

ప్రభాత ఉదయం, హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నేతలు ఈవీఎంలపై విషప్రచారం చేస్తున్నారని, వారికి దమ్ముంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి బ్యాలెట్ ద్వారా ఎన్నికలకు సిద్ధం కావాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ సవాల్ విసిరారు. తన సవాల్‌కు ఒప్పుకొని ప్రభుత్వాన్ని రద్దు చేసి బ్యాలెట్‌తో ఎన్నికలకు సిద్ధపడితే అందుకు కేంద్రాన్ని ఒప్పించేందుకు కృషి చేస్తానన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఎమ్మెల్సీలు మల్క కొమరయ్య, అంజిరెడ్డి, సర్ ఇన్చార్జ్ బండారి శాంతి కుమార్, బీజేపీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ప్రకాశ్ రెడ్డి, ముఖ్య అధికార ప్రతినిధి ఎన్వీ సుభాశ్, అధికార ప్రతినిధులు సంగప్ప, సునీత తదితరులతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. “దేశానికి స్వాతంత్ర్యం తెచ్చామని జబ్బలు చరుచుకుంటున్న కాంగ్రెస్ పార్టీ విదేశీ సంస్థలు ఇచ్చే నిధులతో నడుస్తున్న పార్టీలతో, దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే శక్తులతో కలిసి పనిచేయడం సిగ్గు చేటు. దేశంలో అల్లర్లు సృష్టించి ప్రభుత్వ మార్పు కోరుకుంటున్న నేహాబోరా, బొద్దింకల పార్టీ నేతలతో కలిసి ధర్నాలు చేస్తారా? ఇదేనా మీ దేశభక్తి?’’ అని దుయ్యబట్టారు.
స్వార్థ రాజకీయాలకు పరాకాష్ట
‘కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ ధర్నా గురించి ఎక్కడా చర్చ లేదు. నవంబర్ 1న కాంగ్రెస్ పాలనలో 3 వేల సిక్కులను ఊచకోత కోసిన సంఘటనపై చర్చిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మొదట సిక్కులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి. రాష్ట్రమంతా పంటలు ఎండి కరువుతో అల్లాడుతోంది. దేశంలో ప్రతిపక్షంగా, రాష్ట్రంలో పాలకపక్షంగా ఉన్నా కాంగ్రెస్ పట్టించుకోవడంలేదు. కాంగ్రెస్ ఓడిపోయినప్పుడల్లా ఈవీఎంలపైన, సర్ పైన విషం చిమ్ముతూ ఎన్నికల సంఘాన్ని టార్గెట్ చేయడం దుర్మార్గం. కాంగ్రెస్ పాలనలో 10 సార్లు సర్ నిర్వహించారు. ఆనాడు ఎందుకు వ్యతిరేకించలేదు? కాంగ్రెస్ గెలిస్తే సర్ బాగున్నట్లా? ఓడిపోతే ఎన్నికల సంఘంపై దాడి చేస్తారా? కర్ణాటక, తెలంగాణ, కేరళ రాష్ట్రాల్లోనూ ఈ ఎలక్షన్ కమిషనర్ల అధ్వర్యంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే గెలిచింది కదా? నిన్నటికి నిన్న 4 రాష్ట్రాల్లో బ్యాలెట్‌తో జరిగిన 28 ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ చిత్తుగా ఓడిపోయింది. మరి దీనికి కాంగ్రెస్ ఏం సమాధానం చెబుతుంది? వాస్తవానికి కాంగ్రెస్ ఆరోపిస్తున్నట్టు 13 కోట్ల ఓట్లు తొలగించనేలేదు.. అది ముసాయిదా మాత్రమే’ అని బండి సంజయ్ అన్నారు.
అభిశంసన తీర్మానం పెద్ద జోక్
‘సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌పై అభిశంసన తీర్మానం పెద్ద జోక్. ప్రజాక్షేత్రంలోనే కాంగ్రెస్‌ను జనం ఛీత్కరించారు. అభిసంశన తీర్మానమే కాదు ఐక్యరాజ్యసమితికి పోయి గగ్గోలు పెట్టినా ఎదుర్కొంటాం. ఈ దేశాన్ని కాపాడేందుకు అహర్నిశలు కష్టపడుతున్న అజిత్ దోవల్‌పై రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేతలు విమర్శలు చేయడం దుర్మార్గం’ అని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.