‘గుండి’ కోసం యువ ఉద్యమం

ఆసిఫాబాద్‌లోని పెద్దవాగుపై గుండి బ్రిడ్జి నిర్మాణం 2006లో ప్రారంభమైనా ఇప్పటికీ పూర్తికాలేదు. సమస్య పరిష్కారం కోసం గ్రామ యువకులు హైదరాబాద్‌ సచివాలయానికి సైకిల్‌ యాత్ర చేపట్టారు.
Gundi bridge in Asifabad construction delay
20 ఏళ్లుగా అసంపూర్తిగా ఉన్న గుండి బ్రిడ్జి
Published on: 

 ‘గుండి’ కోసం యువ ఉద్యమం 

‌‌- ఇరవై ఏండ్లుగా కొనసాగుతున్న బ్రిడ్జి పనులు

- ప్రతి వర్షాకాలంలోనూ ప్రజలకు తప్పని తిప్పలు 

- పూర్తిచేయాలని సచివాలయానికి సైకిల్​ యాత్ర  

 ప్రభాత ఉదయం, కుమ్రంభీం ఆసిఫాబాద్​:  ఆసిఫాబాద్​ మండలంలోని పెద్దవాగుపై నిర్మిస్తున్న గుండి బ్రిడ్జి నిర్మాణ పనుల పూర్తికి మోక్షం కలుగటం లేదు. పనులు ప్రారంభించి రెండు దశాబ్దాలు గడుస్తున్నా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. వంతెన పనులను పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఆసిఫాబాద్​, సిర్పూర్​ నియోజకవర్గాలను కలిపే ఈ వంతెన నిర్మాణానికి 2006లో అప్పటి కాంగ్రెస్​ ప్రభుత్వం రూ.2 కోట్ల 80 లక్షల నిధులతో శ్రీకారం చుట్టింది. అప్పటి ఆర్అండ్​బీ శాఖ మంత్రి జీవన్​రెడ్డి పనులను ప్రారంభించారు. ఇప్పటి వరకు నాలుగు ప్రభుత్వాలు మారినా వంతెన  పనులు పిల్లర్లకే పరిమితమయ్యాయి. ప్రతి వర్షాకాలంలో పెద్దవాగు ఉగ్రరూపం దాల్చి గుండితోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు జిల్లా కేంద్రంతో సంబంధాలు తెగిపోతున్నాయి. అత్యవసర సమయంలో జిల్లా కేంద్రానికి చేరుకోవాంటే వాంకిడి మండలం కనర్​గాం మీదుగా 30 కిలోమీటర్ల దూరం తిరిగి రావాల్సిన పరిస్థితి. వంతెనను త్వరగా పూర్తిచేయాలని ప్రజలు ఎన్నోసార్లు పాలకులు, అధికారులకు వేడుకుంటున్నప్పటికీ పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. దీంతో విసుగు చెందిన గ్రామస్తులు.. నాయకులు, అధికారుల వైఖరిని నిరసిస్తూ గతంలో కలెక్టరేట్ వరకు పాదయాత్రలు చేపట్టారు. అయినా ప్రభుత్వంలో చలనం రాకపోవడంతో ఇప్పుడు సచివాలయానికి ఉద్యమబాట పట్టారు. గ్రామ యువకులు ఏకంగా హైదరాబాద్​లోని సచివాలయానికి సైకిల్​యాత్ర చేపట్టారు. సీఎం రేవంత్​రెడ్డిని కలిసి సమస్యను వివరించనున్నారు.

వంతెన నిర్మాణ పనులు పూర్తిచేయాలని పాదయాత్ర చేస్తున్న గ్రామస్తులు(ఫైల్)
వంతెన నిర్మాణ పనులు పూర్తిచేయాలని పాదయాత్ర చేస్తున్న గ్రామస్తులు(ఫైల్)

* ‘నో ఓట్​.. నో ఎలక్షన్​’ అంటూ ఫ్లెక్సీలు.. 

గుండి బ్రిడ్జి నిర్మాణం పూర్తిచేయాలని గ్రామస్తులు ఆందోళన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. అధికారులు, నేతలకు పలుమార్లు వినతులు ఇచ్చినా ఫలితం లేకపోవడంతో 2016లో  గ్రామస్తులంతా మూకుమ్మడిగా కలెక్టరేట్ వరకు పాదయాత్ర చేసి అక్కడ ధర్నా చేశారు.  గత అసెంబ్లీ ఎన్నికల్లో(2023)లో రాజకీయ పార్టీలకతీతంగా గ్రామస్తులంతా ఏకతాటిపైకి వచ్చి ఆందోళనబాట పట్టారు. పార్టీల నేతలను ఊళ్లోకి అడుగుపెట్టనివ్వమని తీర్మానించి  ‘నో బ్రిడ్జి.. నో ఓట్.. నో ఎలక్షన్’ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఏ ఒక్కరూ ఓటు వేయకూడదంటూ తీర్మానించారు. గ్రామంలో మూడుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటుచేసి సోషల్ మీడియా వేదికగా నిరసనలు తెలిపారు.  దీంతో అధికారులు నచ్చజెప్పి ఎన్నికల తర్వాత వంతెన పనులు పూర్తిచేయిస్తామని హామీ ఇవ్వడంతో ఎన్నికల్లో పాల్గొన్నారు.  ఎన్నికలు పూర్తయ్యి మూడేళ్లు కావస్తున్నా పట్టించుకునేవారే కరువయ్యారు. 

వంతెన నిర్మాణ పనులు పూర్తిచేయాలని గ్రామ యువకులు సెక్రటేరియట్​కు చేపట్టిన సైకిల్​ యాత్ర
వంతెన నిర్మాణ పనులు పూర్తిచేయాలని గ్రామ యువకులు సెక్రటేరియట్​కు చేపట్టిన సైకిల్​ యాత్ర

*బ్రిడ్జి నిర్మాణంలో నిర్లక్ష్యం ఇలా.. 

* 2006 : అప్పటి మంత్రి జీవన్​రెడ్డి రూ.2 కోట్ల 80 లక్షలతో బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు.

*2008-09 : రీ డిజైన్ పేరుతో రూ.3 కోట్ల 70 లక్షలతో ఆగిపోయిన పనులను మళ్లీ ప్రారంభించారు.

*2014 : బీఆర్ఎస్ ప్రభుత్వం బ్రిడ్జి వ్యయం పెంచి రూ.8 కోట్ల 40 లక్షలతో  పనులు చేపట్టి మధ్యలోనే ఆపేశారు.

*2016 : మళ్లీ ఎమ్మెల్యే  కోవా లక్ష్మి బ్రిడ్జి పనులను ప్రారంభించారు.

*2018-19 : మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు హయాంలో  అంచనా వ్యయం రూ.11 కోట్ల 30 లక్షలకు పెంచారు. అయినా ఇప్పటికీ బ్రిడ్జి నిర్మాణం పూర్తికాలేదు.    

వంతెన నిర్మాణ పనులు పూర్తిచేయాలని గ్రామ యువకులు సెక్రటేరియట్​కు చేపట్టిన సైకిల్​ యాత్ర
వంతెన నిర్మాణ పనులు పూర్తిచేయాలని గ్రామ యువకులు సెక్రటేరియట్​కు చేపట్టిన సైకిల్​ యాత్ర