కాసులు కురిపిస్తున్న కూరగాయల సాగు: ఆరుతడి పంటలతో లక్షల్లో ఆదాయం ఆర్జిస్తున్న తిమ్మాపూర్ రైతు భూమిరెడ్డి!

కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్‌కు చెందిన భూమిరెడ్డి 18 ఎకరాల్లో తొమ్మిది రకాల కూరగాయలు సాగు చేస్తూ రూ.32 లక్షల నికర ఆదాయం పొందారు.
Karimnagar farmer Edla Bhumireddy cultivating nine varieties of vegetables across 18 acres
18 ఎకరాల్లో తొమ్మిది రకాల కూరగాయలు సాగు చేస్తున్న కరీంనగర్ రైతు ఎడ్ల భూమిరెడ్డి
Published on: 

ప్రభాత ఉదయం, మానకొండూరు : వ్యవసాయంపై ఆసక్తి, సాగులో మెళకువలు, మార్కెటింగ్‌పై అవగాహన ఉంటే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం కంటే ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చని నిరూపిస్తున్నారు కరీంనగర్‌ జిల్లా తిమ్మాపూర్‌ మండలానికి చెందిన రైతు ఎడ్ల భూమిరెడ్డి. తనకున్న 18 ఎకరాల్లో తొమ్మిది రకాల కూరగాయలు సాగు చేస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. పంటలను స్వయంగా మార్కెట్‌లో విక్రయిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. ఎల్​నినో ప్రభావంతో ఈ ఏడాది ఆశించిన స్థాయిలో వర్షాలు కురవక భీకర కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పంటల సాగులో మార్పులు చేసుకోవాలని భూమిరెడ్డి కుటుంబం నిర్ణయించింది. కూరగాయలతో పాటు ఆరుతడి పంటలు సాగు చేయాలన్న ప్రభుత్వం, జిల్లా అధికారుల సూచనలను అనుసరించింది. ‘నాకున్న 18 ఎకరాల్లో బీరకాయ, దోసకాయ, టమాట, వంకాయ, బెండకాయ, కాకరకాయ తదితర తొమ్మిది రకాల కూరగాయలను సాగు చేస్తున్నా. వర్షాలు లేకపోవడంతో డ్రిప్‌ ఇరిగేషన్‌ ద్వారా పంటలకు నీరు అందిస్తున్నా. విత్తనాల కొనుగోలుతో పాటు తీగజాతి కూరగాయలకు తాత్కాలిక పందిళ్లు ఏర్పాటు చేసిన. మల్చింగ్‌ పేపర్‌ వినియోగిస్తూ సాగు చేపట్టా. ఈ ఏర్పాట్ల కోసం ఇప్పటివరకు సుమారు రూ.32 లక్షలు పెట్టుబడి పెట్టా’ అని భూమిరెడ్డి చెప్పారు. ప్రభుత్వ సబ్సిడీ ఏదీ తీసుకోకుండానే ఈ సాగుకు ఆయన శ్రీకారం చుట్టారు. పెంటతో పాటు రెడీమేడ్‌ సేంద్రియ ఎరువులను వినియోగిస్తుండటంతో పంట దిగుబడి ఆశాజనకంగా ఉందని రైతు పేర్కొన్నారు.

నేరుగా మార్కెట్‌లో విక్రయం..

తిమ్మాపూర్‌ ప్రాంతంలో పండించే కూరగాయలకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉండడంతో భూమిరెడ్డి స్వయంగా కూరగాయలను విక్రయిస్తున్నాడు. దళారుల ప్రమేయం లేకపోవడంతో మంచి లాభాలు వస్తున్నట్లు ఆయన చెప్పాడు. ఇప్పటివరకు పంటలపై పెట్టిన పెట్టుబడులు మినహాయించి సుమారు రూ.32 లక్షల నికర ఆదాయం పొందినట్లు వివరించాడు. టమాట సాగు కోసం తిమ్మాపూర్‌ రాజీవ్‌ రహదారి పక్కన ఉన్న మల్చింగ్‌ తోటల నుంచి ఒక్కో మొక్కను రూ.3 చొప్పున కొనుగోలు చేసి నాటారు. సీజన్‌ ముగిసే వరకు దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు. వచ్చే నెల రోజుల్లో టమాట పంట నుంచి ఆదాయం వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.