ఏఐతో ప్రజల జీవితాల్లో మార్పు రావాలి

ప్రభుత్వ నిర్ణయాల్లో మానవ పర్యవేక్షణ తప్పనిసరని, ఏఐ వ్యవస్థలకు స్పష్టమైన నియంత్రణలు ఉండాలని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.
Bhatti Vikramarka launches the AI Saksham programme
హైదరాబాద్‌లో ‘ఏఐ సాక్షమ్‌’ కార్యక్రమాన్ని ప్రారంభించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్: ఏఐ వల్ల ప్రజల జీవితాల్లో సానుకూల మార్పు రావాలని, అదే ఏఐ విజయానికి అసలైన కొలమానమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. టెక్నాలజీ ఎంత అభివృద్ధి చెందినా, అది ప్రజలకు ఎంత మెరుగైన సేవలందిస్తున్నదనేదే కీలకమన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని ఎంసీఆర్​హెచ్‌ఆర్‌డీలో ప్రణాళికా శాఖ సహకారంతో టీజీ మ్యాథ్‌ చేపట్టిన ‘ఏఐ సాక్షమ్‌’ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఏఐ వినియోగంతో ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజా సమస్యలు సకాలంలో పరిష్కారం కావాలి.. రైతులు, పింఛనుదారులు, సామాన్య పౌరులు తమ పనుల కోసం పదేపదే కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి మారాలి.. కార్యాలయంలో ఆదా అయ్యే ప్రతి నిమిషం ప్రజలకు తిరిగి అందించే సమయంగా మారాలి’ అని భట్టి అన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సామర్థ్యాలను పెంపొందించి, ప్రజలకు మరింత వేగంగా, పారదర్శకంగా, సమర్థంగా సేవలందించే పరిపాలనా వ్యవస్థను నిర్మించడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని అన్నారు. ‎ఏఐ ఆధారిత వ్యవస్థలకు అధికారాలు కల్పించే ముందు వాటి పరిమితులను స్పష్టంగా నిర్ణయించాలని సూచించారు. ముసాయిదా తయారు చేసే సాధనానికి, అధికారిక ఆదేశాలు పంపే లేదా రికార్డులను మార్చే వ్యవస్థకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించి, తగిన నియంత్రణలు ఏర్పాటు చేయాలన్నారు. ఏదైనా తప్పు జరిగితే బాధ్యత వహించే వ్యక్తి ఎవరో స్పష్టంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రభుత్వానికి సాంకేతిక వ్యవస్థలపై నిరంతర పర్యవేక్షణ, నియంత్రణ ఉండాలని స్పష్టం చేశారు. ‎ప్రభుత్వ ఉద్యోగుల్లో టెక్నాలజీపై అవగాహన, ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో ‘ఏఐ సాక్షమ్‌’ కీలక పాత్ర పోషిస్తుందని భట్టి విక్రమార్క అన్నారు.

విద్యుత్​​ రంగంలో ఏఐని వాడాలి

‎విద్యుత్‌ డిమాండ్‌ను ముందుగానే అంచనా వేయడం, పరికరాల్లో తలెత్తే లోపాలను గుర్తించడం, నిర్వహణ చర్యలను మెరుగుపరచడంలో ఏఐ ఉపయోగపడుతుందని డిప్యూటీ సీఎం తెలిపారు. రైతులు, చిన్న పరిశ్రమలు, ఆసుపత్రులకు నిరంతర విద్యుత్‌ సరఫరా అందించడంలో దోహదపడుతుందన్నారు. అయితే, వాస్తవ పరిస్థితుల్లో వ్యవస్థ పనితీరును, భద్రతా ప్రమాణాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే అమలు చేయాలని సూచించారు. ‎ప్రభుత్వ ఉద్యోగులు తమ కార్యాలయాల్లో ఎదురయ్యే సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ఏఐ సాధనాలను ప్రయోగాత్మకంగా వినియోగించాలని పిలుపునిచ్చారు. ఏఐ ఆధారంగా తీసుకున్న నిర్ణయాల్లోనూ మానవ పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలని, ప్రతికూల నిర్ణయాలపై పౌరులు బాధ్యతాయుతమైన అధికారులను సంప్రదించే అవకాశం కల్పించాలని తెలిపారు. కార్యక్రమంలో  ప్లానింగ్ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్, ట్రాన్స్​కో సీఎండీ కృష్ణ భాస్కర్, టీజీ మ్యాథ్‌ ఎండీ పూజ, ఎంసీఆర్‌ హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ జనరల్ శాంతి కుమారి, తదితరులు పాల్గొన్నారు.