

ప్రభాత ఉదయం, హైదరాబాద్: తెలంగాణను మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేసే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోందని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు సమన్వయంతో పనిచేస్తే 2047నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధించడం సాధ్యమేనన్నారు. ఎంసీఆర్హెచ్ఆర్డీ సంస్థ 50 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా శుక్రవారం నిర్వహించిన స్వర్ణోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ గణాంకాలకే పరిమితం కాకుండా రాష్ట్రంలోని ప్రతి వ్యక్తి జీవితంలో సానుకూల మార్పు తీసుకొచ్చేలా అభివృద్ధి ఉండాలన్నారు. ప్రజలకు మెరుగైన ఉపాధి, విద్య, వైద్యం, జీవన ప్రమాణాల పెంపు, భద్రత కల్పించడమే నిజమైన అభివృద్ధి అని స్పష్టం చేశారు. సంక్షేమం, ఆర్థిక క్రమశిక్షణ, పర్యావరణ పరిరక్షణ సమన్వయంతోనే సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. అనంతరం ‘ఆర్థిక వృద్ధి–సుస్థిర అభివృద్ధి- ప్రజా విధానాలు’ అంశాలపై నిర్వహించిన సదస్సులో భట్టి మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలను సమర్థవంతంగా అమలు చేయడంలో అధికారులకు శిక్షణనిచ్చే సంస్థల పాత్ర కీలకమని అన్నారు. తొలి ప్రధాని నెహ్రూ దేశంలో సైన్స్, ఉన్నత విద్య, ప్రజా సంస్థల అభివృద్ధికి పునాదులు వేశారని, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా సాహసోపేతమైన, విధానపరమైన మార్పులు తీసుకొచ్చి దేశ ఆర్థిక ప్రగతికి బాటలు వేశారని గుర్తుచేశారు.
హైదరాబాద్ అభివృద్ధి రాష్ట్రానికి గొప్ప అవకాశం
టెక్నాలజీ, లైఫ్ సైన్సెస్, ఆధునిక సేవా రంగాల్లో హైదరాబాద్ సాధించిన ప్రగతి రాష్ట్రానికి గొప్ప అవకాశమని భట్టి విక్రమార్క అన్నారు. ఈ అభివృద్ధి తయారీ రంగం, వ్యవసాయం, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలకు విస్తరించాలని సూచించారు. ఇందుకోసం ప్రభుత్వం అమలు చేస్తున్న క్యూర్, ప్యూర్, రేర్ విధానాలు కోర్ అర్బన్, సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల మధ్య ఆర్థిక అనుసంధానాన్ని బలోపేతం చేస్తాయని వివరించారు. యువత ఉపాధి కోసం హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా సొంత జిల్లాల్లోనే అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. రైతు సంక్షేమం అంటే కేవలం పంటలకు మద్దతు ఇవ్వడం మాత్రమే కాదని, రైతు కుటుంబానికి ఆర్థిక, సామాజిక భద్రత కల్పించడమన్నారు. ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు దోహదపడుతున్నాయని తెలిపారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఉచిత బస్సు సౌకర్యంతో మహిళలకు ప్రయాణ ఖర్చులు తగ్గడమే కాకుండా వారికి ఉద్యోగం, విద్య అవకాశాలు పెరిగాయన్నారు. గృహజ్యోతి ద్వారా 53 లక్షల కుటుంబాలకు విద్యుత్ బిల్లుల భారం తగ్గుతోందని వివరించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వ వైద్య సేవల బలోపేతం, 108 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు, నియోజకవర్గానికి ఒక తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఏర్పాటు వంటి కార్యక్రమాలు భవిష్యత్తు తరాలకు మెరుగైన అవకాశాలు కల్పిస్తాయని చెప్పారు. ప్రతి సంక్షేమ పథకానికి నమ్మకమైన ఆదాయ వనరులు ఉండాలని, నిర్మించిన స్కూళ్లు, హాస్పిటళ్ల నిర్వహణకు నిరంతరం నిధులు కేటాయింపు ఉండాలన్నారు. ఆదాయ వనరులపై ఒత్తిడి ఉన్నప్పటికీ ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు నిజాయితీతో కూడిన బడ్జెట్, సమర్థవంతమైన వ్యయ నిర్వహణకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని వివరించారు. చెరువులు, జలవనరులను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్‌లో వరదల వంటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఆర్థిక భారం పడుతుందని హెచ్చరించారు. మూసీ పునరుజ్జీవం, ఫ్యూచర్ సిటీ నిర్మాణంలో పర్యావరణ పరిరక్షణతో పాటు ప్రభావిత ప్రజలకు నాణ్యమైన పునరావాసం కల్పించడం కూడా ప్రాజెక్టుల విజయానికి కీలకమని పేర్కొన్నారు. పాలనా వ్యవస్థలో ప్రజల సమయానికి అధికారులు ప్రాధాన్యం ఇవ్వాలని, ఒక పని కోసం ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ పలుమార్లు తిరగాల్సి రావడం వల్ల సామాన్యులు ఆర్థికంగా నష్టపోతారన్నారు. ఆన్లైన్ సేవలు అందుబాటులోకి వచ్చినప్పటికీ ప్రజలు కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండకూడదని స్పష్టం చేశారు.
ఎస్ఆర్ శంకరన్ సేవలు నేటి తరానికి ఆదర్శం
సామాజిక సంక్షేమం, కార్మిక, గ్రామీణాభివృద్ధి, మహిళా సంక్షేమ శాఖల్లో పనిచేయడాన్ని అధికారులు శిక్షాత్మక పోస్టింగ్‌గా భావించకూడదని భట్టి పేర్కొన్నారు. ఎస్ఆర్ శంకరన్, పార్థసారథి వంటి అధికారులు తమ సేవలతో ప్రజల హృదయాల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారని గుర్తుచేశారు. ప్రజాప్రతినిధులు రూపొందించిన చట్టాలు, విధానాలను సమర్థవంతంగా అమలు చేస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించడం అధికారుల బాధ్యతని స్పష్టం చేశారు. అధికారుల వృత్తి జీవితం కేవలం ఉద్యోగానికే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడాలని, ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడమే వారి సేవలకు నిజమైన గుర్తింపు అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు.