

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : విద్యుత్ ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి చెల్లించే కరువు భత్యం (డీఏ), కరువు ఉపశమనం (డీఆర్) పెంచబోతున్నది. ఈ మేరకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని శుక్రవారం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. విద్యుత్ సంస్థల సీఎండీలను ఆదేశించారు. ప్రస్తుతం 19.272 శాతంగా ఉన్న డీఏ, డీఆర్‌ను 2.543 శాతం పెంచి 21.815 శాతం ఇవ్వనున్నారు. పెరిగిన డీఏ 2026 జూలై 1 నుంచి వర్తించనున్నది. కార్మికశాఖ పరిధిలోని లేబర్ బ్యూరో ప్రకటించే అఖిల భారత ధరల సూచీ ఆధారంగా డీఏ, డీఆర్‌ను సవరించనున్నారు. ధరల సూచీలో వచ్చే మార్పులకు అనుగుణంగా ప్రతి ఆరు నెలలకు ఒకసారి జనవరి, జూలై నెలల్లో సవరణ చేపడుతున్నారు. రాష్ట్రంలోని నాలుగు విద్యుత్ సంస్థల పరిధిలో 71,360 మంది ఉద్యోగులు, ఆర్టిజన్లు, పెన్షనర్లకు డీఏ పెంపుతో ప్రయోజనం చేకూరనున్నది. ఇందుకోసం విద్యుత్ సంస్థలపై నెలకు సుమారు రూ.14.63 కోట్ల అదనపు ఆర్థికభారం పడనున్నది. కాగా టీజీ ట్రాన్స్‌కో పరిధిలో 3,081 మంది ఉద్యోగులు, 3,644 మంది ఆర్టిజన్లు, 2,469 మంది పెన్షనర్లు కలిపి మొత్తం 9,194 మందికి ప్రయోజనం కలగనున్నది. టీజీ జెన్‌కోలో 7,197 మంది ఉద్యోగులు, 3,544 మంది ఆర్టిజన్లు, 3,426 మంది పెన్షనర్లు కలిపి 14,167 మంది లబ్ధి పొందనున్నారు. టీజీ ఎస్పీడీసీఎల్‌లో 11,719 మంది ఉద్యోగులు, 8,493 మంది ఆర్టిజన్లు, 8,269 మంది పెన్షనర్లు కలిపి 28,481 మందికి, టీజీ ఎన్పీడీసీఎల్‌లో 9,936 మంది ఉద్యోగులు, 3,435 మంది ఆర్టిజన్లు, 6,147 మంది పెన్షనర్లు కలిపి 19,518 మందికి ప్రయోజనం చేకూరనున్నది.