బొగ్గు లేకుండానే యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మించిన బీఆర్ఎస్ సర్కార్

Bhatti Vikramarka
Deputy CM Bhatti Vikramarka
Published on: 

- సింగరేణిపై తప్పుడు ప్రచారం తగదు

- డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

ప్రభాత ఉదయం, హైదరాబాద్: ఎలాంటి బొగ్గు కేటాయింపులు లేకుండానే గత బీఆర్ఎస్ సర్కార్ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ నిర్మాణం చేపట్టిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. ప్రజాభవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.

బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్యే హరీశ్‌రావు విద్యుత్‌ సమస్యలపై చేసిన విమర్శలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. యాదాద్రి పవర్ ప్లాంట్‌కు సింగరేణి నుంచి 14 మిలియన్ టన్నుల జీ-9 రకం బొగ్గు సరఫరాకు 2016 ఏప్రిల్ 27న ఒప్పందం కుదిరిందన్నారు. అయితే ఆ తర్వాత 14 మిలియన్ టన్నుల బొగ్గుకు ఏడు టన్నులు మాత్రమే సింగరేణి నుంచి సరఫరా చేసేలా ఒప్పందంలో మార్పులు చేశారని చెప్పారు.

యాదాద్రి ప్లాంట్‌కు అవసరమైన మరో ఏడు టన్నుల బొగ్గును మెటల్ స్క్రాప్ కార్పొరేషన్ ద్వారా సరఫరా చేసేలా 2016 డిసెంబర్ 9న ఒప్పందం జరిగిందని చెప్పారు. ఈ రెండు ఒప్పందాలను పక్కన పెట్టి సింగరేణి నుంచే ఈ ప్లాంట్‌కు అవసరమైన 14 మిలియన్ టన్నుల బొగ్గును సరఫరా చేసేలా మరో ఒప్పందం చేశారని వివరించారు. ఈ మూడు ఒప్పందాలకు సంబంధించిన పత్రాలను మీడియాకు చూపారు.

ఈ ప్లాంట్‌ను 2018 నాటికి పూర్తి చేయాలని, కానీ 2023 నాటికి కూడా ఈ ప్లాంట్ పూర్తికాలేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న కాలంలో సింగరేణి సంస్థ కొత్త బొగ్గు కేంద్రాల వేలంలో పాల్గొనలేదని, 14 బొగ్గు క్షేత్రాలు మూతపడ్డాయని గుర్తుచేశారు.

నైనీ బ్లాక్ సింగరేణికి కేటాయించినా, అక్కడ మైనింగ్ ప్రారంభించలేదని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతే మైనింగ్ ప్రారంభమైందని గుర్తుచేశారు. యాదాద్రికి బొగ్గు కేటాయింపుపై కేంద్రంతో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పారు. ముడిసరుకు లేకుండా విద్యుత్ ఉత్పత్తి చేయడం ద్వారా యాదాద్రిలో యూనిట్ విద్యుత్ ఉత్పత్తి ధర రూ.6.06కు చేరుకుందన్నారు. కేటీపీఎస్‌లో యూనిట్‌కు రూ.4.97, కొత్తగూడెంలో యూనిట్‌కు రూ.4.62 ఖర్చు అవుతోందని వివరించారు.

తాము యాదాద్రి పవర్‌ప్లాంట్‌ నిర్మిస్తే పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేయడం లేదని హరీశ్‌రావు విమర్శించడం హాస్యాస్పదమన్నారు. ఎల్‌ నినో ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్‌కు డిమాండ్ పెరిగిందని, అందుకు అనుగుణంగా విద్యుత్ సరఫరాకు కృషిచేస్తున్న సిబ్బందిని ఆయన అభినందించారు.

డిస్కమ్, ట్రాన్స్‌కో, జెన్‌కోను ప్రైవేటీకరించే ఉద్దేశ్యం తమకు లేదని స్పష్టం చేశారు. విద్యుత్ సంస్థలతోపాటు, సింగరేణిపై హరీశ్‌రావు తప్పుడు ప్రచారం చేయడాన్ని ఆయన తప్పుబట్టారు.