జన జీవితాలను మార్చే ‘డీప్టెక్’కు ప్రోత్సాహం : డిప్యూటీ సీఎం భట్టి

జన జీవితాల్లో మార్పులు తీసుకొచ్చే డీప్‌టెక్ ఉత్పత్తులు, సేవలను ప్రోత్సహించడమే తమ​ ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.
Deputy CM Bhatti Vikramarka addressing the FICCI Telangana DeepTech Leadership Summit
డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
Published on: 

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : డీప్‌టెక్ విభాగంలో పరిశోధనలు, ఆవిష్కరణలకు తెలంగాణలో అపార అవకాశాలు ఉన్నాయని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. జన జీవితాల్లో మార్పులు తీసుకొచ్చే డీప్‌టెక్ ఉత్పత్తులు, సేవలను ప్రోత్సహించడమే కాంగ్రెస్​ ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. బుధవారం బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌లో నిర్వహించిన ఫిక్కీ వందేళ్ల వేడుకలు, తెలంగాణ డీప్‌టెక్ లీడర్‌షిప్ సమ్మిట్‌కు డిప్యూటీ సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుతో పాటు భట్టికి ఫిక్కీ చైర్మన్ వీవీఆర్ రాజు, అధ్యక్షురాలు కేకే మహేశ్వరి, ఫిక్కీ మాజీ అధ్యక్షురాలు, అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీతారెడ్డి తదితరులు ఘన స్వాగతం పలికారు. పునరుత్పాదక ఇంధన వినియోగం, విద్యుత్ నిల్వ సాంకేతికత, విద్యుత్ సరఫరా వ్యవస్థల పనితీరు మెరుగుదల వంటి అంశాల్లో డీప్‌టెక్ ఆవిష్కరణలకు విస్తృత అవకాశాలున్నాయని ఈసందర్భంగా డిప్యూటీ సీఎం చెప్పారు. డీప్‌టెక్ అభివృద్ధి పరిశోధకులు, సంస్థలకే పరిమితం కాకుండా యువతకు ఉపాధి అవకాశాలను కల్పించాలన్నారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని నిర్వహించడం, మరమ్మతులు చేయడం వంటి నైపుణ్యాలతో టెక్నీషియన్లు, ల్యాబొరేటరీ సిబ్బంది, కార్మికులను పరిశ్రమలు సిద్ధం చేయాలని ఆయన సూచించారు.

తెలంగాణ గ్లోబల్ సమ్మిట్​కు తరలిరండి

తెలంగాణను పెట్టుబడులు, పరిశ్రమలకు అత్యంత అనుకూలమైన గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం స్పష్టమైన లక్ష్యాలు, విధానాలతో ముందుకు సాగుతోందని భట్టి విక్రమార్క తెలిపారు.2034-35 నాటికి ఒక ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో పరిశ్రమలకు అనుకూలమైన విధానాలను రూపొందిస్తున్నట్లు చెప్పారు. ‎‎శతాబ్ది వేడుకలు నిర్వహించుకుంటున్న తరుణంలో భారతీయ పరిశోధనలు, ఆవిష్కరణలు ప్రపంచస్థాయికి ఎదిగేందుకు ఫిక్కీ చొరవ చూపాలని డిప్యూటీ సీఎం కోరారు. డిసెంబర్ 7, 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, వారి భాగస్వాములు పెద్ద సంఖ్యలో హాజరై రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు.

పారిశ్రామిక రంగం వాటా 3.04 లక్షల కోట్లు : మంత్రి శ్రీధర్ బాబు

తెలంగాణను ప్రపంచ స్థాయి డీప్‌టెక్ ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఏఐ, క్వాంటం టెక్నాలజీ, రోబోటిక్స్‌, సైబర్‌ సెక్యూరిటీ, సెమీకండక్టర్లు, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాల్లో పరిశోధన, ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. 2025–26లో తెలంగాణ స్థూల రాష్ట్ర విలువ జోడింపు (జీఎస్‌వీఏ)లో పారిశ్రామిక రంగం వాటా 8.1 శాతం వృద్ధిరేటుతో రూ.3.04 లక్షల కోట్లకు చేరిందని ఆయన చెప్పారు. ఇక స్టేట్ మర్చండైజ్ ఎక్స్​పోర్ట్స్​  39.3 శాతం పెరిగాయన్నారు.