3 వేల స్కూళ్లకు ‘స్కౌట్స్’ : భట్టి

విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సేవాభావం పెంపొందించేందుకు స్కౌట్స్ అండ్ గైడ్స్‌ను మరిన్ని ప్రభుత్వ పాఠశాలల్లో విస్తరించనున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు.
Chief Minister Bhatti Vikramarka and Governor Shiv Pratap Shukla
దోమలగూడలో స్కౌట్స్ అండ్ గైడ్స్ మోడల్ హైస్కూల్ ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేస్తున్న భట్టి విక్రమార్క, గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్‌ : రాష్ట్రంలో 3,200కు పైగా ప్రభుత్వ స్కూళ్లకు స్కౌట్స్ అండ్​ గైడ్స్​ను విస్తరించి, సుమారు 1.3 లక్షల మంది విద్యార్థులకు చేరువ చేయాలని తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. జీవితంలో వ్యక్తిగత విజయాలతో పాటు ఇతరులకు ఉపయోగపడేలా తమను తాము తీర్చిదిద్దుకోవాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు. దోమలగూడలోని భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ మోడల్‌ హైస్కూల్‌ ఆధునీకరణ పనులకు శుక్రవారం రాష్ట్ర గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లాతో కలిసి భట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాఠశాల అభివృద్ధికి సింగరేణి నుంచి రూ.2.5 కోట్ల నిధులు విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, సమయపాలన, సేవాభావం, నాయకత్వ లక్షణాలతో పాటు నైతిక విలువలను పెంపొందించడంలో భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ కీలక పాత్ర పోషిస్తోందని అన్నారు. ఏఐ ఎన్నింటికి సమాధానాలు ఇచ్చినా, మనం ఎలాంటి మనుషులుగా ఎదగాలనే ప్రశ్నకు మాత్రం జవాబు చెప్పలేదని పేర్కొన్నారు. పదవులు, అధికారంతో కాకుండా మహాత్మా గాంధీ తన ఆచరణ, వ్యక్తిత్వం ద్వారా లక్షలాది మందికి నాయకత్వం వహించారని గుర్తుచేశారు. దేశానికి అవసరమైన నాయకత్వం కూడా అలాంటిదేనని అభిప్రాయపడ్డారు. గవర్నర్‌ శివ ప్రతాప్‌ శుక్లా మార్గదర్శకత్వంలో తెలంగాణలో భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ సంఖ్య ఏడాది కాలంలో దాదాపు 70 వేల స్థాయికి చేరడం గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, గవర్నర్‌ కార్యాలయం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దాన కిషోర్‌, విద్యాశాఖ కార్యదర్శి యోగితా రాణా తదితరులు పాల్గొన్నారు.