

తెలంగాణలోని పురాతన ఆలయాలు కేవలం ఆధ్యాత్మిక కేంద్రాలు మాత్రమే కాదు.. అప్పటి శిల్పుల నిర్మాణ ప్రతిభకు, వాస్తు పరిజ్ఞానానికి నిలువెత్తు నిదర్శనాలు. అలాంటి విశిష్ట కట్టడాల్లో నల్లగొండ జిల్లా పానగల్‌లోని ఛాయా సోమేశ్వరాలయం ఒకటి. శతాబ్దాల చరిత్రను మోస్తున్న ఈ ఆలయంలోని నిర్మాణ రహస్యం ఇప్పటికీ సందర్శకులను ఆకర్షిస్తూనే ఉంటుంది.
పానగల్ ఛాయా సోమేశ్వరాలయం చరిత్రతోపాటు తన నిర్మాణ రహస్యాలతోనూ విశేషంగా కట్టడంగా నిలుస్తోంది. ఆలయ నిర్మాణంలో భాగంగా కనిపించే అసాధారణ శిల్ప, వాస్తు నైపుణ్యం నేటికీ ఆసక్తిని రేకెత్తిస్తోంది. శాస్త్ర విజ్ఞానానికి సవాలు విసురుతూ ప్రత్యేకంగా గర్భగుడిలో కనిపించే నీడ ఈ క్షేత్రానికి మరింత ప్రత్యేక గుర్తింపును తీసుకొచ్చింది. శైవ భక్తులకు పవిత్ర స్థలంగా, పురాతన భారతీయ వాస్తు శిల్ప సంప్రదాయాలకు అద్భుత నిదర్శనంగా ఈ ఆలయం ప్రసిద్ధి చెందింది.
నిత్య ఆరాధన
ఛాయా సోమేశ్వరాలయంలోని శివలింగాన్ని ‘జల లింగం’గా భక్తులు పిలుస్తారు. ఆలయంలో ప్రతిరోజూ మూడు పూటలా పూజలు, హారతులు జరుగుతాయి. సోమవారాల్లో స్వామివారికి ప్రత్యేక అభిషేకం నిర్వహిస్తారు. ప్రతి నెల మాసశివరాత్రి సందర్భంగా కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేపడతారు. మాఘం, శ్రావణం, కార్తీకం వంటి శివారాధనకు విశేష ప్రాధాన్యం ఉన్న మాసాల్లో ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. మహాశివరాత్రి రోజున రుద్రాభిషేకం, అన్నాభిషేకంతో పాటు ఇతర ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఇక కార్తీక మాసంలో ఆలయ ప్రాంగణం దీపాలతో అలంకరించడంతో భక్తిమయ వాతావరణం నెలకొంటుంది. పూజా కార్యక్రమాలతో పాటు ఆలయ పరిసరాల్లోని పురాతన నిర్మాణాలు, శిల్పాలను వీక్షించేందుకు కూడా ఈ సమయంలో సందర్శకులు వస్తుంటారు. ఛాయా సోమేశ్వరాలయం సమీపంలోని కోనేరు కూడా ఈ క్షేత్రంలోని ప్రత్యేకతల్లో ఒకటి. ఏడాది పొడవునా నీరు నిలిచి ఉండే ఈ జలవనరుకు ఆలయ సంప్రదాయాల్లోనూ ప్రాధాన్యం ఉంది.
800 ఏళ్ల క్రితం నిర్మాణం..ప్రాముఖ్యం
సుమారు ఎనిమిది శతాబ్దాల క్రితం (800 ఏళ్ల క్రితం) కందూరు చాళుక్యుల పాలకుడు ఉదయ భానుడు ఈ ఆలయ నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి. ఈ ఆలయం తెలంగాణ మధ్యయుగ శిల్పకళకు అరుదైన ప్రతిరూపంగా నిలుస్తోంది. పురావస్తు పరిశోధనల ప్రకారం ఈ ఆలయం క్రీస్తుశకం 11, 12వ శతాబ్దాల నాటిదిగా భావిస్తారు. ఈ ప్రాంతాన్ని పాలించిన పశ్చిమ చాళుక్యులు, కుందూరు చోళులు, కాకతీయుల కళా సంప్రదాయాల ప్రభావం ఈ ఆలయ నిర్మాణంలో కనిపిస్తుంది. క్రీ.శ. 1290 నాటి కాకతీయ పాలకుడు ప్రతాపరుద్రుడి కాలానికి సంబంధించిన శాసనం ఆలయ చారిత్రక ప్రాధాన్యాన్ని మరింత బలపరుస్తుంది.
