

ప్రభాత ఉదయం, హైదరాబాద్ : దేశీయ ఆయిల్ పామ్ రైతులకు గిట్టుబాటు ధర లభించాలంటే క్రూడ్ పామాయిల్ దిగుమతులపై సుంకాన్ని 44 శాతానికి పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆహారం, ప్రజా పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి లేఖ ద్వారా బదులిచ్చారు. దేశీయంగా వంటనూనెల ఉత్పత్తి అవసరాలకు సరిపోకపోవడంతో సుమారు 56 శాతం దిగుమతుల ద్వారానే తీరుతోందని తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు, వంటనూనెల ధరలు, రవాణా, బీమా వ్యయాలు, సరఫరాలో అనిశ్చితి, పండుగల సమయంలో పెరిగే డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకుని దిగుమతి సుంకాలను తగ్గించినట్టు లేఖలో వివరించారని తుమ్మల చెప్పారు.
బదులిచ్చిన కేంద్రమంత్రి
ఈ ఏడాది సెప్టెంబర్‌లో దానిని 11 శాతానికి తగ్గించడంతో విదేశాల నుంచి చౌకగా పామాయిల్ దిగుమతి అవుతుండటంతో స్థానికంగా ఆయిల్ పామ్ సాగు చేస్తున్న రైతులకు నష్టం కలుగుతోందని తుమ్మల అన్నారు. ఈ అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, నిర్మలా సీతారామన్, ప్రహ్లాద్ జోషి, కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, బీజేపీ ఎంపీలకు లేఖలు రాసినట్టు పేర్కొన్నారు. అయితే, తెలంగాణ ప్రభుత్వం వ్యక్తం చేసిన ఆందోళనలను గుర్తించామని కేంద్రం స్పష్టం చేసింది. అంతర్జాతీయ, దేశీయ మార్కెట్ పరిస్థితులతో పాటు రైతులు, వంటనూనెల పరిశ్రమ, వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని దిగుమతి సుంకాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తామని కేంద్ర మంత్రి తనకు రాసిన లేఖలో హామీ ఇచ్చారని తుమ్మల వెల్లడించారు.