

ప్రభాత ఉదయం, భద్రాచలం: గిరిజన యువతకు భద్రాచలం ఐటీడీఏ శుభవార్త చెప్పింది. నిరుద్యోగ యువతీ యువకుల కోసం రెండో విడత ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాలను ప్రారంభించనున్నట్లు ఐటీడీఏ పీవో బీ రాహుల్ తెలిపారు. బుధవారం తన చాంబర్‌లో గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పీవో మాట్లాడుతూ, గిరిజన యువత స్వయం ఉపాధి పొందడమే లక్ష్యంగా ఈ కోర్సులను తీసుకువస్తున్నామన్నారు. రెండో విడతలో ఆధునిక సాంకేతిక కోర్సులకు ప్రాధాన్యం ఇచ్చామన్నారు. డ్రోన్ సర్వీస్ టెక్నీషియన్, జూనియర్ సాఫ్ట్‌వేర్ డెవలపర్, ఇతర వృత్తి నైపుణ్య కోర్సులు ఉంటాయని పేర్కొన్నారు. శిక్షణ పొందే అభ్యర్థులకు ఉచిత భోజనం, వసతి సౌకర్యం కల్పిస్తామని పీవో తెలిపారు. గిరిజన నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ భవిష్యత్తుకు బలమైన పునాది వేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీవో జనరల్ డేవిడ్ రాజ్, జేడీఎం హరికృష్ణ, వైటీసీ మేనేజర్ నక్కా శ్రీను తదితరులు పాల్గొన్నారు.