పూర్తిగా రాతితో ఈ ఆలయాన్ని నిర్మించారు. ప్రకృతి వైపరీత్యాలు, ముఖ్యంగా భూకంపాల ప్రభావాన్ని తట్టుకునేలా ఆలయ నిర్మాణాన్ని పటిష్టంగా రూపొందించినట్లు కూడా చెబుతారు. ఆలయ నిర్మాణంలో రాతి శిల్పకళకు పెద్దపీట వేశారు. గోడలు, స్తంభాలపై వివిధ దేవతా రూపాలు, పురాణ ఘట్టాలను ప్రతిబింబించే శిల్పాలు కనిపిస్తాయి. ముఖ్యంగా రామాయణం, మహాభారతానికి సంబంధించిన దృశ్యాలను స్తంభాలపై చెక్కడం అప్పటి శిల్పుల కళానైపుణ్యాన్ని తెలియజేస్తుంది. ఆలయ గోడలపై శంఖం, చక్రం, గద వంటి వైష్ణవ చిహ్నాలతో పాటు శాసనాల ఆనవాళ్లు కూడా కనిపిస్తాయి. ఇవి ఆ కాలం సామాజిక, మత, రాజకీయం గురించి అధ్యయనం చేసేందుకు విలువైన ఆధారాలుగా భావించబడుతున్నాయి.
ఆలయానికి ఎదురుగా.. ‘ఉదయ సముద్రం’
ఛాయా సోమేశ్వరాలయం ఎదురుగా ఉన్న ‘ఉదయ సముద్రం’ చెరువు కూడా పానగల్ ప్రాంతపు ప్రాచీన వారసత్వంలో ఒక ముఖ్యమైన భాగంగా నిలిచింది. నాటి పాలకులు ఈ చెరువును తవ్వించినట్లు స్థానిక చారిత్రక సమాచారం చెబుతోంది. శతాబ్దాలు గడిచినా ఈ జలవనరు ఇప్పటికీ వినియోగంలో ఉండటం విశేషం. తాగునీరు, సాగునీటి అవసరాలకు ఇది ఉపయోగపడుతూ.. నాటి పాలకులు ఆలయ నిర్మాణంతో పాటు జలవనరుల అభివృద్ధికి ఇచ్చిన ప్రాధాన్యాన్ని గుర్తుచేస్తోంది.
నీడ ఓ..మిస్టరీ!
ఛాయా సోమేశ్వరాలయంలోని గర్భగుడిలో శివలింగం వెనక సూర్యుని కిరణాలతో నిమిత్తం లేకుండా లింగం ఆకార నీడ దర్శనమిస్తుంది. ఇది ఎలా కనిపిస్తుందనేది నేటికీ మిస్టరీగానే మిగిలింది. ఈ ఆలయం గర్భగుడి ముఖ ద్వారం ముందు రెండు స్తంభాలున్నా, అన్నివేళలా ఒకే నీడ పడుతుంది. వెలుతురు ఉన్నంతసేపు నీడ కదలకుండా ఒకే స్థానంలో ఉండటం ఈ దేవాలయం ప్రత్యేకత. సూర్యుడి కదలికతో సంబంధం లేకుండా శివలింగం వెనుక ఒకే ప్రాంతంలో నీడ కనిపించడం ఈ క్షేత్రానికి ‘ఛాయా సోమేశ్వరాలయం’ అనే ప్రత్యేక గుర్తింపును తెచ్చింది.
ఆ నీడ ఎక్కడి నుంచి వస్తుంది?
ఆలయ పశ్చిమ భాగంలోని గర్భగుడిలో శివలింగం వెనుక ఈ ప్రత్యేకమైన ఛాయ కనిపిస్తుంది. పగటి వేళ వెలుతురు ఉన్నంతసేపూ దాదాపు అదే ప్రాంతంలో అది కనిపించడం గమనార్హం. సూర్యుడు తన స్థానాన్ని మార్చుకున్నా, సాధారణ నీడల మాదిరిగా దీని స్థానం మారకపోవడం ఈ నిర్మాణాన్ని మరింత ఆసక్తికరంగా మారుస్తోంది. సాధారణంగా కాంతి ఏ దిశ నుంచి వస్తే దానికి వ్యతిరేక దిశలో నీడ ఏర్పడుతుంది. కానీ ఛాయా సోమేశ్వరాలయంలో కనిపించే ఈ ప్రభావం అలా సులభంగా అర్థమయ్యేలా ఉండదు. అందుకే ఈ నీడ వెనుక ఉన్న నిర్మాణ సూత్రంపై ఇప్పటికీ ఆసక్తి కొనసాగుతోంది.
నీడకు అసలు మూలం ఏది?
ఈ క్షేత్రంలో మరో ఆసక్తికరమైన ప్రశ్న.. అసలు ఆ ఛాయకు మూలం ఎక్కడ? గర్భగుడి ప్రవేశద్వారం వద్ద ఉన్న రెండు స్తంభాల్లో ఏదో ఒకదాని నీడ కావచ్చనే అభిప్రాయం ఉన్నప్పటికీ, అది పూర్తిగా సరిపోలదు. ఎందుకంటే స్తంభాల మధ్య నుంచి ఏర్పడినట్లు కనిపించే ఈ ఛాయ గర్భగుడిలోని శివలింగం వెనుక భాగంలో పడుతుంది. దీంతో ఆ నీడకు కారణమయ్యే నిర్మాణ అంశం ఏమిటన్నది ఆసక్తిని కలిగించే అంశంగా మిగిలింది.
