ఎల్ నినోను ఎదిరించిన మహబూబాబాద్ నిజాం చెరువు

తెలంగాణలో చెరువులు ఎండిపోతున్న వేళ మహబూబాబాద్‌లోని చారిత్రక నిజాం చెరువు అలుగు పోస్తోంది. దీన్ని మినీ ట్యాంక్‌బండ్‌గా అభివృద్ధి చేయాలనే డిమాండ్‌ వినిపిస్తోంది.
Nizam Cheruvu in Mahabubabad
మహబూబాబాద్‌ నిజాం చెరువు
Published on: 

ప్రభాత ఉదయం, మహబూబాబాద్: ఎల్ నినో పరిస్థితుల ప్రభావంతో తెలంగాణలోని ఎన్నో చెరువులు ఎండిపోయాయి. రాష్ట్రంలోని 6వేలకుపైగా చెరువులకుగానూ 500 చెరువుల్లోనే ప్రస్తుతం నీరుంది. దీంతో ఈఏడాది కొన్ని ప్రాంతాల్లో నీళ్లు లేని చెరువుల్లోనే బతుకమ్మలను నిమజ్జనం చేయాల్సి వచ్చింది. ఇంతటి జల సంక్షోభం వేళ కూడా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో నిజాం పాలనా కాలంలో నిర్మించిన నిజాం చెరువు అలుగు పోస్తోంది. ఇటీవలే కురిసిన తేలికపాటి వర్షాల పుణ్యమా అని ఈ చెరువులోకి వరద నీరు వచ్చి చేరడంతో గోపాలపురం, నందన గార్డెన్ వైపుల్లో అలుగుపోస్తోంది.

మినీ ట్యాంక్​బండ్​గా మార్చండి

నిజాం చెరువుకు ఎడమ వైపున పెద్దమ్మతల్లి ఆలయం, కుడి వైపున బతుకమ్మ తల్లి విగ్రహం ఉన్నాయి. ఏటా గణేశ్​ నిమజ్జనమైనా, బతుకమ్మల నిమజ్జనమైనా ఈ చెరువులోనే చేస్తుంటారు. ఈనేపథ్యంలో దీన్ని బతుకమ్మ చెరువుగా మార్చాలని పట్టణవాసులు ఎన్నో ఏళ్లుగా కోరుతున్నారు. దీనిపై గతంలోనే పలుమార్లు మున్సిపల్ కమిషనర్లకు వినతి పత్రాలు అందించారు. ఈ చెరువును మినీ ట్యాంక్​బండ్​గా మార్చే అంశాన్ని పరిశీలించాలని మహబూబాబాద్ బీజేపీ కార్యదర్శి  ఇందు భారతి కోరుతున్నారు. ఈ దిశగా జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ చూపాలని ఆమె డిమాండ్ చేస్తున్నారు. నిజాం చెరువు కట్ట చుట్టూ సిమెంట్ పిల్లర్లతో ఇనుప కడ్డీల రక్షణ వలయం ఉంది. అయినప్పటికీ పలువురు పరిసర ప్రాంత ప్రజలు చెరువులో చెత్తాచెదారాన్ని పారవేస్తున్నారు.