లిన విషయం తెలిసిందే. అయితే, షాంగ్రిలా హోటల్లో మంత్రి దామోదర్​ రాజనర్సింహతో పాటు పలువురు ఎంఎల్​ఏలు, నాయకులు బసచేశారు. అయితే, హోటల్ లాబీలో మంత్రి దామోదర రాజనర్సింహ కనిపించటంతో జుక్కల్ ఎంఎల్​ఏ తోట లక్ష్మీకాంతరావు విష్ చేశారని.. ఆ వెంటనే మంత్రి అతనిపై ఆగ్రహాం వ్యక్తం చేశారని సమాచారం. ఏకంగా ‘నిన్ను ఇక్కడే బొందపెడతా..’ అంటూ బూతులు తిట్టినట్టు తెలిసింది. ఈ ఘటన జరిగినప్పుడు అక్కడ రంగారెడ్డి జిల్లాతో పాటు ఇతర జిల్లాల ఎంఎల్​ఏలు, నాయకులు ఉన్నట్టు సమాచారం. అయితే, సంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడి నియమాకం వ్యవహారంలో ఎంఎల్​ఏ జోక్యం చేసుకున్నారనే ఉద్దేశంతోనే మంత్రి ఆగ్రహం వ్యక్తం చేసి ఉండొచ్చని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఘటనపై ఎంఎల్​ఏను ‘ప్రభాత ఉదయం’ ప్రతినిధి ఫోన్లో సంప్రదించగా.. మంత్రి తనను బూతులు తిట్టిన మాట వాస్తవమేనని చెప్పారు. ఇంతకుముందు తనకు, మంత్రికి మధ్య ఎలాంటి అభిప్రాయబేధాలు లేవన్నారు. డీసీసీ అధ్యక్షుల నియామక పక్రియ అదిష్ఠానం ‘సంఘటన్ సృజన్ అభియాన్’ అనే పక్రియ ద్వారా చేపట్టిందన్నారు. ఈ ఘటనపై ఇప్పటికే పీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర వ్యవహారాల ఇన్​చార్జి మీనాక్షి నటరాజన్​తోపాటు ఎంపీ మల్లు రవికి ఫిర్యాదు చేశానని తెలిపారు.