నీడ వెనుక శిల్పి ఆలోచన?
ఛాయా సోమేశ్వరాలయంలోని నీడ గురించి అత్యంత ఆసక్తికరమైన అంశం ఇదే. ఇది నిజంగా ఒక అద్భుతమా? లేక శిల్పి రూపొందించిన అద్భుతమైన నిర్మాణ సాంకేతికతా? ఆలయంలోకి వెలుతురు ప్రవేశించే మార్గం, గర్భగుడి నిర్మాణం, స్తంభాల స్థానాలు, గోడల అమరిక వంటి అంశాల సమన్వయంతో ఈ ప్రత్యేక ఛాయ ఏర్పడి ఉండవచ్చని భావిస్తారు. అంటే సూర్యుడి కాంతి నేరుగా శివలింగంపై పడకపోయినా, ఆలయ అంతర్గత నిర్మాణం ద్వారా ఏర్పడే కాంతి–నీడ ప్రభావం కావచ్చనే అభిప్రాయం ఉంది. అయితే ఈ నిర్మాణ రహస్యానికి సంబంధించి ప్రజల్లో ఇప్పటికీ ‘మిస్టరీ’ అనే ఆసక్తి కొనసాగుతూనే ఉంది. భక్తులకు ఇది దైవ మహిమగా కనిపిస్తే.. నిర్మాణ నిపుణులకు మాత్రం అప్పటి శిల్పుల అసాధారణ వాస్తు పరిజ్ఞానానికి నిదర్శనంగా అనిపిస్తుంది.
మూడు గర్భాలయాలు.. అందుకే త్రికూటాలయం
ఛాయా సోమేశ్వరాలయం మరో విశేషం దాని నిర్మాణ రూపకల్పన. ఒకే ఆలయ సముదాయంలో సూర్యుడు, శివుడు, విష్ణువులకు సంబంధించిన మూడు గర్భాలయాలు ఉండటంతో దీనిని ‘త్రికూటాలయం’ అని కూడా పిలుస్తారు. ఆలయ నిర్మాణంలో తూర్పు వైపు సూర్యదేవాలయం, పడమర దిశలో శివాలయం, ఉత్తర భాగంలో విష్ణు ఆలయం ఉన్నట్లు చెబుతారు. మూడు దైవాలకు సంబంధించిన గర్భాలయాలను ఒకే సముదాయంలో ఏర్పాటు చేయడం ఈ కట్టడంలోని ప్రత్యేకతను తెలియజేస్తుంది.
పడమటి గర్భగుడిలోని శివలింగంతోనే ప్రసిద్ధి చెందిన నీడకు సంబంధం ఉంది. మూడు గర్భాలయాల నిర్మాణంలో పోలికలు ఉన్నప్పటికీ, ప్రత్యేకమైన నీడ మాత్రం శివాలయంలోనే కనిపించడం ఈ ఆలయంపై మరింత ఆసక్తిని కలిగిస్తోంది. పశ్చిమ దిక్కున ఉన్న గర్భగుడిలో మాత్రమే నీడ కనిపించడాన్ని దేవుడి మాయ అని నమ్ముతారు. గర్బగుడిలో నీడకు, సూర్యుడి కాంతితో నిమిత్తం లేకుండా పగటి వేళల్లో వెలుతురు మాత్రమే ఉపయోగపడేలా నిర్మించినట్లు భావిస్తున్నారు. అయితే, ఈ నీడ ఎలా ఏర్పడుతుందనేది ఇప్పటికీ అంతుచిక్కని ప్రశ్నగానే మిగిలింది.
ఒక ఆలయం.. ఎన్నో విశేషాలు
పానగల్ ఛాయా సోమేశ్వరాలయం ఒకవైపు శైవ భక్తులకు పవిత్ర క్షేత్రం.. మరోవైపు చరిత్ర, వాస్తు, శిల్పకళపై ఆసక్తి ఉన్నవారికి ఆసక్తికరమైన అధ్యయన ప్రదేశం. మూడు గర్భాలయాల త్రికూట నిర్మాణం, రాతి శిల్పాలు, పురాతన శాసనాలు, జల లింగం, కోనేరు.. అన్నింటికంటే ప్రత్యేకంగా కనిపించే ఆ నీడ ఈ ఆలయాన్ని మిగతా క్షేత్రాల నుంచి భిన్నంగా నిలబెడుతున్నాయి. శతాబ్దాల క్రితం శిల్పులు రాతిలో దాచిన ఆ నిర్మాణ మేధస్సు.. నేటికీ సందర్శకులను ఆలోచింపజేస్తూనే ఉంది. అందుకే పానగల్ ఛాయా సోమేశ్వరాలయం తెలంగాణ చారిత్రక, వాస్తు వైభవంలో ఒక ప్రత్యేక అధ్యాయం. ఛాయసోమేశ్వర ఆలయానికి యునెస్కో గుర్తింపు కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి.